రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) నేపథ్యం. అవినీతి మచ్చలేని వ్యక్తిత్వం. అందరినీ కలుపుగోల మనస్తత్వం. దిశానిర్దేశం లేని కమలం పార్టీకు అసలైన నాయకత్వంగా సోము వీర్రాజుపై బీజేపీ హైకమాండ్ నమ్మకం ఉంచింది. కాబట్టే.. కన్నా లక్ష్మినారాయణ వంటి సీనియర్‌ను పక్కన బెట్టి మరీ సోముకు పదవిని కట్టబెట్టింది. అయితే.. ఏపీ రాజకీయాల్లో రాణించటం ఒక ఎత్తయితే.. ప్రత్యర్థులను ఎదుర్కొంటూ ముందడుగు వేయటం కత్తిమీద సాము వంటిది. 13 జిల్లాలు భిన్న ధ్రువాలుగా ఉంటాయి. ఓ వైపు కమ్మ వర్గం ప్రాభల్యం ఉంటే. మరో వైపు కాపులు.. ఇంకో వైపు రెడ్లు, మాల, మాదిగ, మైనార్టీ, బీసీలు ఇలా ఓటుబ్యాంకుతో రాజకీయపార్టీలను తికమకపెడుతుంటాయి. అటువంటి చోట తోలిసారి బీజేపీ వంటి హిందుత్వ పార్టీ పాగా వేయాలని ప్రయత్నిస్తుంది.
ఇది గట్టి ప్రయత్నమే.. వెంట్రుక వేసి కొండను లాగుదామనే వ్యవహారంగా కూడా అనిపించవచ్చు. ఏపీలో సోము వీర్రాజును తెరమీదకు తీసుకు రావటం ద్వారా బీజేపీ కాపు ఓటుబ్యాంకును కొల్లగొట్టాలనుకుంటుంది. జనసేనతో పొత్తు దీనికి మరింత కలసిరానుంది. ఏపీలో హిందు దేవాలయాలపై జరిగిన 10కు పైగా దాడులు బీజేపీకు కలసివచ్చింది. ఇదే సమయంలో గత టీడీపీ హయాంలో గోదావరి పుష్కరాల తొక్కిసలాట, కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో క్షుద్రపూజలు, రథ దహనంపై బీజేపీ ఆ నాడు ఎందుకిలా నిరసన చెప్పలేదనే విమర్శలకూ సమాధానం చెప్పలేకపోవటం లోటుగా కనిపిస్తుంది. వీటన్నింటినీ ఎదుర్కొంటూనే సోము వీర్రాజు తన టీమ్‌ను ఎంపిక చేశారు. వీహెచ్‌పీ, ఏబీవీపీ, ఆర్ ఎస్ ఎస్, భజరంగ్ దళ్, హిందు సంఘాలను కలుపుకుని వెళ్లేందుకు పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్టుగానే తెలుస్తుంది.
సోము వీర్రాజుకు కాపు కులముద్ర వేసేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేనతో పొత్తు. చిరంజీవితో సన్నిహిత సంబంధాలు ఉండటాన్ని అవకాశంగా చూపుతూ.. చూశారా! చిరంజీవిని సీఎం చేసేందుకు సోము వీర్రాజు కష్టపడుతున్నారంటూ ఎద్దేవా కూడా చేస్తున్నారు. ఇది వైరి వర్గాలకు ఎంత బూస్ట్ ఇస్తుందో.. సోమన్నకు కూడా అదే విదంగా బలంగా మారుతుందంటూ కాపు కుల సంఘాలు పరోక్షంగా వ్యాఖ్యానిస్తున్నాయి. దీన్నుంచి బయటపడి.. అందరినీ కలుపుకుని పోయేందుకు.. కొత్త జట్టులో అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యతనిచ్చినట్టుగా కనిపిస్తుంది. ఏమైనా చంద్రబాబు, జగన్ వంటి రాజకీయ ఉద్దండులను ఎదుర్కోవాలంటే.. సోమన్న మరింత చాణక్యత ప్రదర్శించాల్సిందేనంటూ కమలం శ్రేణులు సూచిస్తున్నాయి.
టీడీపీతో బీజేపీకు దోస్తీ ఉందనే ప్రచారం ఉన్నా.. సోము వీర్రాజు మొదటి నుంచి చంద్రబాబును వ్యతిరేకించేవాడు కావటం బాగా కలసి వస్తోంది. అదే దూకుడు ఇప్పుడు జగన్ మోహన్‌రెడ్డిపై కూడా చూపుతున్నారనే భావన పార్టీ శ్రేణుల్లోనూ ఉంది. వీటన్నింటి మించిన విశ్వాసం కార్యకర్తలు, అభిమానుల్లో సోము సంపాదించాడు. అంతర్వేది ఘటన వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయంటూ బీజేపీయే కావాలని చేసి ఉండవచ్చనే అనుమానాలు కూడా వైసీపీ శ్రేణులు వ్యక్తంచేశాయి. అయోధ్యలో రామమందిరం కడుతున్నాం కాబట్టి.. అదే ఏపీలోనూ అనుసరిస్తూ హిందువుల ఓట్లకు గాలం వేయాలనేది కమలం ప్లాన్ అంటూ ఇటీవల మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఆరోపించారు. వీటి వెనుక వాస్తవాలు ఏమున్నా.. సోము వీర్రాజు పై హిందుత్వ
బావన బలపడుతుంది. దీనివల్ల మైనార్టీ ఓటర్లు దూరమైనా.. హిందుత్వాన్ని సమర్ధిస్తున్నాడనే అబిప్రాయం మరింత బలపడుతుంది. సోమన్న అనుకూల పార్టీలు, అనుబంధ సంఘాలను ఏకతాటిపైకి తీసుకురాగలరనే ధీమా పార్టీ శ్రేణుల్లోనూ ఉంది. ఇదే దూకుడును 2024 వరకూ కొనసాగిస్తారా.. రాజకీయ సర్దుబాట్లలో మధ్యలో ఆపేస్తారా! అనేది కాలమే నిర్ణయించాలి.



