ఎదురు కట్నం – కథ

చీకటి అలవాటే…. కానీ ఎందుకో ఈ మధ్య భయం పెరిగింది. భయంతో పాటు ఏమీ కాదన్న భరోసా కూడా పెరుగుతోంది. వసుధ ఆలోచనలతో అటూ ఇటూ తిరుగుతూ భర్త రాకకోసం ఎదురు చూస్తోంది. ఎన్నో ప్లాట్స్  ఉన్నా కూడా అపార్ట్మెంట్ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నట్లుగా ఉంది ఆమె పరిస్థితి. తన పరిస్థితికి కారణం తన రక్తమేనని వసుధకి తెలుసు. కూరగాయలు తెచ్చేందుకు వెళ్ళిన భర్త ఇంకా తిరిగి రాలేదు. కొత్త ఊరు. ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్ ఒకేలా ఉన్నాయి. భర్త దారి తప్పాడేమోనన్న భయం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

ఆదివరాహమూర్తి ఎంతో సంతోషంగా తన వయస్సును కూడా లెక్క చేయకుండా కుర్రాడిలా అపార్ట్ మెంట్ మెట్లు ఎక్కుతున్నాడు. వసుధా నిలయం, దాని కింద ఆదివరాహమూర్తి అనే నేమ్ బోర్డ్ కనిపించేసరికి ఎందుకో ఆనందం కన్నీటి పొరగా కమ్మింది.

ఎప్పుడనగా వెళ్ళారు, ఎప్పుడొచ్చారు అంటూ అరచిన భార్య వసుధ కేకతో పెద్దగా నవ్వుతూ, నేమ్ బోర్డ్ చూపించి, ఇదీ నేనంటే, అన్నట్లుగా ఫోజు పెట్టాడు ఆదివరాహమూర్తి.

“సంతోషించాం” అంటూ వసుధ, భర్త చేతిలో సంచి అందుకుని చూసింది. అంతే భూకంపం వచ్చినప్పటి వసుధలా కన్నెర్ర జేసింది.ఎప్పుడో చిన్నప్పుడు రాజుగారి అమ్మాయి పెళ్ళిలో దొంగతనంగా తిన్నాను”  అంటూ తలదించుకున్నాడు మూర్తి.

“అమ్మాయి డబ్బు ఖర్చుపెట్టడానికి మనమెవ్వరం , మన డబ్బు పైసా లేకపోయినా, ఇంటికి మన పేరు పెట్టింది. జీతం మొత్తం మనకే ఇస్తోంది. ఈ ఇంట్లో పనికిరాని వస్తువులు ఏమైనా ఉన్నాయంటే అది మనమే. కాని అమ్మాయి వల్ల మనం అపురూప వస్తువుల మయ్యాం. ఇదంతా అమ్మాయి సంపాదన. కనీసం అమ్మాయి సంపాదనతోనైనా మనం అమ్మాయికి పెళ్ళి చేయాలి కదా ! ”

‘అమ్మాయికే బంగారం, ఎదురుకట్న మిచ్చి మరీ చేసుకుంటారు “.

“మీరు చేసుకున్నారా” సూటిగా అడిగింది వసుధ.

తలదించుకున్న వరాహమూర్తి దగ్గర్కి వచ్చి సంచి చేతికి అందించి ఇచ్చేసి, డబ్బులు తీసుకు రండి. పులసతోనే కాదు, పచ్చడి మెతుకులతో కూడా కడుపు నిండుతుంది. అంటుండగా ఉష లోపల్కి వస్తూ ” డాడీ.. డాడీ.. నీకోసం ఏం తెచ్చానో చూడంటూ, తాను కొన్న పులసని బయటకు తీసి చూపించింది. తల పట్టుకుంది వసుధ.

“నాన్నకి ఇష్టమని తెచ్చానమ్మా! నీకూ ఇష్టమేగా” అంటూ వసుధని చుట్టుకుంది ఉష. తప్పు చేసిన పిల్లాడిలా తాను కొన్న పులసని చూపించాడు ఆదివరాహమూర్తి.

“డాడి, నేనూ ఒకేలా ఆలోచిస్తున్నాం” అంటూ వాళ్ళిద్దరి మధ్య ఒదిగిపోయింది ఉష.

***

ఫోన్ రింగ్ అయితే వసుధ  రిసీవ్ చేసుకుంది.

హలో … అవును చెప్పండి. పెళ్ళి వారిస్తున్నారా… ఎప్పుడు.. ఈ రోజా… అమ్మాయి బాగా నచ్చిందా. కట్నం ఎంతిచ్చినా చేసుకునేలా ఉన్నారా.. అలాగే.. ఉంటాను… అంటూ ఫోన్ కట్ చేసి, మ్యాట్రిమొనీ వాళ్ళు ఫోన్ చేసారు, పెళ్ళి వారిస్తున్నారు. అంటూ భర్త కళ్ళల్లోకి చూసింది.

” రుణం తీరిపోతోందన్నమాట” అన్నాడు దిగులుగా..

‘ తప్పదు కదండి ‘ అంది వసుధ.

” భగవంతుడు మంచి కొడుకు నిమ్మంటే, అంతకంటే మంచి కూతుర్నిచ్చాడు ! అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆది వరాహమూర్తి.

****

‘అమ్మాయి మాకు బాగా నచ్చింది.’ అంది చంద్రిక, భర్త అనిల్ కుమార్ గారిని మాట్లాడనివ్వ కుండా. “ఎందుకు నచ్చదు” నాలుగు రోజులు ఏదో వంకతో ఇంట్లో తిష్ట వేసి, ఇంట్లో అందరికీ శల్య పరీక్షలు పెట్టావు. గట్టి వాళ్ళు కాబట్టి ఆగారు.” అనుకున్నాడు మనసులో పైకి మాత్రం నవ్వుతూ అనిల్.

“చాలా సంతోషం” అంటూ ఎంతో ఆనందించారు వసుధ వరాహమూర్తులు.

ఎప్పటి లాగే ఉష ఆఫీసుకి వెళ్ళిపోయింది. వెళ్ళేముందు వసుధ చెవిలో ఏదో చెప్పి, మరీ వెళ్ళింది ఉష.

చంద్రిక ఉష గురించే ఆలోచిస్తోంది. “ఏమి ఆలోచిస్తున్నారు ” అన్న వసుధతో ” మీ అమ్మాయి గురించే. ఆ కాలంలో ఇంత మంచి అమ్మాయిని మీరు ఎలా కన్నారా! అని. ఈ కాలంలో చెడిపోకుండా ఇంత మంచిగా ఈ అమ్మాయి ఎలా మిగిలిందా అని ”

వరాహమూర్తి కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగాయి.

వసుధ ఏదో చెప్పబోతుంటే చంద్రిక ఆపింది, ఇంత మంచి అమ్మాయిని మాకు కోడలుగా పంపండి. కాదనకండి. మా అబ్బాయి అనిరుధ్ చాలా మంచివాడు. ఒక అమ్మాయిని ప్రేమించి, పెళ్ళి చేసుకున్నాడు. మేము అడ్డు చెప్పలేదు. ఆ అమ్మాయి పెళ్ళైన వారం రోజులకే కరెంట్ షాక్ తగిలి చనిపోయింది. అప్పట్నుంచి దిగులుగా, సర్వం పోగొట్టుకున్నవాడిలా మిగిలాడు. ఏదో పేరుకి ఉద్యోగం చేస్తున్నాడు, లక్షలు సంపాదిస్తున్నా మనశ్శాంతి లేదు. పెళ్ళి మాట ఎత్తితే, చిరాకు పడేవాడు. అలాంటిది ఉష ఫొటో చూసిన తర్వాత చిరాకు పోయింది. మా బిడ్డ ముఖంలో కొత్త వెలుగు కనబడింది. ఉష, అనిరుధ్ ల జంట చాలా బాగుంటుంది. కాదనకండి అంటూ చంద్రిక వసుధ చేతులు పట్టుకుంది.

“మా అబ్బాయికి రెండో పెళ్ళి అని సంశయిస్తున్నారా” అని అడిగాడు సంశయంగా అనిల్ కుమార్.

“మీ అమ్మాయికి ఎవరైనా ఎదురు కట్నం ఇస్తారు. అలాగే మేమూ ఇస్తాం! అంది చంద్రిక,

“కూర్చండి..”అంటూ చంద్రిక పక్కన కూర్చుంది వసుధ.

“ఉష మా అమ్మాయి కాదు. మా కోడలు “అంది వసుధ.

‘మరి మీ కొడుకు”… అంటూ

గొంతులోనే చంద్రిక కు మాట ఆగిపోయింది.”చదువుకున్న మూర్ఖుడు నా కొడుకు. పురాణాల్లో వసుధ, ఆదివరాహమూర్తుల కొడుకు నరకాసురుడు. నా కొడుకు కలియుగ నరకాసురుడు. మమ్మల్ని ఇరాన్ పంపాలనుకున్నాడు. దేశం చూపించడానికి కాదు. మమ్మల్ని చంపి, మా అవయవాలు అమ్మి డబ్బు చేసుకునేందుకు. డబ్బు కోసం తల్లిదండ్రులమైనా వృద్ధులం కాబట్టి మిమ్మల్ని చంపాలనుకున్నాడు. యవ్వనంలో ఉంది కాబట్టి భార్యని దుబాయ్ లో వ్యభిచార గృహాలకి అమ్మాలనుకున్నాడు. ఆ దేవుడు మావైపు ఉన్నాడు, అందుకే మేము ఇక్కడున్నాం. వాడు పోలీస్ ఎన్ కౌంటర్లో చచ్చి పైనున్నాడు.” అంటూ ఏడ్చాడు ఆదివరాహ మూర్తి.

” అప్పట్నుంచి ఉష మమ్మల్ని అత్తమామలుగా కాదు తల్లిదండ్రులుగా చూస్తోంది. అలాంటి కూతురు లాంటి కోడలున్న మేము చాలా అదృష్టవంతులం.” అంటూ చంద్రిక ని చూస్తూ తన భర్తని ఓదార్చింది వసుధ.

***

చంద్రిక ఏడుస్తోంది. తన ప్రవర్తనను తలుచుకుని ఏడుస్తోంది. తాను అత్తమామలతో ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడుతూ ఏడుస్తోంది. ఉష ఆకాశమైతే తాను పాతాళమని, తాను ఉషలా ఎలా ఉండలేకపోయా నంటూ ఏడుస్తోంది. భర్త అనిల్ పాదాలు పట్టుకుని క్షమించమని వేడుకుంటోంది. చంద్రికతో భరించలేక, అనిల్ని కష్టపెట్టడం ఇష్టం లేక అనిల్ తల్లిదండ్రులు లెటర్ రాసి, ఇంట్లోంచి వెళ్ళిపోయారు.

***

ఉష ఆఫీసు నుంచి వచ్చింది. విషయం అంతా చెప్పారు వసుధ వరాహమూర్తులు.

అతిధి గదిలోంచి బయటకు వచ్చిన చంద్రిక, ఉషతో, ఉషా ! నువ్వు చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానమ్మా! నీ సంస్కారం ముందు మేము తేలిపోయాం.నిన్ను పరీక్ష చేయాలనుకున్నాం. కానీ మేము ఎప్పుడో పరీక్ష ఫెయిలైన సంగతి గుర్తించాం, నువ్వు మా కోడలు కావడం మా అదృష్టం. ఈ పెళ్ళికి ఒప్పుకోమని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. అంటూ దణ్ణం పెడుతుంటే అన్ని మాటలు వద్దు అన్నట్లుగా చేతులు పట్టుకుని వసుధా వరావ మూర్తుల వైపు చూసింది ఉష.

ఈ పెళ్ళి తమకి ఇష్టమే అన్నట్లుగా, అంతా చెప్పామన్నట్లుగా వారు సైగ చేసారు.

దాంతో ఉష అత్తయ్యా…మావయ్యా… అంటూ చంద్రిక, అనిల్ కుమార్ల పాదాలకు నమస్కరించింది.

ఉష అంగీకరించినందుకు ఎంతో ఆనందించారు వాళ్ళు.

“ఈ పెళ్ళి జరగాలంటే నాకు కట్నం కావాలి.” అంది ఉష.

“చెప్పమ్మా !” ఎంత కావాలి అన్నాడు అనిల్ కుమార్.

“నేను ఇచ్చినంత” అంది ఉష.

“అర్ధం కాలేదమ్మా” ! అంది చంద్రిక. అనాధ నైన నాకు నా అత్త మామలే నా తల్లిదండ్రులు. నా తల్లిదండ్రుల్ని మీకు కట్నంగా ఇస్తున్నాను. “మీ తల్లిదండ్రుల్ని నాకు కట్నంగా ఇవ్వండి.. …ఎదురు కట్నంగా ” అంది ఉష.

అనిల్ చంద్రిక ఒక్కసారిగా ఏడ్చారు. ఏదో చెప్పబోయారు.

“నాకు అంతా తెలుసు. మీ అత్తమామలు ఎక్కడున్నారో కూడా తెల్సు. కాని నేను చెప్పును.

మీరు వాళ్ళని వెతికి పట్టుకుని, క్షమించమని ప్రార్ధించి ఇంటికి తీసుకుని వచ్చి, పెద్దల స్థానంలో, కూర్చోబెట్టి, అప్పుడు వాళ్ళకి నన్ను చూపించండి, వాళ్ళు ఒప్పుకుంటే….. అప్పుడు పెళ్ళి” అంది ఉష..

“చిన్నదానివైనా మాకు చాలా పెద్ద సంస్కారం నేర్పావమ్మా!.. నా తల్లిదండ్రులు ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి వారిని నీకు ఎదురు కట్నంగా ఇస్తాను”అన్నాడు అనిల్ కుమార్.

“నా ఆత్తమామల్ని ప్రత్యక్ష దైవాలుగా కొలుస్తాను. నా తప్పును నీ సత్ప్రవర్తన ద్వారా సరిదిద్దా వమ్మా! “అంటూ చంద్రిక ఏడుస్తూ, ఉష చేతులు పట్టుకుంది.

“వృద్ధులంటే మూలనబడ్డ పనికిరాని వస్తువులు కాదు, మనల్ని వృధ్ధిలోకి తీసుకొచ్చేవారు” అనే భావన అందరి మనసుల్లో ఒక్కసారిగా కదిలింది.

రచన :- అశ్విని

ఫోన్  నెంబర్:-9989845319

Previous articleకొత్త సినిమాలతో పోటీ పడుతున్న శింబు ‘మన్మధ’
Next articleలాంచ‌నంగా ప్రారంభ‌మైన‌ ‘నా నిరీక్షణ’ చిత్రం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here