నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌పై బీజేపీ స్కెచ్‌!

నిన్న దుబ్బాక‌.. నేడు హైద‌రాబాద్‌.. రేపు నాగార్జున‌సాగ‌ర్‌. ఎస్‌.. బీజేపీ ప‌క్కా స్కెచ్‌తో వెళుతోంది. అమిత్‌షా మంత్రాంగం.. మోదీ చాణ‌క్యం.. బండి సంజ‌య్ ఆచ‌ర‌ణ వెర‌సి తెలంగాణ‌లో కాషాయం దూకుడు పెంచింది. దుబ్బాక ఉప ఎన్నిక‌లో టీఆర్ ఎస్‌కు ఊహించ‌ని షాకిచ్చారు. తేరుకునేలోపుగానే జీహెచ్ ఎంసీలో 50 సీట్ల‌తో క‌మ‌లం పార్టీ కేసీఆర్‌, కేటీఆర్‌ల‌కు ఝ‌ల‌క్ ఇచ్చింది. ఇప్పుడు అదే ఊపుతో.. రాబోయే నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌కు వ్యూహ‌ర‌చ‌న చేస్తోంది. బీజేపీ సీనియ‌ర్ నేత డీకే అరుణ నేతృత్వంలో ఆల్రెడీ మంత‌నాలు జ‌రుపుతున్నారు. టీఆర్ ఎస్ అధికారంలోకి వ‌చ్చిన ఏడేళ్ల వ్య‌వ‌ధిలో అన్నీతామై న‌డిపించారు. ప్ర‌తిప‌క్షాల‌ను తొక్కేయాల‌నే ఉద్దేశంతో కాంగ్రెస్‌కు జ‌వ‌స‌త్వాలు లేకుండా చేశారు. అంత‌ర్గ‌త క‌ల‌హాల‌కు ఆజ్యం పోసి తెలంగాణ ఇచ్చిన హ‌స్తం పార్టీ రేఖ‌లు చెరిపేశారు. బీజేపీ ఉనికి కూడా ఉండ‌ద‌నే సంకేతాలు పంపారు. ఎంఐఎంను పెంచి పోషించ‌టం ద్వారా కాషాయ‌పార్టీకు చెక్ పెట్టాల‌నుకునే వ్యూహం బెడ‌సి కొట్టింది. 2020 గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌న స‌హ‌జ స్వ‌భావానికి భిన్నంగా న‌డ‌వ‌టంతో టీఆర్ ఎస్‌కు చెక్ పెట్టిన‌ట్ట‌యింది. స్వ‌యంగా మంత్రి కేటీఆర్ 25 సీట్లు కోల్పోయామ‌నే ప్ర‌క‌ట‌న ఇచ్చేలా చేసింది. ఇప్పుడు ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని.. ఐదేళ్ల‌పాటు ఎలా పాల‌న సాగించాల‌నేది కేసీఆర్ ముందున్న చిక్కు ప్ర‌శ్న‌.

నాగార్జున సాగ‌ర్ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌మ‌య్య అనారోగ్యంతో క‌న్నుమూశారు. దీంతో అక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లోపుగా ఉప ఎన్నిక జ‌ర‌గాల్సి ఉంది. ఈ సారి బీజేపీ ముందుగానే క‌ళ్లు తెర‌చింది. సాగ‌ర్‌లో పాగా వేయ‌టం ద్వారా న‌ల్ల‌గొండ నుంచి కొత్త రాజ‌కీయాల‌కు తెర‌లేపాల‌నే వ్ర‌ణాళిక ర‌చిస్తోంది. 2018 ఎన్నిక‌ల్లో జానారెడ్డిపై నోముల గెలిచారు. వామ‌ప‌క్ష పార్టీ నుంచి వచ్చిన నోముల ఆ ఎన్నిక‌ల్లో తెరాస‌లో చేరి గెలిచారు. జానారెడ్డి రాజ‌కీయం మ‌ళ్లీ ప్ర‌శ్నార్థ‌కంగా మార్చారు. ఇప్పుడు నాగార్జున‌సాగ‌ర్‌లో జానారెడ్డి త‌న‌యుడు ర‌ఘ‌వీర్‌రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించేందుకు డీకే అరుణ రంగంలోకి దిగి మంత‌నాలు జ‌రుపుతున్నారు. నాగార్జున‌సాగ‌ర్‌లో రెడ్డి, యాద‌వ్ సామాజిక‌వ‌ర్గ ప్రాభ‌ల్యం ఎక్కువ‌. గ‌తంలోనూ బీజేపీ పోటీ చేసినా క‌నీసం 3000 ఓట్లు కూడా సాధించ‌లేక‌పోయింది. అందుకే.. ఈ సారి బ‌ల‌మైన నాయ‌కుడిని రంగంలోకి దింప‌టం ద్వారా నెగ్గితీరాల‌ని భావిస్తుంది. దుబ్బాక‌, హైద‌రాబాద్ గెలుపుతో నాగార్జున‌సాగ‌ర్‌లోనూ గెలుపు పెద్ద క‌ష్టమేం కాద‌నే
బావ‌న‌లో బీజేపీ ఉంది.

Previous articleవరల్డ్ సాయిల్ డే (ప్రపంచ మట్టి దినోత్సవం)
Next articleజ‌న‌సేనానికి జ‌న నీరాజ‌నం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here