దేవినేని ఉమామహేశ్వరరావు.. టీడీపీలో నిన్నటి వరకూ నెంబరు టుగా చక్రం తిప్పారు. 2014కు ముందు వైసీపీను. జగన్‌ను దుమ్మెత్తిపోయటమే కాదు.. జగన్‌పై లక్ష కోట్ల అవినీతి ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నపుడు కృష్ణా జిల్లాకే పరిమితమైన దేవినేని మంత్రి అయ్యాక రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ జోక్యం చేసుకున్నారు. దీంతో దాదాపు టీడీపీలోని సగానికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉమా అంటే వామ్మో అనేంత వరకూ చేరారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి చేరాక అందరూ సైలెంట్ అయినా దేవినేని ఉమా మాత్రం అవకాశం చిక్కినప్పుడల్లా వైసీపీ సర్కారుపై ప్రతాపం చూపుతూనే ఉన్నారు. అపుడపుడు కాస్తో.. కూస్తో ఝలక్ లిస్తూ వైసీపీ పాలిట కంట్లో నలుసుగా మారారు. అయితే మంత్రి కొడాలి నాని , మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాత్రం ఉమాను వదల బొమ్మాళీ అంటూ వెంటాడుతూనే ఉన్నారు. ఇటీవల మంత్రి కొడాలి మాజీ మంత్రి ఉమాపై మాటల యుద్ధం ప్రారంభించారు. రాసేందుకు వీల్లేని భాషతో ఉమాపై విమర్శల దాడి చేశారు. ఇలా ఇద్దరి మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లతో కృష్ణాజిల్లా రాజకీయం వేడెక్కింది. మంగళవారం ఉమాను అరెస్ట్ చేయటం.. సాయంత్రం విడుదల చేయటం జరిగాయి. బుధవారం ఉమా విజయవాడలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు సిద్ధమయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దేవినేని ఉమా ఇంటి వద్ద పహారా పెంచారు. అయితే ఖాకీల కన్నుగప్పిన ఉమా కారు డిక్కీలో దాక్కుని మరీ ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకోవటం చర్చనీయాంశంగా మారింది. కొడాలి విసిరిన సవాల్‌తో బయటకు వచ్చి సత్తా చాటిన ఉమా అంటూ తెలుగు తమ్ముళ్లు ఖుషీ అవుతుంటే. చూశారా.. మేం తలచుకుంటే మీ నాయకుడిని డిక్కీలో ఉంచామంటూ వైసీపీ వర్గాలు తెగ సెటైర్లు వేస్తున్నాయట. అంతే.. రాజకీయాలంటే రాజకీయమే చేయాలి.
నిన్నటి వరకూ టీడీపీ సాగించిన అధికార దర్పాన్ని ఇప్పుడు వైసీపీ కూడా ప్రదర్శిస్తోంది. చెల్లుకు చెల్లు అన్నట్టుగా టీడీపీ పట్ల వైసీపీ అనుసరిస్తున్న వైఖరితో ఏపీ ప్రజల నుంచి భిన్నమైన స్పందన వినిపిస్తోంది.