ఎవిరి డాగ్ హేజ్ ఏ డే.. అనటం మనం తరచూ వింటూనే ఉంటాం. అంటే ప్రతి కుక్కకూ ఒక రోజు రావటం అన్నమాట. మధ్యప్రదేశ్‌లో జాకీ అనే కుక్కకు ఆ రోజు రానే వచ్చింది. కొడుకు మీద కడుపుమంట ఆ శునకానికి ఏకంగా రాజదర్పం తెచ్చిపెట్టింది. జాతీయస్థాయిలో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించేందుకు కారణమైంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. మధ్యప్రదేశ్‌లో ఒక రైతు నారాయణ. ఇద్దరు భార్యలు. మొదటి భార్య మరణించాక.. రెండో వివాహం చేసుకున్నాడు. ఐదారుగురు పిల్లలు. అయితే.. కొడుకు తీరు మాత్రం సహించేది కాదట. తన మాట వినకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న సుపుత్రుడికి బుద్ది చెప్పాలని తండ్రి నిర్ణయించుకున్నాడు. అంతే.. తాను కాయకష్టం చేసిన సంపాదించుకున్న 18 ఎకరాల భూమిలో సగ భాగం అంటే.. 9 ఎకరాలు జాకీ అనే కుక్కకు రాసిపారేశాడు. మిగిలిన సగం.. తన రెండో భార్యకు చెందేలా వీలునామా సిద్ధం చేశాడట. అంతగాకుండా తన కొడుకుగా భావించే శునకం జాకీను ఎవరైతే బాగా చూసుకుంటారో.. వారికే దానికి కేటాయించిన 9 ఎకరాలు చెందుతాయంటూ మెలికపెట్టాడట. ఏమైనా.. కొడుకు మీద కోపం.. శునకం మీద ప్రేమగా మారటమే కాదు.. ఏకంగా ఆస్తిపాస్తులు రాసిచ్చేంత వరకూ చేరటం నిజంగా విడ్డూరమే సుమా అనుకుంటున్నారట గ్రామస్తులు.