కరోనా వచ్చి తగ్గినట్టు కూడా చాలామందికి తెలియదు. ఏ లక్షణాలు లేకుండా ఉండే వీరితోనే వైరస్ విస్తరణ ఎక్కువ అనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. పోన్లే.. అనుకుంటే ఇంతలోనే సంచలనమైన విషయాలను బయటకు వచ్చాయి. ఏపీ లోని విజయవాడ.. తెలంగాణలోని హైదరాబాద్ నగరాల్లో కొవిడ్19 పాజిటివ్ కేసులు బ యటకు వచ్చినవాటితో పోల్చితే.. వెలుగులోకి రానివి భారీగా ఉన్నాయంటున్నారు. ఇదంతా ఏదో కాకిలెక్కలు వేసి చెబుతున్నవి కాదు.. ఎందుకంటే… ప్రతిష్ఠాత్మకమైన పరిశోధన సంస్థలు చేసిన అధ్యయనం, వైద్యపరీక్షల్లో గుర్తించిన నిజాలు
హైదరాబాద్ జనాభా అక్షరాల కోటి వరకూ ఉంటుందని అంచనా. వీరిలో 6.6 శాతం అంటే.. 6 లక్షల మందికి వైరస్ సోకి తగ్గిందట. జులై 2 నుంచి అగస్టు 6 వ తేదీ వరకూ సీసీఎంబీ జరిపిన అధ్యయనంలో నిగ్గుతేలిందన్నమాట. ప్రభుత్వ లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో 27-28 వేల కేసులున్నాయి. కానీ.. వచ్చి తగ్గిన వారు.. వైరస్ సోకిన సైలెంట్‌గా ఉన్నవారు లక్షల్లో ఉంటారనేది దీన్ని బట్టి తెలుస్తున్న నిజం. మరి విజయవాడలో అంటారా! అక్కడకే వస్తున్నా.. సిరో సర్వైలెన్స్ సంస్థ సర్వేలో 40.51శాతం మంది జనాభా ఈ మహమ్మారి భారిన పడ్డారట. కృష్ణాజిల్లాలో 3709 మందికి వైద్యపరీక్ష చేయగా 19.41శాత మందికి వచ్చి తగ్గిపోయింది కూడా. విజయవాడ పట్టణ ప్రాంతంలో 933మందిలో 378 మందికి ఆల్రెడీ యాంటీబాడీస్ తయారై ఉన్నట్టు గుర్తించారు. అంటే.. వీరికి కరోనా వచ్చి తగ్గిన సంగతి కూడా తెలియకపోవటం విశేషం. ఈ లెక్కన.. వైరస్ వచ్చినా తెలియని వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి.. ముఖానికి మాస్క్, చేతులు శుభ్రం చేసుకోవటం, వ్యక్తిగత దూరం కొన్నాళ్ల వరకూ జీవితంలో భాగంగా భావించాలని వైద్యులు సూచిస్తున్నారు.