అబ్బా.. ఇదేం లెక్క అని ఆశ్చర్యపోకండీ. ఏపీలో పాలిటిక్స్ వింతగా ఉంటాయి. విమర్శలకు అంతు ఉండదు. పైగా వ్యక్తిగతంగా అవతలి వాళ్లను చులకన చేయటంలో వాళ్ల శైలి వేరు. పార్టీతో సంబంధం లేకుండా.. నేతలందరూ ఇదే ఫాలో అవుతూ ఐకమత్యాన్ని చాటుకుంటారు. ఇప్పుడు ఇది కొత్తేం గాకపోయినా.. ఆనవాయితీను ఇప్పటి ఏపీ మంత్రులు కూడా అనుసరిస్తున్నారు. మరీ చెప్పాలంటే కొడాలి. బోండా ఉమా, దేవినేని, బుద్దా వెంకన్న వంటి వాళ్లు మరో అడుగు ముందుకేసి మేం రెండాకులు ఎక్కువే చదివామంటూ నిరూపించుకుంటున్నారు. ఎంతైనా.. సోదర రాష్ట్రం కదా! తెలంగాణ మంత్రులు కూడా మీకంటే మేం పదాకులు ఎక్కువనే నేర్చుకున్నామనే రీతిలో తరచూ నోరుజారుతున్నారు. ఇప్పుడు అదే నోరుజారుడు తెలంగాణలోని టీఆర్ ఎస్ సర్కారుకు తలనొప్పిగా మారింది. కేసీఆర్ దేవుడు.. కేటీఆర్ కాబోయే సీఎం అంటూ ప్రశంసల సంగతి పర్వాలేదు. కానీ.. మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, ధర్మారెడ్డి వంటి సీనియర్లు కూడా సున్నితమైన అంశాలను గెలికి మరీ జనం నుంచి విమర్శలు చవిచూస్తున్నారు.
ముదిరాజ్ సంఘం భవన ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని మాటలు గంగపుత్ర వర్గానికి కోపాన్ని తెప్పించాయి. ఒక విధంగా మంత్రిని బర్తరఫ్ చేయాలంటూ గంగపుత్రుల సంఘాలు నిరసనలు తెలిపాయి. విద్యాసాగర్‌రావు, ధర్మారెడ్డి ప్రస్తుతం అయోధ్యలో తలపెట్టిన రామమందిర నిర్మాణంపై నోరుజారి హిందు సంఘాల్లో అభాసుపాలయ్యారు. వరంగల్ జిల్లా ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇటీవల ఓసీ సంఘ నేతల సమావేశంలో కిందివర్గాలను తూలనాడుతూ కామెంట్స్ చేశారు. ఆ వర్గాలకు చెందిన అధికారులకు అక్షరం ముక్క రాదంటూ ఏదో చెప్పబోయి ఏదో అన్నాడు. అంతే..ప్రజాసంఘాల దెబ్బకు ఏం చెప్పాలో పాలుపోక సారీ చెప్పి.. మీడియా తన మాటలను వక్రీకరించిందంటూ తప్పును మీడియాపై నెట్టే ప్రయత్నం చేశారు. ఇలా.. ఎవరికి వారే.. ఏపీ మినిస్టర్లను మించేలా.. కామెంట్స్ చేస్తూ తరచూ అభాసు పాలవుతున్నారు. పరోక్షంగా తమ వల్ల మున్ముందు సొంత పార్టీను దెబ్బతీస్తున్నామని.. తమను నమ్మి పదవులు కట్టెబెట్టిన అధినేతల అధికారానికే ఎసరు పెడుతున్నామనేది గ్రహించలేకపోతున్నారంటూ పార్టీ కేడర్ ఆందోళన.