ఆంధ్రరాజకీయం కొద్దికొద్దిగా వేడెక్కుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. అసలు మెలిక అక్కడే ఉంది. వాస్తవానికి మార్చిలోనే లోకల్ పోల్ పూర్తిచేయాలని వైసీపీ సర్కారు తెగ ఉబలాటపడింది. వేలాది స్థానాల్లో నయానో.. భయానో ఫ్యాన్‌గుర్తుకే ఏకగ్రీవం చేసుకుంది. గతంలో టీడీపీ ఏం చేసిందో.. ఇప్పుడు వైసీపీ కూడా అదే చేసిందనుకోండి. అసలు తంటా అక్కడే మొదలైంది.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తూచ్.. కరోనా వైరస్ ఉందంటూ ఎన్నికలను వాయిదా వేశారు. పైగా ఎన్నికల్లో ఎటువంటి అవకతవకలు జరిగినట్టు రుజువైనా మాంచి శిక్షలు విధించేలా వైసీపీ చేసిన ఆర్డినెన్స్‌పై నీళ్లు చల్లారు. గెలుపు ఊపు మీదున్న జగన్ మోహన్‌రెడ్డి ఆశను అడియాశలు చేశారు.
అంతే.. దిక్కారమున్ చేతువా.. అంటూ జగన్ సర్కారు వెంటనే మరో జీవో ద్వారా రమేష్‌కుమార్‌ను మాజీ చేసింది. అప్పటికప్పుడు తమిళనాడులో ఉన్న దళిత మాజీ న్యాయమూర్తిని తీసుకొచ్చి ఎన్నికల అధికారిని చేసింది. చూశారా.. మా జగన్ సార్.. దళితులకు ఎంతటి ప్రయార్టీ ఇచ్చారోనంటూ వైసీపీ కూడా మంచి రాగమే అందుకుంది. ఎన్నికల అధికారిగా రమేష్‌కు ఉద్వాసన పలకటం వెనుక కేవలం కమ్మ వర్గం కావటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ అనే అభిప్రాయమే కారణంటూ టీడీపీ ఎదురుదాడి చేసింది. చివరకు ఎలాగైతేనేం.. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్లీ రమేష్‌కుమార్ పాత కుర్చీలో కూర్చుని పంతం నెరవేర్చుకున్నారు.
హమ్మయ్య అనుకున్నా.. నిధులు ఇవ్వక ఏపీ సర్కారు ఇబ్బందులు పెడుతుందంటూ మళ్లీ రమేష్ గారు హైకోర్టుకు చేరారు. ఏపీ సర్కార్ ఎందుకిలా ఎన్నికల కమిషన్‌ను ఇబ్బంది పెడుతుందో ఓ కంట కనిపెడతానంటూ వార్నింగ్ తో నిధులు మంజూరయ్యాయి. హమ్మయ్య.. నిధులు వచ్చాయి.. ఇప్పుడు పనులు మొదలు పెట్టాల్సిందేనంటూ ఎన్నికల కమిషనర్ వెంటనే ఈ నెల 28న స్థానిక ఎన్నికలపై సమావేశం షురూ అంటూ ప్రకటించారు. ఇక్కడే వైసీపీ నేతలకు అరికాలిమంట నెత్తికెక్కింది. మీరు ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలేనా! ఔరా.. కరోనా వైరస్ రెండో సారి విరుచుకుపడేందుకు రెడీగా ఉంది. నవంబరు, డిసెంబరులో దుమ్ములేపుతుందంటూ ఎన్నికలు వద్దంటూ వారిస్తున్నారు. విపక్షాలు మాత్రం ఊరుకుంటాయి. ముఖ్యంగా టీడీపీ.. ఏడాదిన్నర క్రితం పోయిన పరువును మళ్లీ లోకల్ వార్‌లో గెలిచి సాధించుకోవాలని తెగ ఉబలాటంలో ఉంది కాబోలు.. వైసీపీ భయపడుతుందంటూ ఎద్దేవా చేస్తుంది. బిహార్‌లో ఎన్నికలు, తెలంగాణలో ఉప ఎన్నికలు, రేపోమాపో.. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లు జరిపేందుకు రెడీ అవుతుంటే.. ఏపీలో మాత్రమే కరోనా అడ్డొచ్చిందా అంటూ నిలదీస్తోంది.
ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. వైసీపీ సర్కారు ఇచ్చిన ఆర్డినెన్స్ గడవు మూడు నెలల ముగిశాయి. ఇప్పుడు కొత్తగా మరోసారి ఆర్డినెన్స్ తేవాలి. పైగా.. ఇంతకుముందు చేతికి అందిన ఏకగ్రీవాలన్నీ ఉంటాయో.. ఉండవో చెప్పటం కూడా కష్టమే. పైగా ఏపీలో వైసీపీ సర్కారు పట్ల కాస్త వ్యతిరేకత పెరిగింది. ఇవన్నీ టీడీపీ తనకు అనుకూలంగా మలచుకుంటుందనే భయం కూడా లేకపోలేదు. అమరావతి రాజధాని తరలింపు, అడ్డగోలుగా నమోదు చేస్తున్న కేసులు, పెరిగిన దాడులు, రెడ్డి వర్గానికే ప్రాధాన్యత అనే ఆరోపణలు.. హిందుదేవాలయలపై వరుస దాడులు ఇవన్నీ వైసీపీను స్థానిక ఎన్నికల్లో ఇబ్బంది పెడతాయనే ఆందోళన కూడా ఫ్యాన్ నేతలకు లేకపోలేదు. ఈ సారి బీజేపీ, జనసేన పొత్తుతో ఎంతోకొంత వైసీపీ, టీడీపీ ఓటు బ్యాంకుకు చిల్లు పెడతాయనే వాదన బలంగా వినిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో ఏ మాత్రం వైసీపీ లెక్కలు తారుమారైనా.. 2024 నాటికి భారీమూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందనే గుబులు వైసీపీ శ్రేణులది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోపోతే.. సైకిల్ పరుగులకు బ్రేక్‌లు పడినట్టేనని తెలుగుతమ్ముళ్ల అంతర్మథనం.