తెలుగు రాష్ట్రాలపై పట్టు సాధించేందుకు బీజేపీ వ్యూహం చాలా వరకూ వర్కవుట్ అయింది. ఏపీ కాపు, తెలంగాణలో మున్నూరు కాపు వర్గానికి చెందిన సోము వీర్రాజు, బండి సంజయ్‌లకు పగ్గాలిచ్చింది. జనసేనాని కూడా కాపు వర్గానికి చెందిన నాయకుడు కావటంతో ముగ్గురు కలసి పనిచేస్తారనేది కమలం అసలు వ్యూహం. సేనాని ఎంత తనకు కులం అంటకట్టవద్దని వారించినా కుల సమాజంలో ఇవన్నీ ఎవరు వినరనేది.. ఒకవేళ తనకు కులం లేదంటూ చెప్పినా నవ్వులాటగా భావిస్తారంటూ గుసగుసలూ లేకపోలేదు. నిజానికి.. కాపు, మున్నూరు కాపు వర్గాలు రెండూ చాలా కీలకమైనవే. బలమైన వర్గాలు కూడా. కానీ.. ఐకమత్యం లేకపోవటం.. అందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి నడిపించే నాయకత్వమే లోపంగా మారింది. ఫలితంగా ఓట్లశాతం భారీగా ఉన్న ఏదో ఒక పార్టీ పంచన కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. దీన్ని రాజకీయపార్టీలు కూడా తమకు అనుగుణంగా వాడుకుంటున్నాయనేది కూడా బహిరంగ రహస్యం. దీన్ని సరిదిద్ది.. కాపులను దగ్గర చేర్చుకోవటం ద్వారా బీజేపీ అధికార పగ్గాలు చేపట్టాలనేది ఆ పార్టీ ఎత్తుగడ.
దానిలో భాగంగానే ఏపీలో సోము వీర్రాజు, తెలంగాణలో బండి సంజయ్‌లు పగ్గాలు అప్పగించారు. కానీ.. వారికి స్వేచ్ఛనివ్వటంలో మాత్రం వెనుకడుగు వేశారు. తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ వంటి వాళ్లు ముందుకు వచ్చి బండిని వెనక్కు నెడుతున్నారనే గుసగుసలున్నాయి. ఏపీలో సోము వీర్రాజు దూకుడుగా ఉన్నంత కాలం.. హిందుత్వ సంఘాలు జనసేన కార్యకర్తలు కలసి పనిచేశారు. కొద్దికాలం క్రితం అక్కడ కూడా పురందేశ్వరిని తెరమీదకు తీసకువచ్చి నాయకత్వం ఆమె చేతిలో ఉండాలనే విధంగా ఆదేశించారు. దీంతో సోమన్న వేగానికి బ్రేకులు పడ్డాయి.
వాస్తవానికి దుబ్బాకలోబీజేపీ రఘునందన్‌రావు గెలుపు వెనుక బండి సంజయ్ నాయకత్వం ఉంది. పైగా అక్కడి మున్నూరు కాపు ఓటర్లు రఘునందన్‌రావు నాయకత్వానికి బలపరిచారనేందుకు గెలుపే నిదర్శనం. కానీ. జనసేనతో గ్రేటర్ ఎన్నికల కోసం బీజేపీ పొత్తు అంశంలో బండి సంజయ్‌ను వెనక్కి నెట్టారు. రాష్ట్ర నాయకుడుగా ఆయనను ముందు ఉంచి నడిపించాల్సిన మంత్రాంగాన్ని కిషన్‌రెడ్డి హైజాక్ చేశారనే గుసగుసలూ లేకపోలేదు. ఇది బండికి కాస్త ఇబ్బంది ఉందనే ప్రచారం జరిగింది. ఇద్దరు బలమైన నాయకులకు పగ్గాలు ఇచ్చిన బీజేపీ.. వారికి స్వేచ్ఛనివ్వటంలో ఎందుకింత వెనుకాడుతుందనేది పార్టీ శ్రేణుల ఆవేదన.