సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఉత్కంఠగా మారింది. టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఎవరికి వారే తమ బలాలను సరిచూసుకుంటున్నారు. 7 మండలాలు.. 146 గ్రామాలున్న దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో 2018 ఉప ఎన్నికలో 1,81,796 ఓటరు జనాభా ఉన్నారు. వీరిలో మహిళలు 91,692 , పురుషులు 90,094 ఓటర్లున్నారు. 2018 ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ తరపున గెలిచిన రామలింగారెడ్డి కరోనాతో మరణించటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో దుబ్బాకలో 89,299 ఓట్లతో రామలింగారెడ్డి గెలిచారు. ఆ సమయంలో కేసీఆర్ పక్కాగా ముందస్తు ఎన్నికలకు వెళ్లటంతో మిగిలిన పార్టీలకు ప్రచారం చేసుకునే అవకాశం కూడా అంతగా లేకుండా పోయింది. దీంతో 2020లో జరిగే ఉప ఎన్నికలో లక్ష ఓట్ల మెజార్టీ ఖాయమంటూ మంత్రి హరీష్‌రావు ధీమాగా చెబుతున్నారు. ఎన్నికలు లాంఛనమేనంటూ.. ఆల్రెడీ గులాబీ విజయం ఖరారైందంటూ కార్యకర్తలను ఉత్సాహపరిచాడు. కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ఠాగూర్ కూడా ఇక్కడే మకాం వేశారు. గ్రామస్థాయి వరకూ కమిటీలు వేసి బూత్ లెవల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్, దామోదర్ రాజనర్సింహ అందరూ ఇక్కడే దృష్టిపెట్టారు. ఇక్కడ గెలుపు ద్వారా రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు మార్గం వేసుకోవాలని భావిస్తున్నారు. మరో వైపు బీజేపీ తరపున రఘునందనరావు అభ్యర్థిగా ప్రచారం షురూ చేశారు. బండి సంజయ్ అధ్యక్షతన జరిగే తొలి ఎన్నికలు కావటంతో వ్యూహాత్మకంగా కదులుతున్నారు. పార్లమెంటరీ ఎన్నికల్లో ఎంపీ సీట్లు సాదించిన బీజేపీ ప్రతి ఎన్నికలను తమకు అనుకూలంగా మలచుకునేందకు సిద్ధమైంది. కేంద్రంలో నరేంద్రమోదీ హవా పెరగటం.. బీజేపీపట్ల బిహార్‌లోనూ సానుకూల పరిస్థితులు నెలకొన్నట్టుగా సర్వేలుచెబుతున్నాయి. ఇదే దూకుడును తెలంగాణలోనూ కొనసాగించేందుకు దుబ్బాక ఎన్నిక ఉపయోగపడుతుందనేది బీజేపీ వ్యూహం.
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా.. మూడు ప్రధానపార్టీలను గెలుపు ఎంతగా ఊరిస్తుందో.. అంతర్గత కలహాలు కూడా అంతే భయపెడుతున్నాయట. హరీష్‌రావు ధీమాగా చెప్పినా.. ఏదోమూలన భయం మాత్రం ఉందట. కేటీఆర్ వర్గం కొంత హరీష్‌రావుకు దూరంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. టీఆర్ ఎస్ నుంచి సీటు ఆశించిన ఇద్దరు ముగ్గురు నేతలు ప్రచారంలో
ఎంత వరకూ కలసి వస్తారనేది కూడా అనుమానమేనట. బీజేపీ పట్ల కూడా దుబ్బాకలో అంత పాజిటివ్ వాతావరణం లేదు. కానీ.. రఘునందన్‌రావు పట్ల సానుభూతి ఉంది. ఒక్కసారి అవకాశం ఇద్దామనే భావన కూడా ఓటర్లలో ఉందంటున్నారు కమలనాథులు. అందుకే.. ఈ సారి అవకాశాన్ని విజయంగా మలచుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ తాము లబ్దిపొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి 27000 ఓట్ల వరకూ సాధించారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు తమకే పడుతుందనే ఆలోచనలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థికి అప్పుడు 23 వేల ఓట్ల వరకూ పోలయ్యాయి. ఈ దఫా.. సానుభూతి.. మోదీయిజం.. టీఆర్ ఎస్ వ్యతిరేకత కలసివస్తుందనే ఆలోచనలో ఉన్నారు. ఏమైనా.. ఈ సారి దుబ్బాక ఉప ఎన్నిక మాంచి రసవత్తరంగా మారిందనేది మాత్రం నిప్పులాంటి నిజం. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలపై అక్కడక్కడా పందేలు కూడా మొదలయ్యాయట.