20..21..30..32. 34 సెంటీమీటర్లు ఎన్నడూ చూడని వర్షం.. ఎప్పుడూ లేని వరద. తెలుగు రాష్ట్రాలపై వానదేవుడు పగబట్టినట్టున్నాడు. వరుసగా రికార్డు స్థాయిల్లో భారీవర్షాలతో కలవరం కలిగిస్తున్నాడు. అమరావతి, హైదరాబాద్ నగరాలు భారీగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే వేలాది కాలనీలు నీటిలోనే మగ్గుతున్నాయి. వీరికి సహాయం అందించటం ప్రభుత్వాలకూ సవాల్‌గా మారింది. దీనంతటికీ కారణం.. ప్రకృతి విపత్తేనంటూ నిందించుకున్నా.. మానవ తప్పిదాలు కూడా కారణమంటున్నారు వాతావరణ నిపుణులు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుమారు లక్ష వరకూచెరువులుంటాయి. హైదరాబాద్‌లోనే 4000 చెరువులున్నాయి. వీటిలో దాదాపు సగానికి పైగా ఆక్రమణకు గురయ్యాయి. ప్రకృతి సిద్ధంగా వరదనీటి నిల్వకు తవ్విన చెరువులు ఇళ్లుగా మారటంతో ఇప్పుడు అవన్నీ వరదనీటితో నిండి ఇళ్లమీదకు వస్తున్నాయి. సగటున హైదరాబాద్‌లో 10 సెంటీమీటర్ల వర్షం కురిస్తే.. వచ్చే నీరు ఎంతో తెలుసా.. 75 00 కోట్ల లీటర్లు. మరి మూడింతలు కురిసిన వర్షంతో.. 26,500 కోట్ల లీటర్ల నీరు చేరింది. మరి ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంటుందనేది అర్ధం చేసుకోవచ్చంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు. ఇప్పటికే హైదరాబాద్‌లో 3000 కాలనీలు.. 5 లక్షల మంది జనాభా వరదనీటిలోనే చిక్కాయి. ఇటువంటి భారీవర్షం మరోసారి పడితే హైదరాబాద్ ఉనికే ప్రశ్నార్ధకంగా మారుతుందనే ఆందోళన లేకపోలేదు.



