ఆహార భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు సుస్థిర వ్యవసాయం చాల అవసరం : గవర్నర్
• పేదరిక నిర్మూలనకు సుస్థిర వ్యవసాయం అవసరం
• భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలి
• సుస్థిర వ్యవసాయంపై వెబినార్ లో గవర్నర్
వేగంగా పెరుగుతున్న జనాభాకు ఆహారభద్రతను కల్పించాలన్నా, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నా సుస్థిర వ్యవసాయ పద్ధతులు అవలంబించడం కీలకమని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ తెలిపారు .
రాబోయే తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలంటే వనరుల సమతుల వినియోగంతో పాటు, పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతులు పాటించాల్సిన ఆవశ్యకత ఉందని గవర్నర్ తెలివారు.
“సుస్థిర వ్యవసాయం” అన్న అంశంపై ఇనిస్టిట్యూషన్ ఆఫ్ గ్రీన్ ఇంజనీర్, చెన్నై, సంస్థ ఆధ్వర్యంలో నోబెల్ బహుమతి గ్రహీత సర్ రిఛర్డ్ జాన్ రాబర్ట్స్ గౌరవార్ధం ప్రత్యేక ఆన్ లైన్ ఉపన్యాసం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ ప్రపంచ భూభాగంలో భారత్ కు కేవలం 2.4 శాతం మాత్రమే ఉందని, కానీ ప్రపంచ జనాభాలో దాదాపు 16 శాతం భారత్ లో ఉన్నారన్నారని దీనితో ఆహార భద్రత గొప్ప సవాలుగా మారిందని తెలిపారు .
నూట ముప్పై కోట్ల మంది జనాభాకు ఆహార భద్రత కల్పించడంలో భారత్ గణనీయమైన విజయం సాధించినప్పటికీ, భవిష్యత్ అవసరాలకు సుస్థిర పద్ధతులు కీలకంగా పనిచేస్తాయని డా. తమిళిసై వివరించారు.
నేల సారాన్ని రక్షీస్తూ, నీటి సద్వినియోగంతో, వనరుల విధ్వంసం జరగకుండా, ప్రకృతి సిద్ధమైన వ్యవసాయంతో ఆహార భద్రత సాధించడం వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు, ప్రభుత్వాల ముందున్న అతి పెద్ద సవాలని గవర్నర్ విశ్లేషించారు.
తరతరాలుగా భారతీయులు నదులు, చెట్లను, ప్రకృతిని కాపాడుతూ పూజిస్తున్నారని, ఈ ఆధ్యాత్మిక నమ్మకాలతో ప్రకృతి పరిరక్షణ అద్భుతంగా జరిగిందన్నారు.
టెక్నాలజీ ఆవిష్కరణలు, నవకల్పనలు ప్రకృతి పరిరక్షణ, వనరుల సమతుల వినియోగం, భావితరాలకు ఆహార భద్రత కల్పించేవిగా ఉండాలని డా. తమిళిసై పిలుపునిచ్చారు.
కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఈ-మార్కెటింగ్ తో పాటు ఆత్మనిర్భర్ భారత్ ప్రణాళికలో భాగంగా వ్యవసాయానికి కేంద్రం లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించడం వ్యవసాయం ఎంత కీలకమో తెలియజేస్తున్నదని గవర్నర్ అన్నారు.
ఈ వెబినార్ లో పాల్గొన్న నోబెల్ బహుమతి గ్రహీత సర్ రిఛర్డ్ జాన్ రాబర్ట్స్ మాట్లాడుతూ వ్యవసాయంలో టెక్నాలజి వినియోగం సుస్థిర అభివృద్ధికి దోహదపడేదిగా ఉండాలని తెలిపారు .
విత్తనాల నాణ్యత, భూసార పరిరక్షణ, నీటి వనరుల సమర్ధ వినియోగం, ఆరోగ్యకరమైన పంటల సాగు విధానాలు, ఆహార భద్రత కోసం అధిక ఉత్పత్తి అంశాలు ముఖ్యమన్నారు .
ఈ కార్యక్రమంలో పద్మశ్రీ ఆర్.ఎమ్. వసగం, ఎపిజె అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్టీ ఎపిజేఎంజే షేక్ దావూద్, ఐజెన్ అద్యక్షుడు డా. ఎల్. రమేశ్ తదితరులు పాల్గొన్నారు.