ఎంతైనా అధికార పార్టీ. పైగా కేసీఆర్‌ను దిక్కరించి రాజకీయం చేయగలమనే ధైర్యం కూడా కనిపించదు. బాస్‌ను కాదని ప్రెస్‌మీట్లు కూడా పెట్టలేని పరిస్థితి. పోనీ ఏమైనా పార్టీ గురించి స్పందించే అవకాశం ఉందా! అంటే అస్సలు ఛాన్సే లేదు. ఎందుకంటే.. మొన్న నాయిని, నిన్న మధుసూదనాచారి, రాజయ్య అండ్ కో ఇలా చాలామంది కేసీఆర్‌ను కాదని.. వెనక్కు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇటువంటి సమయంలో కావాలనో.. తప్పకనో.. మంత్రి ఈటల రాజేందర్‌కు పొగబెట్టారు. అప్పటికీ దారికిరాకపోవటంతో భూ కుంభకోణంతో తానంత తానే నోరుజారాడు. పదవి నుంచి బర్తరఫ్ అయ్యాడు. బీసీలంతా తన వెనుకే ఉన్నారనే ధీమాతో బయటకు వచ్చాడు. కానీ.. బీసీలు ఎంత వరకూ ఈటల వెంట నడుస్తారనేది రేపు ఉప ఎన్నికలో గెలిస్తే కానీ రుజువు చేయలేని అంశం. వాస్తవానికి గులాబీ పార్టీలో లుకలుకలున్నా బలంగా ఉంది. కాబట్టే ముందస్తు ఎన్నికల్లో ఆ తరువాత గ్రేటర్ , మున్సిపాలిటీ, నల్గొండ జిల్లాలో ఉప ఎన్నికల్లోనూ గెలుపు సాధించింది. బీజేపీ, కాంగ్రెస్‌లకు బలమైన కేడర్ ఉన్నా..నాయకత్వ లోపం.. అంతర్గత కలహాలు గులాబీపార్టీకు మరింత కలసివచ్చేందుకు కారణమవుతున్నాయి. ఇప్పుడు ఈటల రూపంలోకేసీఆర్ వ్యతిరేక కూటమి కట్టినా ఎవరు కారు దిగుతారనేది అంచనా వేయటం కష్టమే. ఈటల వస్తే పార్టీలో పదవి ఇస్తామంటూ బీజేపీ, కాంగ్రెస్‌తో సహా షర్మిలమ్మ పార్టీ నేతలు కూడా మంతనాలు జరిపారు. కానీ.. చివరకు ఈటల కాషాయ కండువాకే మొగ్గుచూపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తనను కాపాడుతుందనే భరోసాయే దీనికి కారణంగా తెలుస్తోంది. కానీ ఈటల అన్నట్టుగా.. కేసీఆర్ కోటరీలో హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, రసమయి ఇలా.. కొంతమంది కీలక నేతలు కూడా బయటకు వస్తారనేది ఎంత వరకూ సత్యమనేది కూడా అంతుబట్టకుండా ఉంది. అదే నిజమై.. గులాబీ గూటిలో చీలిక వస్తే బీజేపీ, కాంగ్రెస్‌లకు కాస్త ఊపిరి వచ్చినట్టే. మరి.. ఈటల మాటల వెనుక వాస్తవం ఎంత అనేది తెలియాలంటే కొద్దికాలం ఓపికపట్టాల్సిందే.