వైసీపీ ఎమ్మెల్యేల్లో భూమన కరుణాకర్‌రెడ్డి రూటే సపరేటు. సీనియర్‌గా పేరున్నా.. ఎందుకనో మరీ అధినేత జగన్ మంత్రివర్గంలో చోటివ్వలేదు. నామినేటెడ్ పోస్టు అదనంగా వస్తుందని ఆశించినా నిరాశే మిగిలింది. చిత్తూరు జిల్లాలో జూనియర్లు చెవిరెడ్డి, రోజా కూడా మాంచి పొజిషన్ ఇచ్చిన జగన్ మోహన్‌రెడ్డి తనను పక్కన బెట్టడంపై కాస్త గుర్రుగానే ఉన్నారు. తండ్రి మనసు గెలిచినా.. తనయుడుని ప్రసన్నం చేసుకోవటంతో ఎమ్మెల్యే గారు ఎక్కడో పప్పులో కాలేశారనేది మాత్రం అర్ధమవుతూనే ఉంది. ఈ మధ్యనే కరోనా భారినపడిన ఆయన రియా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఎందుకిలా అంటే.. అందరూ అపోలో, యశోద అంటూ కార్పొరేట్ ఆసుపత్రులకు పోతే ఎలా! జనాలకు సర్కారు దవాఖాన మీద నమ్మకం కలగొద్దా! అంటూ మాంచి కిక్ ఇచ్చే మాటే చెప్పారు. కొద్దిసేపు అవన్నీ పక్కనబెడితే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు కుట్రపన్నారనే అభియోగాలతో హక్కుల నేత వరవరరావును పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు . ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న వరవరరావు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా కరోనా భారీనపడినట్టు కూడా వార్తలు వచ్చాయి. 80 ఏళ్లు దాటిన ఆయనను విడుదల చేయాలంటూ.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కేంద్రానికి లేఖరాయటం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని హత్యకు కుట్రపన్నాడంటున్న వ్యక్తిని మీరు విడుదల చేయమంటారా! అంటూ బీజేపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అంటే.. మీరంతా మోదీ చల్లగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా! అంటూ మోకాలి.. బోడి గుండుకు ముడేసినంత పనిచేశారు. అంతే.. భూమన ఇదంతా తన వ్యక్తిగతమంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను వచ్చింది ఆర్ ఎస్ ఎస్ నుంచి అని.. అప్పట్లో తాను వెంకయ్యనాయుడు, వరవరరావు ఒకే జైల్లో ఉన్నామంటూ పాత అనుబంధాన్ని గుర్తు చేసుకొచ్చారు. ఏదో పెద్దాయన వృద్ధాప్యంలో పడుతున్న బాధను చూడలేక.. ఒక్క లేఖ రాస్తే ఇంత యాగి చేస్తారా! అంటూ పాపం భూమన చాలా బాధపడ్డారట. అంతే.. కన్నా లక్ష్మినారాయణ సీఎం జగన్‌కు లేఖ రాసినపుడు నవ్వి వదిలేశారు. చంద్రబాబు కూడా మోదీకు లేఖ రాసినపుడు వదిలేశారు. మరి భూమన మాత్రం లేఖరాస్తే ఎందుకింత రాద్దాంత చేస్తున్నారంటూ ఎమ్మెల్యే అభిమానులు తెగ ఫీలవుతున్నారట.