సినిమా.. రాజకీయం.. రెండూ అభివక్త కవలలు. ఒకదానితో ఒకటి సంబంధం ఉంటూనే ఉంటాయి. కళ సమాజాన్ని మేలుకొలిపితే .. రాజకీయం అదే సమాజానికి అన్నీతానై నడిపిస్తుంది. రెండింటి కలయికతో ప్రజాసంక్షేమం ఈజీ అవుతుందనే భావనతోనే సినీ తారలు రాజకీయాల్లోకి వచ్చారు. సినిమాలో రిటైర్ అయ్యాక ఏం చేయాలంటే.. రాజకీయాల్లో చేరటమే అనే సామెత కూడా లేకపోలేదు. అయితే.. ఏపీ, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాధి రాష్ట్రాల్లో సినీతారకు విపరీతమైన అభిమానులున్నారు. అందుకే.. ఆ అభిమానాన్ని ఓటుగా మలచుకునేందుకు చాలామంది స్టారేలే పోటీపడ్డారు. కొందరు గెలిచారు. ఇంకొద్దిమంది ఓడారు. బాలీవుడ్ నటుడు దేవానంద్ నుంచి తమిళస్టార్ రజనీకాంత్ వరకూ చాలా మంది ఈ జాబితాలో నే ఉన్నారు.
అరవరాజకీయం అంటేనే ఒక పట్టాన అర్ధం కాదు. అక్కడ ఉన్నంతటి వ్యక్తిపూజ ఇంకెంక్కడా కనిపించదనటంలో అతిశయోక్తి లేదేమో. ఎందుకంటే.. బతికున్న మనిషిపై అభిమానంతో గుడి కూడా కట్టగలరు. ప్రాంతీయత, భాషా భిమానం చాలా ఎక్కువ. అటువంటి రాష్ట్రంలో రజనీకాంత్ ఎక్కడో కన్నడరాష్ట్రం నుంచి వచ్చి సూపర్ స్టార్‌గా ఎదిగారు. కరుణానిధి పూర్వీకులు కూడా ఏపీలోని కృష్ణాజిల్లా ప్రాంతీయులు అనే ప్రచారమూ లేకపోలేదు. కానీ.. తమిళనాడు చేరాక అదే తమ జన్మభూమి అనేంతగా మారారు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రజనీకాంత్ పార్టీ స్థాపించటంపై ప్రకటన ఇచ్చారు. డిసెంబరు 31 రాత్రి .. అంటే కొత్త సంవత్సరం 2021లో పార్టీ ప్రకటన.. అదే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ అన్నీ జరిగిపోతున్నాయి. అయితే.. కమల్ హాసన్ కూడా నేను పార్టీ పెడతానంటున్నారు. మరి ఈ ఇద్దరూ కలుస్తారా.. విడిగా బరిలో దిగుతారా అనేది అంతుబట్టకుండా ఉంది.
ఇప్పటికే తమిళనాడులో ఎంజీఆర్, కరుణానిధి, శరత్‌కుమార్, విజయ్‌కాంత్ వంటి వాళ్లు పార్టీలు పెట్టారు. కరుణ, ఎంజీఆర్ మాత్రమే సీఎం పీఠం వరకూ చేరారు. శరత్, విజయ్‌కాంత్ ఆశించినంతగా రాణించలేకపోయారు. తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ తెలుగుదేశం తరువాత మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినా కాంగ్రెస్‌లో కలిపేయటం విమర్శలకు దారితీసింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ జనసేనతో రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇటువంటి వేళ రజనీకాంత్ రాజకీయాల్లో ఎంత వరకూ రాణిస్తారు.. తలైవా.. నిజంగానే తమిళనాడు రాజకీయాలు మార్చేస్తారా! అనే ప్రశ్న కూడా మొదలైంది. ఎన్నికల బరిలో తొలిసారి పోటీ చేసి సీఎం అయ్యే అవకాశాలు రజనీకాంత్‌కు ఎంత వరకూ ఉన్నాయనేది మరో ప్రశ్న.