అవినీతి.. ఎక్కడ లేదు సారూ.. మేమైతే ఏదో చూసీచూడనట్టుగా ఇచ్చింది తీసుకుంటామంటూ జేబులో పైసల్లేనిదే పనిచేయని ఉద్యోగులు ఎందరో. అయ్యా నేను బక్కరైతునంటూ దీనంగా అడిగినా కనికరం చూపని రెవెన్యూ ఉద్యోగులు ఇంకెందరో కళ్లెదుట కనిపిస్తూనే ఉంటారు. పైసా పైసా కూడబెట్టుకున్న సొమ్మును దర్జాగా లాక్కుని.. కోట్లు కూడబెడుతున్న అవినీతి అధికారులకు ఎప్పటికైనా శిక్ష తప్పదంటూ ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటన్న ఘటనలు హెచ్చరిస్తున్నాయి. ఇకనైనా మారమంటూ సూచిస్తున్నాయి.
రెవెన్యూ.. భూములకు పెద్దన్న.. పోలీసు శాంతిభద్రతలకు పెద్దదిక్కు. రెండూ కీలకమైనా.. కాసుల పందేరంలోనూ తామే టాపర్ అని నిరూపించుకుంటున్నాయి. రెండు శాఖల్లోనూ నీతి, నిజాయతీపరులు చాలామందే ఉన్నారు. కానీ.. ఇటువంటి కుక్కమూతి పిందెల వల్ల కూడా వ్యవస్థలు భ్రష్టు పడుతున్నాయి. మొన్న కీసర తహసీల్దార్ నాగరాజు.. నిన్న మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్.. ఇప్పుడు మల్కాజగిరి ఏసీపీ నరసింహారెడ్డి.. బాబోయ్.. వీరంతా అవినీతి అనకొండలకు అంబాసిడర్‌లుగా కనిపించారు. ఏసీబీ జరిపిన దాడుల్లో వీళ్ల వద్ద దొరికిన సొమ్ము చూస్తే నిజంగానే కళ్లు తిరుగుతాయి. ముగ్గురిల ఒక్కొకరి వద్ద రూ.100 కోట్ల వరకూ ఏసీబీ అధికారులు అవినీతి సొమ్ము ఉన్నట్టు గుర్తించారు. లక్షలాదిరూపాయలు వేతనం తీసుకునే కార్పొరేట్ కంపెనీల సీఈవోలకు కూడా లేని లగ్జరీ వస్తువులు వీరి ఇళ్లల్లో మూలుగుతున్నాయి. సామాన్యుడు తులం బంగారు కొనేందుకు నాలుగైదేళ్లు కష్టపడాల్సి వస్తుంది. కానీ.. వీరి వద్ద కిలోల కొద్దీ బంగారం, వెండి వస్తువులు మూలన కనిపిస్తున్నాయి.
ఎవరికి వారే.. తగ్గే ప్రసక్తే లేదంటూ.. వందల కోట్లరూపాయలు.. పేద ప్రజల రక్తాన్ని జలగల్లా లాగేస్తున్నారనేందుకు వీరే నిదర్శనం. నిజమే.. ఎవరైనా ఒక అబల అర్దరాత్రి పోలీసుల వద్దకెళ్లి.. తన బాధను మొరపెట్టుకుంటే.. రేపు చూద్దామంటారు. ఆ రాత్రే ఆమె జీవితం కడతేరిపోతుందని గుర్తించరు. మొన్న శ్రావణి అనే బుల్లితెర నటి జూన్ 22న ఫిర్యాదు ఇచ్చినపుడు తీసుకుని.. ముగ్గురు మృగాలను దారికి తెచ్చివుంటే ఆ యువతి ప్రాణం దక్కేది. కానీ.. అక్కడా కాసుల బేరంతో రాజీ కుదిర్చి చేతులు దులుపుకున్నా ఖాకీలున్నారు. తనను ఎవడో వేధిస్తున్నాడంటూ ఠాణా గుమ్మం తొక్కితే.. ఔనా.. మరి నాకేమిటంటూ సొల్లు కార్చుతూ.. ఒక మహిళను పడకగదికి రమ్మంటూ ఫోన్‌లోనే ఆదేశించిన ఎస్సై బాగోతం శ్రీకాకుళంలో గమనించాం.
ఇక రెవెన్యూ కార్యాలయాల వద్దకు పట్టాదారు పాసు పుస్తకాల కోసం భుజాన కండువాతో.. కనీసం వేసుకునేందుకు చెప్పులు కూడాలేని రైతులు నిలబడితే.. కొందరు తహసీల్దార్లు అటువైపు చూడకుండా తప్పించుకోవటం కూడా కళ్లెదుట గమనిస్తున్నాం. రెవెన్యూ, పోలీసు శాఖల్లో పెరుగుతున్న అవినీతిని కట్టడి చేసేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.
రెవెన్యూ శాఖలో అధికారాలను కత్తిరించి పంచాయతీరాజ్‌కు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. ఏపీలో జగన్ సర్కారు.. వార్డు సచివాలయాల ద్వారా రెవెన్యూ వివాదాలను కొత్త దారులు వేసింది. ఇప్పటికైనా.. అక్రమార్కులు.. కాస్తయినా తమ పద్దతి మార్చుకుంటే.. జనం దీవెనలు పొందుతారు. లేదంటే.. ఇలాగే ఏసీబీ చేతికి చిక్కి.. పరువు ప్రతిష్ఠలు పోగొట్టుకుని జైలు ఊచలు
లెక్కబెట్టుకోవాల్సి వస్తుందనేది.. నగేష్, నాగరాజ్, నరసింహారెడ్డిలను చూస్తే అర్ధమవుతుంది. పంచుకుందా రా అంటూ పిలిస్తే..ఊచలు లెక్కబెట్టిస్తాం పద! అంటూ ఏసీబీ కూడా హెచ్చరిస్తోంది.