ఎంత త్వరగా చికిత్స అందిస్తే అంత మంచిగా నయం అవుతుంది
స్ట్రోక్ అనేది ప్రపంచంలోనే అంగవైకల్యం కలిపించడంలో అతి పెద్ద కారణమే కాకుండా మరణాలు సంభవించడానికి రెండవ అతిపెద్ద కారణం కూడా. ఇంతటి ప్రమాదకారి ఈ స్ట్రోక్ ను పూర్తి స్థాయిలో నిరోధించవచ్చు. స్ట్రోక్ కారణంగా శాశ్వతంగా లేక పాక్షికంగా పక్షవాతం రావడం లేదా మాట్లాడలేక పోవడం, జ్ఞాపకాలను కోల్పోవడం, సరిగ్గా గుర్తుంచుకోలేక పోవడం వంటివి సంభవించవచ్చు. ఇలా స్ట్రోక్ కారణంగా జరిగే నష్టం అది వచ్చిన తీవ్రతను పట్టి అత్యంత తక్కువ స్థాయి నుండి అత్యంత ప్రమాదభరితంగా ఉండొచ్చు.
స్ట్రోక్ అనేది మెదడుకు రక్త ప్రసరణ అడ్డుకోబడినపుడు సరైన ఆక్సిజన్ అందక మెదడు దెబ్బతిని పని చేయడం మానివేయడం అన్న మాట. ఇది సాధారణంగా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో అడ్డంకులు ఏర్పడడం వలన జరుగుతుంది. ఈ పరిస్థితిని ఇస్కీమియా అని అంటారు. అంతే గాకుండా ఈ స్థితి హిమరేజ్ అంటే రక్త నాళాలు పగిలిపోవడం వలన మెదకు వెళ్లే రక్తం చిందిపోతుంది. అయితే 80 శాతం స్ట్రోక్ లు ఇస్కేమియా కారణంగానే వస్తాయి.
సమస్య ఎంత తీవ్రమైనది
స్ట్రోక్ అనేది ఇప్పటికే మహమ్మారిలా రూపాంతరం చెందింది. 25 సంవత్సరముల వయస్సు దాటిన ప్రతి నలుగురిలో ఒకరు తమ జీవనకాలంలో స్ట్రోక్ బారిన పడుతున్న వారే. ఈ సంవత్సరములోనే ప్రపంచ వ్యాప్తంగా 13.7 మిలియన్ల ప్రజలు మొదటి సారి స్ట్రోక్ బారిన పడుతుండగా అందులో 5.5 మిలియన్ ప్రజలు మరణిస్తున్నారని చెప్పవచ్చు.
ఇక అభివృద్ది చెందిన దేశాల కంటే భారత్ లాంటి అభివృద్ది చెందుతున్న దేశాలలో స్ట్రోక్ అనేది 20 శాతం ఎక్కువగా ఉంటోంది. స్ట్రోక్ వచ్చిన వారిలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు భారత్ లాంటి అభివృద్ది చెందుతున్న దేశాలలో ఉన్నారనేది ఒక అంచనా.
స్ట్రోక్ – కోవిడ్
కోవిడ్ 19 వలన ఏర్పడే సమస్యలలో స్ట్రోక్ ఒకటి. ఇది ఎటువంటి స్ట్రోక్ ప్రమాదం లేని వ్యక్తులలో అంటే 45 సంవత్సరముల వయస్సు కన్నా తక్కువ ఉన్న వారిలో కూడా సంభవిస్తోంది. పలు పరిశోధనలలో తేలిన దాని ప్రకారం 0.9 శాతం నుండి 23 శాతం కోవిడ్ పేషెంట్లలో స్ట్రోక్ వస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే ఇంటి వద్దనే ఉండి టెలిమెడిసన్ కోసం ఆగకుండా వెంటనే హాస్పిటల్ కు చేరుకొని వైద్యం పొందడం అత్యవసరమైనది. ఎందుకంటే ఎంత ఆలస్యం చేస్తే అంత అంగవైకల్యం ఏర్పడడమే కాకుండా మనం ఆలస్యం చేసే ప్రతి సెకన్ లో 30 వేల మెదడు కణాలు చచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి. అందుకే స్ట్రోక్ వచ్చినపుడు కాలమే మెదడు అని చెప్పవచ్చు.
స్ట్రోక్ రావడానికి గల కారణాలు
అథెరోస్క్లెరోసిస్ అనబడే వ్యాధి ప్రక్రియ స్ట్రోక్ రావడానికి కారణమవుతుంది. వయస్సు మళ్లే కొద్దీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంతే గాకుండా ధూమపానం, తక్కువ వ్యాయామం లేదా శారీరక శ్రమ, ఆనారోగ్యమైన ఆహారం, ఇష్టానుసారం మత్తు పానీయాల వినియోగం, హైపర్ టెన్షన్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్, పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలు, ఊబకాయం, జన్యూపరమైన నిర్మాణంతో పాటూ మానసిక సమస్యలు కారణమవుతాయి. మగవారిలో ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.
అవగాహన లేమి కారణంగా సరైన సమయంలో స్ట్రోక్ ను గుర్తించలేక పోవడం
ప్రతి నలుగురిలో ఒకరికి స్ట్రోక్ వస్తున్నా మన దేశంలో దీనిపై సరైన అవగాహన లేదనే చెప్పవచ్చు. ప్రతి వంద మందిలో ఒకరికి కూడా దీని లక్షణాలు, అవసరమైన చికిత్సకు సంబంధించిన విషయాలు తెలియదు అంటే అతిశయోక్తి కాదు.
స్ట్రోక్ లక్షణాలు –
- అకస్మాత్తుగా మొఖంలో, చేతిలో లేదా కాలిలో తిమ్మిరి లేదా బలహీనత ఏర్పడడం, అదీ ముఖ్యంగా శరీరానికి ఒక వైపు
- అకస్మాత్తుగా మాట్లాడడంలో ఇబ్బంది లేదా మాట్లాడడంలో స్పష్టత లేక పోవడం, విషయాలు అర్థం చేసుకోలేకపోవడం
- అకస్మాత్తుగా ఒకటి లేదా రెండు కంటి చూపులో ఇబ్బందులు ఏర్పడడం
- అకస్మాత్తుగా నడువడానికి ఇబ్బంది, సరిగ్గా బాలెన్స్ లేక పోవడం లేదా నియంత్రణ లేకపోవడం
- అకస్మాత్తుగా ఎటువంటి కారణం లేకుండా విపరీతమైన తలపోటు
ఇలా స్ట్రోక్ కు చెందిన లక్షణాలను FAST అనబడే శబ్దంతో గుర్తు పెట్టుకోవడంతో పాటూ గమనించవచ్చు….
- Face (ఫేస్) – తల ఒక ప్రక్కకు ఓరుగుతుండడం
- Arms (చేతులు) – ఒక చేయి లేదా కాలులో బలహీనత ఏర్పడడం
- Speech (మాటలు) – మాట్లాడడంలో ఇబ్బంది, సరిగ్గా మాట్లాడలేకపోవడం
- Time ( టైం) – ఈ లక్షణాలు కాని కలిగి ఉంటే వెంటనే అత్యవసర సేవల వారికి కాల్ చేయాలని తెలుసుకోవడం
ఇలా స్ట్రోక్ వలన ఏర్పడే లక్షణాలను త్వరగా గుర్తించి దానిని అత్యవసర సమయంగా గుర్తించి సరైన స్ట్రోక్ యూనిట్ తో పాటూ MRI లేదా CT Scan లాంటి వసతులు ఉన్న హాస్పిటల్ కు మాత్రమే చేర్చి మంచి వైద్యం అందించగలిగితే మంచి ఫలితాలు సాధించగలుగుతాం.
స్ట్రోక్ వచ్చినపుడు “ కాలమే మెదడు” – స్ట్రోక్ వచ్చిన తర్వాత 4.5 గంటలు అత్యంత కీలకం
ప్రస్థుతం అందుబాటులో ఉన్న వైద్య పరిజ్ఞానం ప్రకారం స్ట్రోక్ వచ్చిన తర్వాత 4.5 గంటలలోగా మందులు ఇస్తేనే నయం చేయగలుగుతాం. ఇస్కీమిక్ స్ట్రోక్ లు వచ్చిన సందర్భంలో లక్షణాలు కనిపించన తర్వాత నుండి రక్తనాళాలలో కట్టిన గడ్డలను నిర్మూలించడానికి అవసరమైన మందు rTPA లేదా థ్రొంబోలిసిస్ ను 4.5 గంటలలోగా మాత్రమే అందించినపుడు గడ్డలను కరిగించవచ్చు. ఇలా 4.5 గంటల సమయం దాటిన తర్వాత అతి కొద్ది కేసులలో మాత్రమే ఎండో వాస్కులర్ చికిత్స(మెకానికల్ థ్రొంబెక్టమీ) 24 గంటల వరకూ అందుబాటులో ఉంటుంది.
ఇదే సమయంలో స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి మద్దతుగా సేవలు అందిస్తున్న వ్యక్తి గుర్తించుకోవాల్సింది ఏమిటంటే స్ట్రోక్ వచ్చిన వ్యక్తిని హాస్పిటల్ కు చేర్చడానికి పట్టే సమయం, చేర్చిన తర్వాత హాస్పిటల్ లో వ్యాధి నిర్థారణ అంటే అవసరమైన సిటీ లేదా యంఆర్ఐ పరీక్షలు నిర్వహించడానికి పట్టే సమయం కూడా ఈ 4.5 గంటలలో జోడించబడి ఉంటుందనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. అందుకే ఎంత త్వరగా చికిత్స ఇవ్వగలిగితే అంత మంచి ఫలితం వస్తుందని చెప్పినట్లు స్ట్రోక్ నియంత్రణలో సమయం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.
మెకానికల్ థ్రొంబెక్టమీ లో గడ్డ కట్టిన రక్తాన్ని తొలగించడం ద్వారా నయం అయ్యే అవకాశాలను పెంచడమే కాకుండా అస్కీమిక్ స్ట్రోక్ లో పెద్ద రక్తనాళంలో లో అడ్డం ఏర్పడడం వలన కలిగే అంగవైకల్యం పొందడాన్ని నిరోధించవచ్చు. గడ్డ కట్టిన రక్తాన్ని తొలగించే మందులు rTPA లేదా థ్రొంబోలిసిస్ వంటి వాటి కారణంగా 30 శాతం ఎక్కువగా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇక అడ్డంకులను తొలగించే చికిత్స ద్వారా 50 శాతం మెరుగైన ఫలితాలను సాధించవచ్చు.
ఇలా చికిత్స అందించిన తర్వాత రోగి పునరావాస ప్రక్రియ కూడా చికిత్సలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ పునరావాస ప్రక్రియ హాస్పిటల్ లోనే ప్రారంభమై తర్వాత ఇంటి వద్ద కూడా కొనసాగుతుంది. దీని కారణంగా స్ట్రోక్ నుండి బయటపడిన వారు స్వతంత్ర్యంగా తమ తమ పనులను త్వరగా చేసుకొనే అవకాశం ఉంటుంది.
స్ట్రోక్ వచ్చిన ప్రతి నలుగురిలో ఒకరికి మరో మారు వచ్చే అవకాశం
స్ట్రోక్ వచ్చిన ప్రతి నలుగురిలో ఒకరికి మరో మారు స్ట్రోక్ రాకుండా చూడడానికి పలు రకములైన మందులు అంటే తక్కువ రక్త పోటు, కొలెస్ట్రాల్ తగ్గంచడానికి, యాంటి ప్లేట్లెట్ థరపీ, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కోసం యాంటీ కాగ్యులేషన్ మందులు, ఏ రోగులకైతే కెరోటిడ్ ఆర్టరీ అతి చిన్నగా కుంచించుకుపోతుందో వారికి శస్త్ర చికిత్స లేదా స్టంట్ వేయడం వంటి చికిత్స ల ద్వారా దీనిని నిరోధించే ప్రయత్నం చేస్తారు.
స్ట్రోక్ వచ్చిన తర్వాత జీవితం
స్ట్రోక్ వచ్చిన తర్వాత మీరు ఆలోచించే విధానం, మాట్లాడే విధానం, కదిలే లేదా అనుభూతి చెందే ప్రక్రియలు ప్రభావితమవుతాయి. అంతే గాకుండా దీని బారిన పడి చికిత్సలో కోలుకున్న వారిలో ఎక్కువ శాతం తదుపరి జీవితంలో అంగవైకల్యం తో కాని ఏదో ఒక ఇబ్బందులతో శారీరక, మానసిక లేదా ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరికి నిపుణులైన పునరావాస చికిత్స అందించే వారితో చికిత్స, మద్దతు ఇప్పించడం ద్వారా వారు సాధారణ జీవనాన్ని సాగించగలిగి జీవితాన్ని ఆనందించగలుగుతారు.
స్ట్రోక్ ని నిరోధించడం ఎలా?
ప్రతి సారి పేర్కొనట్లు వ్యాధి కి చికిత్స తీసుకోవడం కన్నా రాకుండా చూసుకోవడమే మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. దీనిని మన జీవన శైలి లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడంతో పాటూ బిపి, కొలెస్ట్రాల్, షుగర్ ల స్థాయిలు ఎక్కువ కాకుండా చూసుకోవడం వలన సాధించవచ్చు.
రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం – సగానికి పైగా స్ట్రోక్ లు హైపర్ టెన్షన్ వలన వస్తున్నాయి. మీ రక్త పోటును తెలుసుకొంటూ దానిని నియంత్రణలో ఉంచుకోవడానికి అవసరమైన జీవన విధానంలో మార్పులు లేదా మందులతో స్ట్రోక్ నివారించగలుగుతారు.
- ప్రతి వారం ఐదు పర్యాయములు వ్యాయామం చేయడం – ఒకటికి మూడు వంతులు స్ట్రోకులు సరైన శారీర శ్రమ లేకపోవడం వలన వస్తాయి. వారానికి 5 సార్లు 20 నుంచి 30 నిమిషముల పాటూ వ్యాయామం చేయడం వలన దీన్ని నిరోధించవచ్చు.
- మంచి ఆరోగ్యంతో కూడిన సమతుల్యమైన ఆహారం తీసుకోవడం – ¼ వంతు స్ట్రోక్ లు సరైన ఆహారం తీసుకోకపోవడం వలన వస్తున్నాయని తెలుతోంది. మంచి పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారాన్ని తీసుకొంటూ నిల్వ ఉంచిన, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి.
- కొలెస్ట్రాల్ తగ్గించడం – ప్రతి నాలుగింటిలో ఒక స్ట్రోక్ ఎక్కువగా పెరిగే చెడ్డ LDL కొలెస్ట్రాల్ కు సంబంధం ఉందని చెప్పవచ్చు. తక్కువ కొవ్వు ఉన్న పదార్థములు తినడంతో పాటూ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని మానివేసి వ్యాయం చేయడమే ఇందుకు మార్గం.
- సరైన బరువు కలిగి ఉండడం – ఊబకాయం లేదా ఎక్కువ బరువు ఉండడం వలన 5 – 1 స్ట్రోక్ వస్తుందని అంచనా. మంచి బాడీ మాస్ ఇండెక్స్ లేదా హిప్ టు వెయిస్ట్ రేషియా కలిగి ఉండడం అవసరం.
- ధూమపానం ఆపివేయడం తో పాటూ పొగ వాతావరణానికి దూరంగా ఉండడం – ప్రతి 10 మందిలో 1 స్ట్రోక్ ధూమపానానికి సంబంధం ఉంది. అందుకే ధూమపానం నిలిపివేయడం లేదా అలాంటి వారికి దూరంగా ఉండడం చేయాలి.
- మత్తు పానీయాలు మానివేయాలి – దూమపానం వలే మత్తు పానీయాలు కూడా ప్రతి 10 మందిలో 1 స్ట్రోక్ కు సంబంధం ఉంది. వీటిని వదిలిపెట్టడమే మంచిది.
- సరైన రీతిలో షుగర్ ను నియంత్రణలో ఉంచుకోవడం
- ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ను గుర్తించి చికిత్స తీసుకోవడం – ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్న వారిలో 5 రెట్లు ఎక్కువగా స్ట్రోక్ వచ్చే అవకాశముంది. దీనికి తగిన పరీక్ష చేయించుకోవడం, చికిత్స తీసుకోవడం ద్వారా స్ట్రోక్ నివారించవచ్చు.
- ఒత్తిడి, ఆందోళనను నియంత్రణలో ఉంచుకోవడం – మానసిక ఆరోగ్యానికి ప్రతి ఆరు స్ట్రోక్ లలో ఒక దానికి సంబంధం ఉంది. అందుకే మానసిక ఒత్తిడి, ఆందోళన, కోపం, నిరాశ వంటి వాటిని నియంత్రణలో ఉంచుకోవడం అవసరం
- స్ట్రోక్ రిస్కోమీటర్ – ఇది ఒక మొబైల్ ఆప్. దీనిలో ఉండే ప్రశ్నలకు సమాధానమివ్వడం ద్వారా భవిష్యత్తులో స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని అంచనా వేసి వెళ్లడిస్తుంది.
ప్రపంచ స్ట్రోక్ దినం 2020 – Make a Movement (ఒక ఉద్యమం నిర్మించండి)
ప్రతి నలుగురిలో ఒకరికి స్ట్రోక్ వచ్చే సందర్భంలో సరైన రీతిలో చురుకుగా ఉండడం ద్వారా దాని ప్రమాదం నుండి రక్షించుకోవచ్చు. ప్రపంచ స్ట్రోక్ దినం 2020 ధీమ్ లో పేర్కొనబడినట్లు ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములై పెద్ద ఎత్తున పాల్గొని అవగాహన కలిపించడంలో విజయవంతం చేయాలి. తద్వారా మన కుటుంభంలోనే కాకుండా సమాజంలో కూడా దీన్ని నివారించి ఒక వేళ స్ట్రోక్ వచ్చినా వెంటనే స్పందించి సత్వరం వైద్య సేవలు అందించేలా సహాయపడడం ద్వారా త్వరగా కోలుకొనే అవకాశం కలిపిద్దాం.
Dr. Sindhu Vasireddy, Neurologist, Aster Prime Hospital, Ameerpet, Hyderabad.