అప్పట్లో హైదరాబాద్ వచ్చినవాళ్లకు.. చార్మినార్, ట్యాంక్‌బండ్, సాలార్జంగ్ మ్యూజియం, జూ చూడటం ఎంత ఇష్టమో.. డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణించటం కూడా అదే స్వీట్ మెమరీ. అయితే.. 1990ల్లో మాత్రమే ఈ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఆ తరువాత కరెంట్ తీగలు, కేబుల్ వైర్లతో డబుల్ డెక్కర్‌లు తిప్పటాన్ని తగ్గించారు. పైగా ప్రయివేటు వాహనాలు విపరీతంగా పెరగటంతో డిమాండ్ తగ్గింది. ఇప్పుడైతే ఎటు చూసినా ఫ్లైఓవర్లు కావటంతో అంత పెద్ద బస్సును తిప్పటం సులభం కాదనే నిర్ణయానికి వచ్చారు. భాగ్యనగరానికి శోభను తెచ్చిన బస్సు మీద బస్సు.. అదేనండీ డబుల్ డెక్కర్‌ను మరోసారి ఇప్పటి తరానికి పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు అధికారులు. మెహిదీపట్నం, కొంపల్లి, జీడిమెట్ల వంటి ప్రాంతాల్లో తిప్పాలనుకుంటున్నారు. ఈ మేరకు టెండర్లు కూడా పిలిచారు. కొన్ని నెలలు తరువాత.. అంటే వచ్చే వేసవి సెలవుల్లో ఇంటిల్లిపాదీ.. సరదాగా డబుల్ డెక్కర్‌లో ప్రయాణించవచ్చన్నమాట. అయితే.. మీరు ఎక్కడున్నారు. ఈ ముచ్చట తీర్చుకోవాలంటే హైదరాబాద్ రావాల్సిందేనండోయ్.



