నాన్న.. రెండక్షరాల సముద్రం. సాగరాన్ని అర్ధం చేసుకోవటం ఎంత కష్టమో.. తండ్రి మనసును గుర్తించటమూ అంతే. లోలోపల బడభాగ్నులు పేలుతున్న గంబీరంగా ఉండగలడు. కడుపులో ఆకలి మెలిపెడుతున్నా.. బ్రేవ్‌మని తేన్సగలడు. అందుకేనేమో.. తనికెళ్ల భరణి వంటి రచయిత.. ఎందుకో నాన్న వెనుకబడ్డాడంటూ.. కన్నతండ్రి త్యాగాలను గుర్తుచేస్తూ కన్నీరు తెప్పించారు. నాన్న ఔన్నత్యం నిజమే అనేలా.. హైదరాబాద్‌లో ఓ ఘటన జరిగింది. రవీంద్రభారతి వద్ద రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌కు చెందిన నాగులు అనే యాభైఐదేళ్ల వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటిచు కున్నాడు. దాదాపు 60శాతం కాలిన శరీరంతో గాంధీ ఆసుపత్రలో చికిత్స పొందుతున్నాడు. తెలంగాణ ఉద్యమంలో నాటి నుంచి నేటి వరకూ లక్షలాది మంది ఉద్యమకారులు ముందు వరుసలో నిలబడ్డారు. అలాంటి వారిలో నాగులు కూడా ఉన్నాడు. బంగారు తెలంగాణ సంగతి ఎలా ఉన్నా.. బిడ్డల చదువు కోసం అప్పులు చేయక తప్పని పరిస్థితులు ఆ తండ్రి చవిచూశాడు. తనలా.. పిల్లలు ఎటూగాకుండా పోతారనే భయం. అత్తెసరు చదువులతో కూలీలుగా మిగులుతారనే ఆందోళన. అసలే కరోనా సమయం.. ఉపాధి దూరమైంది.. భవిష్యత్ అంధకారంగా మారింది.
ఎటుచూసినా పిల్లల చదువులు సాగించే అవకాశం కనిపించకుండా పోయింది. అందుకే.. తాను మరణిస్తే.. బిడ్డల చదువుకు సర్కారు సాయం చేస్తుందనే ఆలోచన చేశాడు.. ఇంటి నుంచి బయల్దేరుతూనే.. బిడ్డలకు ధైర్యం చెప్పాడు. తల్లిని మంచిగా చూసుకోమని బుద్దులు చెప్పాడు. ప్రాణాలు పోయినా.. బిడ్డలకు సరస్వతీ కటాక్షం లభిస్తుందనుకున్నాడు.. పెట్రోల్ పోసుకున్నాక.. అగ్గిపుల్ల గీసుకున్నాడు. శరీరాన్ని అగ్గి దహిస్తున్నా.. కళ్లెదుట కనిపించిన బిడ్డల బంగారు భవిష్యత్‌తో కనుమూయాలనుకున్నాడు. కానీ.. ఇంతలో ఎవరో నీరు పోసి నిప్పు ఆర్పారు. ఆసుపత్రికి తరలించారు. అక్కడ తన పరిస్థితి దీనంగా చెప్పటంతో వైద్యులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. నాగులు అనుకున్నట్టుగానే.. దయగల మనసులు స్పందించాయి. బిడ్డలను ఉచితంగా చదివించేందుకు ముందుకు వచ్చాయి.