కరోనా.. అబ్బే వైరస్ చాలా బలహీనమైందట. ఇంతకు ముందుగా ఎవరికీ హాని చేయట్లేదట. అయినా ఎన్నాళ్లిలా మూలన కూర్చుంటాం. బయటకు వెళ్లకపోతే ఎలా? ఇవన్నీ ఇప్పుడు ప్రతిచోట.. ప్రతి ఒక్కరినోటా వినిపిస్తున్న మాటలు.. భారత్‌లో 65లక్షల కొవిడ్19 పాజిటివ్ కేసుల వరకూ నమోదయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ రోజు 6000-9000 వరకూ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో 12శాతం మందిలో , ఏపీలోనూ 10 శాతం మందిలో యాంటీబాడీస్ తయారయ్యాయంటూ పరిశోధనలు చెబుతున్నాయి. అంటే.. తెలియకుండానే వీరిలో కరోనా వచ్చి తగ్గినట్టుగానే వైద్యులు లెక్కలు వేస్తున్నారు. అంతమాత్రాన. వీరంతా వైరస్‌కు గురయ్యారా! సహజంగానే వైరస్ వ్యాపించే సమయంలో వృద్ధిచెందే వ్యాధినిరోధకశక్తి వచ్చిందా!
అనే అంశంపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్‌పై అనుమానాలున్నాయి. భారత్ తయారీ వ్యాక్సిన్ కొవాగ్జిన్ అందుబాటులోకి వచ్చేందుకు మరో ఏడాది పట్టవచ్చట. మరి అప్పటి వరకూ ఏం చేయాలంటే.. ఎస్ ఎం ఎస్ అంటూ సూచిస్తున్నారు వైద్యులు. సోషల్ డిస్టెన్స్ (ఎస్), మాస్క్ (ఎం), శానిటైజ్ మూడు పాటిస్తే వైరస్‌కు దూరంగా ఉండవచ్చంటున్నారు.
ఇక్కడ మరో దిమ్మతిరిగేలా ఐసీఎంఆర్, సీసీఎంబీ చేస్తున్న హెచ్చరికలను పరిగణలోకి తీసుకోవాలి. గాల్లో ఉండే కొవిడ్19 వైరస్ ఐదారు గంటల వరకూ ఉంటాయట. అంతేనా. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా తేలికగా శరీరంలోకి చేరేందుకు అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అన్‌లాక్4.0 తరువాత ప్రజల్లో భయం పోయింది. అది మంచిదే కానీ.. అదే సమయంలో నిర్లక్ష్యం పెరిగింది. ఇప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో 80శాతం మాస్క్‌లు పెట్టుకోవట్లేదు. అంతేనా. వ్యక్తిగత దూరం ఏ నాడో మరచిపోయారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి వద్ద భట్లూరు గ్రామ పరిధిలో ఒక ట్యూషన్ టీచర్ వల్ల సుమారు 39 మందికి వైరస్ సోకింది. లాక్ డౌన్ వల్ల బడులకు వెళ్లలేని పిల్లలతో ఇంటిల్లిపాదీ చుక్కలు చూస్తున్నారు. పైగా విద్యాసంవత్సరం నష్టపోతారనే భయం కూడా తల్లిదండ్రుల్లో నెలకొంది. అందుకే. భట్లూరులోని ఓ కాలనీలో పిల్లలను ట్యూషన్ కు పంపారు. ఎవరి వల్ల వైరస్ వ్యాపించిందో కానీ ఒకేరోజు 39 మంది కొవిడ్19 పాజిటివ్‌కు గురైనట్టు వైద్యపరీక్షల్లో గుర్తించారు. కంటైన్‌మెంట్ జోన్‌గా గ్రామన్ని ప్రకటించారు.
కరోనా ఏ ఒక్కరినీ వదలదు. మున్ముందు సహజీవనం చేయాల్సి ఉంటుంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న హెచ్చరికలు. అప్రమత్తంగా ఉండాల్సిన వేళ ఎందుకింత అజాగ్రత్త అంటే.. అబ్బే మాకేం కాదనే అతి విశ్వాసం. అది చాలా ప్రమాదం అంటున్నారు శాస్త్రవేత్తలు. వైరస్ రాకుండా నిన్నటి వరకూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. విటమిన్లు మింగారు. ఇంట్లోనే ఉన్నారు. మంచి ఆహారం తీసుకున్నారు. అన్‌లాక్5 తో పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చనే ధోరణిలో ఉన్నారు. కానీ ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే. వర్షాకాలం ముగిసింది.. శీతాకాలం మొదలుకాబోతుంది.. చలిలో వైరస్ ఎక్కువ సమయం బతికే ఉంటుందనేది గమనించాలి. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరమంటున్నారు శాస్త్రవేత్తలు. అందుకే.. వైరస్‌ను ఎదుర్కొనేందుకు శరీరాన్ని సిద్ధం చేయాలని సూచిస్తున్నారు. ఏ, డీ విటమిన్లు ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఆహారం తీసుకుంటూ.. వీలైనంత వరకూ సంబరాలు, వేడుకలకు దూరంగా ఉండాలంటున్నారు. ఏం కాదని ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.