విదేశీ విద్య..అందే ద్రాక్షపండు

1960 నుండి 1990 దశకం వరకు విదేశాల్లో విద్యానభ్యసించాలంటే అందని ద్రాక్షపండే. ప్రపంచీకరణ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనైనా విద్యనభ్యసించే అవకాశం దొరికింది..చాలా దేశాలు వీసాల మీద ఆంక్షలు తొలగించాయి..ముఖ్యంగా అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ముందు భాగంలో ఉన్నాయి. అయితే యూరప్ దేశాల్లో విద్య ఒక జర్మనీ లో తప్ప మిగతా దేశాల్లో అతి ఖర్చుతో కూడుకున్నది. దేశీయంగా అవకాశాలు లేక వున్నా అతి తక్కువ జీత భత్యాలు ఉండటం వల్ల ఉన్నత విద్యనభ్యసించిన ప్రతిభ గల విద్యార్థులు , శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణులు వలస పోవడం ఎక్కువయింది..దీనికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం ఒక కారణం. అత్యధిక వడ్డీ రేటు వసూలు చేసి దేశీయ బ్యాంకులు బాగుపడుతున్నాయి.

స్వదేశంలో వున్నప్పుడు పిల్లలు ఇంటిదగ్గర కనీసం ఓ పాల పాకెట్, బజారు వెళ్లి కూరగాయలు తీసుకురావడం , తండ్రి వృత్తిలో సహాయ పడటం అవమానం గా భావిస్తారు. తల్లితండ్రులు కూడా మా అబ్బాయి బి.టెక్ చదివాడు.వాడికి అంత చిన్న చిన్న పనులు ఏమి చెబుతాము అంటూ డాంబికాలు పోవడం తరచూ మనం చూస్తూనే ఉంటాము..

లక్షల ఫీజ్ కట్టి విదేశాల విశ్వవిద్యాలయాల్లో చేరిన తరువాత రోజువారీ ఖర్చుల కోసం పార్ట్ టైం జాబు ల్లో చేరి విద్యానభ్యసించడం సహజం.
పార్ట్ టైం ఉద్యోగం అంటే ఏమిటి.. హోటల్స్ లో గిన్నెలు కడగడం, ఫుడ్ ప్యాకెట్లు డోర్ డెలివరీ ఇవ్వడం, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ పంప్ ల్లో, గోడౌన్ లో బరువుగల ప్యాకేజీ లు మోయడం. అయితే వీళ్ళు విదేశీయులయినందువల్ల ఆయా దేశాల్లో అవమానాలు, చులకనగా చూడటం, కొన్ని సందర్భాల్లో చేయి చేసుకోవడం జాతి విద్వేషం తో కొన్ని సందర్భాల్లో కాల్పులు మన పిల్లలపై జరపడం కూడా జరుగుతుంది…బి.టెక్ చదువుకున్న వ్యక్తికి కనీసం డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం కూడా ఇవ్వరు..ఒక్క అమెరికా లో తప్ప మిగతా దేశాల్లో పార్టీ టైం ఉద్యోగాలు అంత తేలికగా దొరకవు..దొరికినా స్థానికులకు ఇచ్చే పారితోషికం లో సగం రేటు కూడా ఇవ్వరు. విద్యార్థులు జాబు దొరకక, ఇటు స్వదేశానికి తిరిగి రాలేక నరకయాతన అనుభవిస్తున్నారు..ఇది ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా, వాస్తవం..చదువు పూర్తి అయ్యాక తాత్కాలిక వీసా/ OPT/Profesional Year మంజూరు చేయడం ఒక తంతు..పిల్లలు రెక్కలు ముక్కలు చేసుకొని పార్టీ టైం జాబ్ చేసి సంపాదించిన డబ్బు మొత్తము తాత్కాలిక వీసాల మంజూరుకు ఫీస్ లు చెల్లించాలి..ఆయా దేశాలు డబ్బులు గుంజడానికి పనికిరాని ఆంక్షలు, పరీక్షలు పెట్టి డబ్బు దోచుకుంటున్నాయి..ఇది పూర్తి అయ్యాక స్థిర నివాసం కొరకు పెద్ద మొత్తంలోనే చెలించాలి. ఈ నిధులు సమకూర్చుకోవడం కోసం విద్యార్థులు పడే పాట్లు అన్నీ ఇన్ని కావు..ఇవన్ని పిల్లలు తమ తల్లుదండ్రులకు చెప్పరు.ఇక్కడ మరొక విషయం ఒప్పుకోక తప్పదు. అదేమంటే విద్యార్థులు శ్రమకు అలవాటు పడడం, క్రమశిక్షణ, ఓర్పు నేర్చుకోవడం మంచి పరిణామం..

స్థిరనివాస వీసా జారీ విధానం ఒకో దేశంలో ఒకో విధంగా ఉంది. విదేశీ విద్యార్థుల శ్రమను అతి తక్కువ వేతనం తో దోచుకోవడం ఒకటి , రెండవది వాళ్ళు కష్ట పడి సంపాదించుకున్న మొత్తాన్ని పరీక్షలు, వీసాల పేరుతో దోచుకోవడం.

విదేశీ విద్యార్థుల విషయంలో ప్రతి సేవకు అధిక రేట్లు చెల్లించాల్సిందే..ఉదాహరణకు అద్దె ఇల్లు రిజిస్ట్రేషన్ ఫీస్, వైద్యం, కార్ ఉంటే దాని రెన్యువల్ ఫీస్..విదేశీ విద్యార్థులు ద్వారా వచ్చే ఆదాయం తో ఆ యా దేశాలు ఆర్ధికంగా బలపడుతున్నాయి. అదీకాక మేధోసంపత్తి పెరిగి అన్ని రంగాల్లో పురోగతి సాధించి అగ్రదేశాలుగా నిలుస్తున్నాయి.

ఇవన్నీ తెలియక విదేశానికి పంపుతున్నామా అంటే అన్నీ తెలుసు. స్వయంగా అనుభవించిన తండ్రిగా ఈ వ్యాసం రాస్తున్నాను. ఈ విషయాల్లో నేను అతీతుడిని కాను..మిగతా వారికి కొందరికైనా తెలుస్తుందని నా తపన.

పరిపాలకులు మేధో సంపత్తి వలసలపై ఏ మాత్రం దృష్టి సారించకపోవడం దురదృష్టకరం. దేశీయంగా ఉత్పత్తి, సేవారంగాల్లో ఉపాధి అవకాశాలు పెంచి అధిక జీత భత్యాలు ఇవ్వడం మరియు సమాజ అవసరాలను తీర్చే దిశలో పరిశోధనలు చేసే విధంగా విద్యార్థులను తయారు చేసినట్లయితే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పధంలో దూసుకుపోవడం ఖాయం..విదేశాల్లో విద్య నభ్యసించినా తిరిగి స్వదేశం వచ్చే విధంగా ఆకర్షణీయమైన పథకాలు రచించి అమలు చేసినట్లయితే సత్ఫాలితాలు ఇస్తాయి…

విద్యార్థులు ఉన్నత విద్య నిమిత్తం ఏ ఏ దేశాలకు ఏ ఏ రాష్ట్రాలనుండి తరలిపోతున్నారనేది ఈ క్రింది గణాంకాలను పరిశీలిద్దాం

2017-18 లో 7,86,576 మంది విదేశాలకు వెళ్ళగా 2018-19 లో 6,21,156 మంది విద్యార్థులు విదీశీ బాట పట్టారు.. ఒక్కొక్క విద్యార్థి కనిష్టంగా చెల్లించే సరాసరి ఫీజ్ 20 లక్షలు చొప్పున లెక్కిస్తే 2017-18 లో విదేశాల ఖాతాలో జమ అయిన దేశీయ ద్రవ్య సంపద విలువ
రూ.1,57, 315 కోట్లు..

అమెరికా…211203 మంది
కెనడా..124000 మంది
ఆస్ట్రేలియా..87125 మంది
సౌదీ అరేబియా..20800 మంది
యునైటెడ్ అరబ్
ఎమిరేట్స్.. 50000 మంది
ఇతర దేశాలు..293448 మంది
(ఇందులో సింహభాగం ఇంగ్లాండ్ జర్మనీ ఫ్రాన్స్ దేశాలకు పయనమయ్యారు.)

రాష్ట్రాలు/ప్రాంతాల వారీగా
గణాంకాలు..

రెండు తెలుగు రాష్ట్రాలు..25%
కర్ణాటక…7%
గుజరాత్..7%
మహారాష్ట్ర..22%
ఢిల్లీ..7%
తమిళనాడు..8%
పశ్చిమ బెంగాల్..3%
ఇతర రాష్ట్రాలు..23%

( Statistics Source : www.iceabroad.com )

-పెర్నా విశ్వేశ్వరరావు, విశ్లేషకులు

 

2 COMMENTS

  1. ఎందుకనో శీర్షిక కు కథనం కు పొంతన కుదర లేదు అనిపించింది. కొద్దిగా వివరించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here