అమరావతి ఉద్యమం ఒట్టి బోగస్ అంటున్నాడు. రమేష్ ఆసుపత్రి ఛైర్మన్‌ను చంద్రబాబు వెతికి తీసుకురావాలట. హైదరాబాద్‌లో ఉన్న బాబు దాచిపెట్టారంటూ కొత్తరాగం.. ఎందుకీ తాపత్రయం. గుంటూరు జిల్లాలో పుట్టిపెరిగి అదే జిల్లాకు అన్యాయం జరుగుతుంటే మంత్రి పదవి కోసం ఇంతగా దిగజారటం దారుణం అంటూ వైసీపీ శ్రేణులే విమర్శిస్తున్నాయట. ఎలాగైనా అధినేత కంట్లో పడాలి. ఏదో విధంగా మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాల! వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామంది ఇదే ఆలోచిస్తున్నట్టున్నారు. ఏ ఎండకా గొడుగు అన్నట్టుగా టీడీపీ నుంచి వలస వెళ్లిన నేతలు కూడా అదే చేస్తున్నారు. అమరావతి రాజధాని తరలింపు నిజంగానే గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలను బాధకు గురిచేస్తోంది. ఇది కుల, మతాలకు అతీతంగా కాదనలేని నిజం. ఇటువంటి సమయంలో వైసీపీ సీనియర్లు కూడా సంయమనంగా ఉంటున్నారు. అటువంటిది గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి నానా కష్టంపై గెలిచిన ఎమ్మెల్యే అంబటిరాంబాబు కాస్త అయోమయంలో పడినట్టున్నారు. అమరావతి ఉద్యమంపై నోరుజారారు. తాను ఎందుకిలా మాట్లాడుతున్నాననే విషయం కూడా అర్ధం చేసుకోలేంతగా స్పందించారు. వైసీపీ నేతలు కూడా అంబటి మాటలకు ఉలికిపాటుకు గురయ్యారట. 250రోజుల నుంచి రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. పోలీసుల కేసులు, లాఠీ దెబ్బలకు ఓర్చారు. ఇదంతా బాబు ఆడిస్తున్నదనేది పక్కనబెడితే.. అన్ని రోజులు దీక్ష చేపట్టడం అనేది ఎమోషన్‌తో కూడుకున్న అంశం. 30,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు మాత్రమే తెలిసే బాధ ఎవ్వరూ కాదనలేనిది. టీడీపీ, వైసీపీ, బీజేపీ రాజకీయ చందరంగంలో అమరావతి రైతులు మాత్రమే పావులుగా మారారనేది కాదనలేని నిజం. వ్యవసాయం చేసుకుంటూ హాయిగా ఉండే పల్లెల్లో రాజధాని చిచ్చు ఎవరు పెట్టమన్నారు! అధికార టీడీపీ నిర్ణయాన్ని తాను కూడా ఆమోదిస్తున్నానంటూ ఆ నాడు విపక్ష హోదాలో జగన్ ఎందుకు చెప్పాలని అమరావతి ప్రజల ప్రశ్నకు సమాధానం ఎవరివ్వాలి. ఇటువంటి క్లిష్టమైన సమయంలో అంబటి మాటలు సామాన్యులకే ఇబ్బందిగా అనిపించాయి. టీడీపీలో ఐదేళ్లపాటు పదవులు అనుభవించిన తాడికొండ నుంచి గెలిచి మంత్రిగా ఎదిగిన డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇటీవలే వైసీపీ కండువా కప్పుకున్నారు. తాను కూడా అంబటిని మించి అమరావతి ఉద్యమం గురించి మాట్లాడటంపై రాజదాని ప్రాంత ప్రజలు నిరసన వ్యక్తంచేస్తున్నారు. డాక్టర్ రమేష్‌ను చంద్రబాబే దాచాడంటూ చెప్పటంపై కూడా సర్వత్రా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నమాట.