ఏదైనా ఏపీలో ఎన్నికలు అనగానే కుల సమీకరణలే కీలకం. ముఖ్యంగా పల్లెల్లో గతంలో ఎన్నడూ లేనంతగా కుల ప్రభావం పెరిగింది. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మతం కూడా వేదిక మీదకు వచ్చింది. ఇటువంటి క్లిష్ట సమయంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కులం, మతం ఏది ప్రభావం చూపుతాయనే చర్చ మొదలైంది. కమ్మ, కాపు, రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఈ దఫా ఎలా ఎండబోతున్నారనేది కూడా అంచనాకు అందకుండా ఉంది. వైసీపీ ఏడాదిన్నర పాలన రాజన్నపాలనను మరిపించిందంటూ వైసీపీ శ్రేణులు తెగ ఖుషీ అవుతున్నాయి. ఏకగ్రీవాలు అధికంగా ప్రోత్సహించటం ద్వారా ముందుగానే పై చేయి సాధించాలనేది వైసీపీ ఎత్తుగడగా తెలుస్తోంది. అయితే విపక్షాలు మాత్రం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. ఇటీవల వరుసగా జరిగిన దేవాలయాలపై దాడులు కూడా మత ప్రాతిపదికన ఓటర్లను విడదీశాయనే అంచనాలు వేసుకుంటున్నాయి. ఎప్పుడూ గుడి గడప తొక్కని నేతలు కూడా బొట్లు పెట్టి.. మరీ సాష్టాంగ నమస్కారాలతో పొర్లుదండాలు చేశారు. స్వామీజీలు కూడా రాజకీయపార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఒక స్వామీజీ తాను చంద్రబాబు ఓటమి కోసం పూజ చేశానంటారు. మరొకరు జగన్‌ను రాజకీయ దెబ్బ తీసేందుకు ఎంతకైనా తెగిస్తామంటారు. పవన్ నాలుగు పెళ్లిళ్లలో ఒకరు క్రైస్తవురాలంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా మతం రంగును రాజకీయ నేతలకు అంటించటం ద్వారా హిందువుల ఓట్లను దక్కించుకోవాలనే ప్లాన్‌లు కూడా పల్లెల్లో రాజకీయపార్టీలు సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే తాము గెలిస్తే గుడి కట్టిస్తామని చందాలు కూడా వెద జల్లుతున్నాయి. ఎటుచూసినా ఈ స్థానిక ఎన్నికలు అన్ని పార్టీలకు సవాల్‌గా మారాయి. గెలుపోటములు సంగతి ఎలా ఉన్నా పై చేయి సాధించటం ద్వారా 2024 ఎన్నికలకు తాము కీ రోల్ అనేది జనాల్లోకి చేరేలా చేసుకోవాలనేది ప్రధాన పార్టీల ఎజెండాగా కనిపిస్తోంది. ఏమైనా పచ్చగా ఉండే పల్లెల్లో రాజకీయం ఎంత వరకూ ప్రజల మధ్య కక్షలు, ప్రతీకారాలు పెంచుతాయనే ఆందోళన కూడా లేకపోలేదు. అసలే ఎన్నికల కమిషన్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా సాగుతున్న ఎన్నికల్లో ఎవరికి ఎవరు ఎంత వరకూ సాయపడతారనేది కూడా మరో చర్చ. ఏమైనా…లోకల్ వార్.. యుద్ధవాతావరణాన్ని తలపిస్తుందనేది మాత్రం నిష్టూరంగా అనిపించే నిజం.



