ఏపీలో స్థానిక ఎన్నికలు జరపాలి. కేంద్ర నిధులు వెనక్కి పోతాయంటూ ఎనిమిది నెలల క్రితం వైసీపీ సర్కారు అన్న మాటలు. సారీ.. ఇప్పుడు కరోనా ఉంది.. కేసులు పెరిగితే ప్రజల ప్రాణాలకు నష్టం.. ఎన్నికల సంఘం వద్దనేందుకు చెప్పిన కారణం. ఇప్పుడు ఇదే సీన్… గాకపోతే. ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం సిద్ధమంటుంది.. తూచ్.. కరోనా కేసులు వేలల్లో ఉన్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమా! అంటూ వైసీపీ సర్కారు వాదిస్తోంది. నువ్వు తమలపాకుతో ఒకటంటే.. నేను తలపుచెక్కతో నాలుగు అంటానన్నట్టుగా ఉంది. వాతావరణం.. ఫిబ్రవరి నాటికి ఎన్నికలు జరిపి తీరాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చెబుతున్నారు. మీ ఇష్టం కాదు.. మా అబీష్టం కూడా ఉండాలంటోంది వైసీసీ ప్రభుత్వం. దీంతో విషయం కోర్టులో తేల్చుకుంటానంటూ ఎన్నికల అధికారి మరోసారి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారన్నమాట.
ఏపీలో లోకల్ ఎన్నికలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా వివిధ రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించిన ఎన్నికల అధికారి దాదాపు ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. కానీ వైసీపీ పార్టీ మాత్రం కరోనాను కారణంగా చూపుతూ ఎన్నికలు వాయిదా వేయాలంటుంది. కానీ ఎన్నికల సంఘ అధికారిపై ఉన్న వ్యక్తిగత కక్షతోనే ఇదంతా చేస్తున్నారంటూ టీడీపీ వంటి పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ తీరు చూస్తుంటే నిమ్మగడ్డ పదవీ విరమణ చేసేంత వరకూ ఎన్నికలకు ప్రభుత్వ ఆమోదం రాకుండా చేస్తుందనే వాదన కూడా లేకపోలేదు. తాజాగా బుధవారం నిర్వహించాల్సిన సమావేశానికి జిల్లా అధికారులు ఎవ్వరూ రావట్లేదంటూ సీఎస్ స్వయంగా ఎన్నికల అధికారికి సెల్‌పోన్ మెస్సేజ్ ద్వారా తెలిపారు. ఎన్నికల సమయంలో ఓటర్ల నమోదు, నిర్వహణ కొనసాగుతున్న వేళ అధికారులను బదిలీ చేయవద్దంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు కూడా సర్కారు పట్టించుకున్నట్టుగా లేదు. రెండ్రోజుల క్రితమే డీఎస్పీలను బదిలీ చేశారు. రెవెన్యూతో సహా పంచాయతీరాజ్ తదితర శాఖల ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా ఊపినట్టుగా తెలుస్తోంది. మరి.. ఈ లెక్కన… సర్కారు వర్సెస్ ఎన్నికల సంఘం మధ్య అంతర్గత యుద్దం ఎప్పటికి చల్లారుతుందో.. సజావుగా ఎన్నికలు జరిపేందుకు ఎప్పటికి సిద్ధమవుతారనేది వేయిడాలర్ల ప్రశ్నగా మారిందన్నమాట.