శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చిందనే సామెత తెలుసు కదా! ఏపీ రాజకీయాలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. చంద్రబాబునాయుడు అపర చాణక్యుడు.. ఇద్దర్ని ప్రధానిగా చేసిన ఘన చరిత్రగల నేత. దేశ, విదేశాల్లో అయినవారి అండదండలు. న్యాయస్థానాల్లో తన వారి సలహాలతో ఇన్నేళ్లు నెట్టుకొచ్చారు. ఇప్పుడు ఏడు పదుల వయసులో జైలు ఊచలు భయపెడుతున్నాయి. తన వారికి కోసం కమ్మగా నిర్మిద్దామని కలలుగన్న కమ్మరావతి.. సారీ భ్రమరావతి సారీ అమరావతి ఇప్పుడు సంకెళ్లు వేయనుందనే గుబులు బాబు అండ్ కో పాలిట సింహస్వప్నంగా మారింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే అసలే బాబు అంటే ఎంతమండిపడతారో అందరికీ తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నపుడే ఆ కేసులు. ఈకేసులంటూ కంటిమీద కునుకు లేకుండా చేశారు. అటువంటిది ఇప్పుడు అధికారంలో ఉన్నపుడు ఊర్కుంటారా.. 500 ఎకరాల అసైన్డ్ ల్యాండ్‌ను స్వాహా పర్వంలో నాటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ప్రమేయం ఉందంటూ సీఐడీకు ఫిర్యాదు చేశారు. వారు మాత్రం తక్కువ తిన్నారా.. ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేశారు. మంగళవారం హైదరాబాద్ వెళ్లి బాబోరికి 41 సీఆర్ పీసీ కింద నోటీసులు జారీ చేశారు. బాబు గారు కూడా వాటిని స్వీకరించి.. ఇట్టాంటివి ఎన్ని చూడలేదు. ఒక్క పిటీషన్ వేస్తే చాలంటూ లైట్‌గా తీసుకున్నారు.
నిజమే ఒక పార్టీ అధినేత, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఎన్ని చూసుంటారంటూ తెలుగు తమ్ముళ్లు కూడా వైసీపీ ప్రభుత్వ తీరును చూసి తెగ నవ్వుకున్నారట. అయితే ఇక్కడే అసలు ట్విస్టు.. అవినీతి కంపు, జైలు ఊచలు, చిప్ప తిండి ఇవన్నీ చంద్రబాబు రుచిచూడక తప్పదంటూ వైసీపీ శ్రేణులు దుమ్మెత్తిపోస్తున్నాయి. దీంతో బాబు గారు సీఐడీ విచారణకు హాజరుకావాలా! హైకోర్టులో స్వ్కాష్ పిటీషన్‌తో తూచ్ చెప్పాలా అనే దానిపై తర్జనభర్జన పడుతున్నారట. ఒకవేళ వెళితే.. అరెస్టయితే ఏమిటీ సంగతి అనే అనుమానం కూడా లేకపోలేదు. ఎందుకంటే.. గతంలో జగన్ మోహన్‌రెడ్డిని కూడా అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణకు పిలిచి ఆ తరువాత అరెస్ట్ అంటూ ప్రకటించింది. ఇప్పుడు సేమ్ టు సేమ్ సీన బాబు విషయంలో కూడా జరిగితే.. అమ్మో ఇంకేమైనా ఉందా.. నేను నిప్పు.. మా నాన్న నిప్పుకే నిప్పంటూ చెప్పే లోకేష్‌బాబు పరవు ఏం కావాలి.
అసలే రేపటి సీఎం.. రెండ్రోజుల క్రితమే.. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు చేతిమీద నెరిసిన వెంట్రుకను కూడా కదల్చలేదంటూ చినబాబు సవాల్ కూడా విసిరారు. ఇన్ని సవాళ్లు.. కోర్టుల్లో తమ వారి హవా ఉన్నపుడు కూడా చంద్రబాబు అరెస్టయితే ఇక టీడీపీ కథ మాత్రమే కాదు..చంద్రబాబు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టుగానే లెక్కలు కడుతున్న తెలుగు తమ్ముళ్లూ లేకపోలేదు. మరి ఇవన్నీ ఎదుర్కొని.. ఎలా బయటపడతారనేది కూడా ఏపీ, తెలంగాణల్లోనే కాదు.. జాతీయ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారిందట. అసలే ఐదు రాష్ట్ర్ర ఎన్నికలు.. చంద్రబాబు పెద్దరికాన్ని గౌరవిస్తూ.. ఏదోఒక పార్టీ ప్రచారానికి పిలవకపోతుందా! అని ఎదురుచూస్తున్న బాబు అండ్ బ్యాచ్ కు సీఐడీ పిలుపు రావటమే జీర్ణించుకోలేకపోతున్నారట .



