నువ్వు నేను సినిమా గుర్తుందా.. గాజువాకే పిల్లా మాదీ.. గాజులోళ్లమే పిల్లా మేమంటూ.. స్టూడెంట్స్‌తో డ్యాన్స్ చేసే ప్రిన్సిపాల్‌గా ఎంఎస్ నవ్వులు పండించారు. బన్నీలో సోడా కొట్టడం పీజీ పాసైనంత ఈజీ కాదంటూ చమత్కరించారు. పిల్ల జమిందార్ లో తెలుగు భాషే కనుమరుగయ్యే రోజు వస్తే ఒక రోజు ముందు తానే చనిపోతానంటూ అధ్యాపకుడుగా తెలుగును అభిమానించే గురువుగా కన్నీరు పెట్టించారు. ఎక్కడ నెగ్గాలో కాదురా. ఎక్కడ తగ్గాలో తెలియాలిరా అంటూ అత్తారింటికిదారేదిలో ఒక్క డైలాగ్‌తో జీవితసత్యాన్ని నేర్పించిన గురువు అవతారమెత్తారు. అంతటి విలక్షణ నటుడు ఎంఎస్‌నారాయణ.. మైలవరపు సూర్యనారాయణ. 1951 ఏప్రిల్ 16న నిడమర్రులో పుట్టారు. పుట్టిన ఊరంటే ఇష్టపడే ఎంఎస్‌కు సినిమా అంటే ఇష్టం. కానీ.. ఎలా వెళ్లాలి. ఎవరూ తెలియదు. కానీ.. ఆయనలోని రచయిత మాత్రం మద్రాసు వెళ్లమంటూ పోరుపెడుతుండేవాడు. అయినా. అప్పటికే చేతిలో ఉన్న అధ్యాపక వృత్తిని వదిలేస్తే కుటుంబాన్ని ఎలా ఫోషించాలనే భయం వెంటాడేది. అటువంటి సమయంలోనే ప్రముఖ దర్శకుడు రవిజారా పినిశెట్టి తన సినిమా యమదర్మరాజు ఎంఏలో చెవిటి పాత్ర తో ఎంఎస్‌ను వెండితెరకు పరిచయం చేశారు. అలా.. ఆయనే ఏడెనిమిది సినిమాల్లో అవకాశం ఇచ్చారు. కానీ.. 1997లో ఇవివిసత్యనారాయణ తీసిని మానాన్నకు పెళ్లితో ఎంఎస్‌కు తాగుబోతు కేరక్టర్‌తో మాంచి బ్రేక్ వచ్చింది.
ఆ తరువాత అంతగా ఎంఎస్‌లోని హాస్యాన్ని వాడుకుంది మాత్రం శ్రీనువైట్ల మాత్రమే. దూకుడు సినిమాలోని వేరియేషన్స్‌తో ఇరగదీశారు. లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చిన మన ఎంఎస్ కేవలం 17 ఏళ్లలో 700 పై చిలుకు సినిమాల్లో నవ్వులు పండించారు. సెంటిమెంట్‌తో కన్నీరు తెప్పించారు. తనదైన డైలాగ్‌లో సినీ రంగాన్ని ఏలిన హాస్యనట హీరో ఎంఎస్ తనయుడుతో తీసిన కొడుకు, భజంత్రీలు సినిమాలతో బాగానే నష్టపోయారు. అయినా.. ఏనాడు సినీ రంగాన్ని తూలనాడలేదు. 2015 జనవరి 23న సొంతూరు వెళ్లిన ఆయన.. అనారోగ్యంతో అకస్మాత్తుగా కనుమూశారు. తెలుగు ప్రేక్షకులకు దూరయ్యారు.. కానీ.. తాను లేకపోయినా.. తన నవ్వుల నజరానాతో సామాన్యుడి పెదవులపై చిరునవ్వులు తెప్పిస్తున్నారు. ఎంఎస్ వర్దంతి సందర్భంగా కదలిక మీడియా ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తుంది.
గొప్ప హాసస్యనటుడిని మరొక్కసారి గుర్తు చేశారు..
చాలా బాగా రాసారు