కరోనా వైరస్ మరో నేతను బలితీసుకుంది. విజయవాడ ప్రభుత్వ కొవిడ్ కేంద్రంలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నాయకుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు శుక్రవారం మరణించారు. నాలుగు రో్జులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించి కనుమూసినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యులు మాత్రం సరైన వైద్యం అందలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన కీలక నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీ హయాంలో కాపు కార్పోరేషన్ మొదటి ఛైర్మన్ గా పనిచేశారు. రామాంజునేయుల మృతిపట్ల ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర తదితరులు సంతాపం తెలియజేశారు.
అఖిల భారత కాపు సమాఖ్య అధ్యక్షుడు,కాపు కార్పోరేషన్ మాజీ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు మృతి పట్ల కాపునాడు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణ కాపునాడు అధ్యక్షులు కటారి అప్పారావు, కాపునాడు రాష్ట్ర కార్యదర్శి , మాజీ ప్రభుత్వన్యాయవాది,కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలు లకసాని కమల కుమారి, అమలాపురం పార్లమెంటు కాపునాడు అధ్యక్షులు జిన్నూరి సాయిబాబా, రాజమండ్రి సిటీ కాపునాడు అధ్యక్షులు గుదే రఘు నరేష్, న్యాయవాది, కాపునాడు లీగల్ అడ్వైజర్ టి.వి.గోవిందరావులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తంచేశారు.కాపులకు ఆయన చేసిన సేవలు కొనియాడారు.కాపునాడు ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు.



