ఇప్పటి కాలం ఆడపిల్లలు మగవారితో సమానంగా చదువుకుంటున్నారు. కొంచం ప్రోత్సాహం ఇస్తే అన్ని విషయాల్లో మేము ఏమి తక్కువ కాదు అని నిరూపించుకుంటున్నారు. అలాంటిది కొంతమంది మహిళలకి పెళ్ళి అయ్యి, పిల్లలు పుట్టాక ఏమి చెయ్యాలో తెలియక, ఇటు పిల్లలు, ఇల్లు, బాధ్యతల కోసం ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఎంతో మంది మహిళలు చదువుకున్న చదువుకి సార్ధకత లేదనే బెంగపెట్టుకుంటారు. అలాంటి వారికి ఒక కళ బోలెడంత భరోసాను, గుండె నిబ్బరాన్ని, డబ్బుని సంపాదన మార్గాలను చూపించగలిగితే ఆనందంగా ఉంటుంది.
చాక్లెట్ మన మనసు ఒత్తిడికి గురైనప్పుడు నోట్లో వేసుకుంటే రిలాక్స్
చేసే ఒక సాధనం. అలానే నచ్చిన చెలి మనసు గెలిచేందుకు అదే చాక్లెట్ ని ఉపయోగించవచ్చు. అయితే అలాంటి చాక్లెట్ ఎంతో మంది మహిళల జీవితాల్ని నిలబెట్టేందుకు, నిలదొక్కుకునేందుకు బాసటగా నిలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన స్వప్న విన్నకోట తాను సరదాగా నేర్చుకున్న కళలో మరింత నైపుణ్యం సాధించి దాన్ని ఏంతో మంది మహిళలకూ పంచుతున్నారు.
ఆసక్తి, నేర్చుకోవాలి అన్న తపన, దానికి తన సృజనాత్మకత మేళవించి చాక్లెట్ తయారీలో తనదైన క్రియేటివిటితో ఎంతోమందికి శిక్షణనిస్తున్నారు. అయితే స్వప్న గారు కేవలం చాక్లెట్ తయారీలోనే తన ప్రతిభ చూపిస్తున్నారు అనుకుంటే పొరపాటే. ఇంట్లోనే సబ్బులు, కేక్‌లు ఇలా మహిళలు ఉపాధి పొందేందుకు ఇంటి వద్దనే ఉంటూ కుటుంబ అవసరాలకు సరిపడినంతగా ఆర్ధిక వృద్ధి సాధించేందుకు ఆమె తనవంతుగా తోడ్పాటును అందిస్తున్నారు. తాను గెలవటమే కాదు.. మరో పదిమందిని విజేతలుగా మలచటంలో ఆనందమే వేరంటున్నారు.. స్వీటీ చాకీ ముచ్చట్లను కదలికతో పంచుకున్నారు స్వప్న.
మా స్వస్థలం ఆంధ్రప్రదేశ్. కాకినాడలోనే నా చదువు సాగింది. కంప్యూటర్స్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశాను. ఒక స్వచ్చంధ సంస్థ కోసం పదవ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులకు ఫ్రీ టీచింగ్ చేసేదాన్ని. ఒక బ్యాచ్ పూర్తయ్యాక పెళ్లయింది. దీంతో హైదరాబాద్ వచ్చేశాను. ఇక్కడే ఏడాది పాటు కంప్యూటర్ ఫ్యాకల్టీగా పనిచేశాను. తరువాత పిల్లలు, సంసారంతో వృత్తికి దూరమయ్యాను. ఆ తరువాత ఏం చేయాలనే ప్రశ్నకు సమాధానంగా చిన్నపుడు సరదాగా నేర్చుకున్న అల్లికలు, పెయింటింగ్, కుట్లు.. ఇవన్నీ గుర్తుకు వచ్చాయి. అవే నాకు బాసటగా మారాయి.. సరికొత్త బాటచూపాయి.. కొత్త ప్రయాణానికి దిశానిర్దేశం చేశాయి.
నువ్వు కూడా ఏదైనా చేయవచ్చు కదా! అంటూ స్నేహితులు, బంధువుల సూచనతో స్వప్న ఒక చిన్న ప్రయత్నం చేశారు. పక్కింటి వాళ్లకు బెడ్‌షీట్‌కు పెయింటింగ్ వేశాను. అలా వచ్చిన రూ .1000 పెట్టుబడితో క్రియేటివ్ కెరీర్ మొదలైంది. ఒకసారి వైజాగ్‌లో బందువుల ఇంటికి వెళ్ళినపుడు తొలిసారి హోమ్‌మేడ్ చాక్లెట్స్ చూశాను. చాక్లెట్ తయారీపై ఆసక్తితో.. శిక్షణ తీసుకున్నా. ఆ సమ
యంలో చిన్నపాపకు మొదటి పుట్టినరోజు. పెద్దపాపకు నాలుగేళ్లు. పాప క్లాస్ అయేంత వరకూ పడుకుటుందని మా చాక్లెట్ నేర్పించే వారికి చెప్పి పాపను అక్కడే నిద్రపుచ్చేసి పెద్దపాపకు బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి క్లాస్‌కు అటెండ్ అయ్యేదాన్ని.. నా తపన చూసి మేడమ్ నాకు సపోర్టు ఇచ్చారు. అలా చాక్లెట్ తయారీ నేర్చుకున్నా.
స్టార్టప్ కూడా నా స్వంత సంపాదనతో ప్రారంభించాను.
మా పక్కింటి ఆవిడ నా చాక్లెట్ చాలాబావుందంటూ ఇచ్చిన తొలి ప్రశంస మరింత బలాన్నిచ్చింది. అలా తొలిసారి బర్త్‌డే పార్టీకు ఆర్డర్.. అప్పటికే 100 లాలిపాప్‌లు చేశాను. అలా.. మెల్లమెల్లగా
ఆర్డర్స్ వచ్చాయి.. ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా.. నా అంతట నేను.. నేర్చుకుంటూ నా స్వంత ప్రయాణం ప్రారంభించాను. బర్త్‌డే పార్టీ ఆర్డర్స్.. ఇటు తల్లితండ్రుల దగ్గర నుంచి కానీ, నా భర్త దగ్గర నుంచి కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కొంచం కొంచం జాగ్రత్తగా కూడబెట్టుకుని అడ్వాన్స్ లెవల్‌కు వెళ్లాను. అప్పుడు పెయిడ్ శాంపిల్స్ పెట్టాను. నాకు నేనుగా కొంత బిల్డప్ చేసుకున్నా. మిక్కీమౌస్, చోటాభీమ్, అబ్బాయి అయితే బ్లూ.. అమ్మాయికి అయితే పింక్ ఇలా.. పిల్లలను మనసుకు నచ్చేలా చాక్లెట్స్ తయారు చేయటంతో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఎటువంటి ప్రచారం లేకుండానే.. స్వప్న చేతి చాక్లెట్ అద్భుతమంటూ అందరికి తెలిసింది.
చాక్లెట్ తయారీ, బేకింగ్ వంటివి ప్రత్యేకమైన క్లాసుల్లోనే నేర్చుకున్నా. ప్రతి అంశాన్ని నిపుణుల వద్దనే శిక్షణ తీసుకున్నా.. సుమేరు మేడమ్ చాలా బాగా శిక్షణనిచ్చారు. చాక్లెట్ బొకేస్ నేర్చుకున్నా.. ఒకసారి పాదం షేప్‌లో ఉన్న సోప్ చూశాను. కొత్తగా అనిపించి ఆసక్తితో సబ్బుల తయారీ కూడా నేర్చుకుందామనుకున్నా. ఇంట్లో సోప్స్ తయారీతో నేను మరింత ఒత్తిడికి గురవుతాననే అభిప్రాయంతో భయపడ్డారు. ఏదైనా కొత్తగా కనిపిస్తే నేర్చుకోవాలనే తపన బలంగా ఉండేది. ఎంత తమాయించుకున్నా మనసులో నేర్చుకోవాలనే కోరికతో సోప్స్ తయారీలో నైపుణ్యం సాధించగలిగాను. అక్కడ కూడా ప్రత్యేకత ఉండేలా సృజనాత్మకతను జోడించాను.
సబ్బులంటే మనం చిన్నప్పటి నుంచి చూసిన ఒకే ఆకారం కాదు. దానికీ కొంత సృజనాత్మకత జోడించాలనే ఉద్దేశంతో.. పిల్లలకు నచ్చేలా.. అందరూ మెచ్చేలా చోటాబీమ్, టెడ్డీబేర్,
కార్లు ఇలా పసికూనలు మనసు గెలిచేలా సబ్బులకు కొత్తరూపాలిచ్చాను. వాస్తవానికి బేబీకు 3-6 నెలల వరకూ సోప్ వాడకూడదు. అందుకే.. నేను తయారు చేసే సోప్‌లో సున్నిపిండి కలుపుతాను. అవి కూడా అందరికి బాగా నచ్చాయి. పిల్లలే స్వయంగా ఆర్డరిచ్చేంతగా మార్కెట్‌లోకి వెళ్లింది.
నేను నేర్చుకున్న విద్య.. పది మందికి ఉపయోగపడాలనే సంకల్పంతో శిక్షణనిస్తున్నాను. నేను నెలల తరబడి నేర్చుకున్నచాక్లెట్లు, బేకరీ ఉత్పత్తులు, సోప్‌లను కొద్ది సమయంలోనే మహిళలు, యువతులకు శిక్షణతో నేర్పిస్తున్నా.
ఇది ఏదో హాబీగా మాత్రమే కాకుండా ఎంతోమంది కష్టంలోఉన్న
మహిళలకు ఉపాధి మార్గంగా ఉపయోగపడతోంది. ముఖ్యంగా ఒంటరిగా సమాజంలో సవాళ్లనుఎదుర్కొంటూ మగువలకు.. తమ కాళ్లపై తాము నిలబడగలమనే భరోసా.. ఉపాధితోనే దొరుకుతుంది. ఇంత గొప్ప కార్యక్రమంలో నా వంతు తోడ్పాటును అందించటం ఆనందంగా ఉంటుంది.. నా సృజనాత్మకత.. ఇంతమందికి ఉపయోగపడుతుందనే సంతృప్తి చాలా గొప్ప అనుభూతిని ఇస్తోంది.
https://www.facebook.com/sweetychocy/
https://www.facebook.com/bubblenbliss/
సూపర్ స్వప్న గారు, మీ ప్రయాణం ఎంతో మందికి చాలా ప్రేరణ కలిగిస్తుంది.congratulations for your bright future 👍