కాంగ్రెస్ నెగ్గాలంటే.. టీఆర్ ఎస్ బలహీనపడాలి. బీజేపీ బలపడేందుకు హస్తం కిందకు జారాలి. ఇప్పుడు.. అదే జరిగింది. టీఆర్ ఎస్ పార్టీ పుణ్యమాంటూ బీజేపీకు తెలంగాణలో పట్టు చిక్కుతోంది. ఇదంతా బీజేపీ సొంత వ్యూహం అనుకుంటే పొరపాటేనట. ఎందుకంటే. టీఆర్ ఎస్, కాంగ్రెస్ రెండింటి పోరులో బీజేపీ లాభపడిందన్నమాట. నూరేళ్లు నిండినా హస్తం పార్టీకు అంతర్గత పోరు మాత్రం తగ్గట్లేదు. నాడు కేసరి నుంచి ఇప్పుడు తెలంగాణ పీసీసీ నేత ఎవరు అనేంత వరకూ ఎప్పుడూ రచ్చరచ్చే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 31 జిల్లాల అధ్యక్షుల నుంచి కాంగ్రెస్ పీసీసీ నేత ఎంపికపై అభిప్రాయ సేకరణ చేశారు. ఇక్కడ 20 మంది పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్‌రెడ్డి అయితేనే మంచిదంటూ చెప్పారు. కానీ.. 11 మంది మాత్రం..రేవంత్‌కు అనుభవం లేదంటూ అన్నారట. ఇదంతా ఇప్పటి వరకూ పీసీసీ పీఠంపై ఆశపడుతున్న పెద్దల పని అనే ఆరోపణలూ లేకపోలేదు. ఇవన్నీ పక్కనబెడితే.. ఇంతకీ పీసీసీ పీఠంపై ఎవరు కూర్చుంటారంటే. నేనంటే నేనంటూ.. షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి.. పొన్నాల , వీహెచ్, భట్టి విక్రమార్క వంటి సీనియర్లు చాలామంది చేతులు ఎత్తుతున్నారు. వీరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తానే ముందు వరుసలో ఉన్నానంటున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చినపుడు కోమటిరెడ్డి బ్రదర్స్ అలకబూనారు.
ఉత్తమ్‌ను కిందకు లాగేంత వరకూ విశ్రమించలేదు. ఉత్తమ్ ఎడ్డం అంటే.. కోమటి బ్రదర్స్ తెడ్డమంటూ వాదనకు దిగేవారు. గెలిచే అవకాశం ఉందంటూ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం.. నమ్మకం కలిగించేందుకు ఉత్తమ్ ఏది చెప్పినా.. తూచ్ అదంతా ఉత్తర ప్రగల్బాలంటూ తూలనాడేవారు. వీహెచ్ అయితే.. నేనే సీనియర్ నాకే పదవి అంటాడు. గాంధీభవన్‌లో దీక్షకు కూర్చుంటాడు. తాజాగా అంజన్‌కుమార్ యాదవ్ తాను రెండుసార్లు ఎంపీగా గెలిచాను కాబట్టి.. నాకే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ కొత్త వాదన తెరమీదకు తెచ్చాడు. శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఏఐసీసీకు తమ అభిప్రాయం చెప్పనున్నారు. ఈ లెక్కన.. పదవి రాకుండా ఇలా ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుననే నేతలు.. బీజేపీకు అప్పనంగా అవకాశం ఇస్తున్నారు. కేసీఆర్ కూడా తాను కాంగ్రెస్‌ను దెబ్బతీస్తున్నా అనుకున్నారు కానీ.. హస్తం పతనంతో కమలం వికసిస్తుందని.. అది టీఆర్ ఎస్ ఉనికికే ప్రమాదమని ఊహించలేకపోయారంటూ గులాబీ నేతలు అంచనా వేసుకుంటున్నారు.