అమరావతి.. కేవలం ఒక్క పేరు మాత్రమే కాదు.. అదో అస్తిత్వం.. బౌద్ధం విలసిల్లిన నేల. కృష్ణమ్మ పరవళ్లు.. అమరలింగేశ్వరుని ఆశీర్వచనాలతో తులతూగే ధాన్యాగారం. ఉమ్మడి ఏపీ విభజన తరువాత ఏపీ రాజధాని ఎక్కడ అన్నపుడు వినిపించిన పేరు అమరావతి. ఆంధ్రులంటేనే.. ఒంటికాలిమీద లేచే గులాబీ బాస్ కేసీఆర్ కూడా.. కృష్ణానది ఒడ్డున అమరావతి రాజధానిగా అద్భుతమంటూ చెప్పారు. వాస్తును అమితంగా ఆరాధిస్తూ.. అనుసరించే కేసీఆర్ వంటి నాయకుడు సైతం జై కొట్టిన అమరావతి ఇప్పుడు.. అయినవారికే పరాయిదిగా మారింది. పాలకులు మారగానే.. రాజధాని మార్చాలనే కొత్త నినాదానికి జగన్ బాటలు వేశారనే అపవాదు మూటగట్టుకున్నారు. సీఎం జగన్ ఆ నాడు ప్రతిపక్ష నేతగా అమరావతి రాజధానిని సమర్ధించారు. ఎన్నికల్లోనూ రాజధాని అభివృద్ధి గురించి మాట్లాడారు. కానీ.. అధికారం చేతిలోకి రాగానే మరచిపోయారు. మూడు రాజధానులంటూ.. 29 వేల మంది రైతులు ఇచ్చిన 30 వేల ఎకరాల భూములను విస్మరించారు. కానీ.. అమరావతి రైతులు, కుల మతాలకు అతీతంగా ఏకమయ్యారు. 320 రోజులుగా పోరుబాట కొనసాగిస్తున్నారు.
తాము ఎంతగా అమరావతిని ప్రేమిస్తున్నామనేందుకు నిదర్శనంగా దేవేంద్రపాడు గ్రామానికి చెందిన దంపతులు అన్నే కృష్ణప్రసాద్, శారద దంపతులు తమ కుమారుడు పెళ్లి శుభలేఖలపై అమరావతిని కాపాడుకుందాం..ఆంధ్రప్రదేశ్‌ను రక్షించుకుందామంటూ అద్భుతైన నినాదం ముద్రించి బంధువులకు ఆహ్వానం పలుకుతున్నారు. పెళ్లి వేడుకను అమరావతి రాజధానికి వేదికగా మార్చటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
అమరావతి ఆంధ్రుల గొంతుక. రాజధాని మార్పుతో ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి నిర్ణయం కోట్లాది మంది తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. మాట తప్పను.. మడిమ తిప్పనంటూనే.. రాజధాని మార్పుతో ఎన్నికల హామీలు గాల్లో దీపాలనే సంకేతాలు పంపారు. కులాల మధ్య చిచ్చుతో ఇప్పటికే ఏపీ జనం ఇబ్బందులు చవిచూస్తున్నారు. రాజ్యాంగ బద్దమైన పదవుల్లో ఉన్న అధికారులకూ కులం అంటగట్టి సాగిస్తున్న దారుణాలు సగటు ఏపీ పౌరుడిని హడలెత్తిస్తున్నాయి. టీడీపీ పేరు వినిపిస్తే చాలు.. కొట్టండ్రా అనేంతగా పేట్రేగిపోతున్న ఫ్యాన్ రెక్కల గ్యాంగ్‌తో ఇప్పటికే చాలా ఊళ్లలోని తెలుగు తమ్ముళ్లు, టీడీపీ కార్యకర్తలు బతుకుజీవుడా అంటూ పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకోవాల్సి వస్తోంది. మరి ఈ దుస్థితి మారి.. మళ్లీ సాధారణ జీవనంలోకి ఎప్పుడు తొంగిచూస్తారనేది కాలమే నిర్ణయించాలి.



