ఇది ఇరవైళ్ల సమరం. పట్టు నిలుపుకోవాలని ఒకరు.. పాత వైభవం తెచ్చుకోవాలని మరొకరు. రెండు కుటుంబాల మధ్య మొదలైన వార్… ఇప్పుడు వన్‌సైడ్‌గా మారింది. సవాళ్లకు కేరాఫ్ అయిందన్నమాట. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సవాల్ విసిరాడు. మైలవరం ఎమ్మెల్యేగా పదేళ్లపాటు తానేదో అభివృద్ధి చేశానంటున్న ఉమా.. పంచాయతీ కార్యాలయం వద్ద చర్చకు రావాలని పిలుపునిచ్చారు. అన్న పంచన చేరి.. వదినను కడతేర్చి రాజకీయాల్లోకి వచ్చిన ఉమా తన గురించి ప్రేలాపనలు చేయటమా! అంటూ ప్రశ్నించారు. తనవాళ్లు తప్పుచేసినా ఒకటికి రెండుసార్లు వాస్తవం నిర్ధారించుకుంటానన్నారు. అయితే.. దేవినేని వర్సెస్ వసంత పంతం ఈనాటిది కాదు. వాస్తవానికి 1994లోనే మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు నందిగామ నియోజకవర్గం నుంచి టికెట్‌కు ప్రయత్నించి విఫలమయ్యాడు. కాంగ్రెస్‌పార్టీ ఆ సంవత్సరం బొబ్బిళ్లపాటి సాయికి కేటాయించింది. ఆ ఎన్నికల్లో దేవినేని రమణ గెలిచాడు. వెంటనే మంత్రిపదవి దక్కించుకున్నారు. 1999లో వసంత నాగేశ్వరరావు తనయుడు కృష్ణప్రసాద్ దేవినేని ఉమాపై పోటీపడినా గెలువలేకపోయారు. 2004లో మరోసారి వసంత నాగేశ్వరావు స్వయంగా రంగంలోకి దిగినా ఉమాపై ఓటమి చవిచూశారు. 2009లో నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్‌డ్ కావటంతో దేవినేని ఉమా మహేశ్వరరావు 2009 , 2014 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీచేసి గెలిచారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. గతేడాది వసంత నాగేశ్వరరావు మరోసారి టీడీపీలోకి చేరారు. కానీ.. 2018లో వైసీపీలోకి చేరారు. దేవినేనిపై గెలవాలనే పంతాన్ని 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్(కేపీ) బరిలోకి నిలిచి.. చిరకాల ప్రత్యర్థి దేవినేని ఉమాపై ఎట్టకేలకు గెలిచారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై వసంత పట్టుకోసం ప్రయత్నిస్తున్నాడు. రాబోయే మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఆశిస్తున్నవారిలో కేపీ కూడా ఉన్నట్టు వినికిడి. ఇప్పుడు వైసీపీ సర్కారు.. ఎలాగూ ఉమాపై పోలవరం అవినీతి, అక్రమాలపై వైసీపీ గుర్రుగా ఉంది. మైలవరం నియోజకవర్గంలోనూ దాదాపు పదేళ్లపాటు ఉమా అంతులేని అవినీతికి తెరలేపారంటూ వసంత ఆరోపిస్తున్నారు. ఉమా రాజకీయ జీవితం.. వ్యక్తిగత అంశాలపై కూడా ఘాటైన విమర్శలు చేస్తున్నారు.
మరి.. ఈ సవాళ్ల పర్వంలో ఇద్దరి మధ్య వైరం ఇంకెంత వరకూ చేరుతుందనేది చర్చనీయాంశంగా మారింది.