గన్నవరం మరోసారి గరంగరంగా మారింది. మూడు వర్గాల మధ్య గొడవ తారస్థాయికి చేరింది. గన్నవరం నియోజకవర్గంలో గ్రామ సచివాలయాలను టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రారంబోత్సవాలు చేస్తున్నారు. దీన్ని దుట్టా వర్గం గట్టిగానే ప్రతిఘటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గీయుల మధ్య పలు గ్రామాల్లో గొడవలు మొదలయ్యాయి. వంశీ ఎంత నచ్చజెప్పినా ఇరువైపులా ఉన్న కార్యకర్తలు దారికిరావట్లేదు. బావులపాడు మండలం కాకులపాడు గ్రామంలో వంశీ, దుట్టా వర్గీయులు దాడి కూడా చేసుకున్నారు. ఇదంతా వంశీ కళ్లెదుట జరిగింది. ఇరువురికీ సర్దిచెప్పిన వంశీ శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు. పోలీసులు అక్కడే ఉన్న నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. దండగుట్లలోనూ వంశీ ఫ్లెక్సీలను చింపి పారేశారు. వ్యతిరేకంగా బ్యానర్లు వెలిశాయి. ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలు అధికార పార్టీకు చుక్కలు చూపుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు సంగతి ఎలా ఉన్నా.. జనంలో పలుచన అవుతున్నామనే భయం కూడా వెంటాడుతుందట.
తాజాగా వైసీపీ సమన్వయకర్త… యార్లగడ్డ వెంకట్రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపేందుకు ఆయన అభిమానులు సిద్ధమయ్యారు. కానీ.. అక్కడ కూడా పోలీసుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. కొవిడ్19 నిబంధనల నేపథ్యంలో ఎటువంటి వేడుకలు జరపకూడదంటూ అనుమతి నిరాకరించారు. గన్నవరంలో అంతా తానై అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులకు వంశీ ఝలక్ ఇవ్వటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నటి వరకూ తమపై కేసులు పెట్టించి వేధించిన వంశీతో నడిచేందుకు వైసీపీలోని కొన్ని వర్గాలు సుముఖత చూపటం లేదు. వంశీ మాత్రం గన్నవరం వైసీపీ నేత ఎవరనేది సీఎంకు తెలుసనే విధంగా నడుచుకుంటున్నారు. పైగా టీడీపీ నుంచి వైసీపీలోకి కార్యకర్తలు, నాయకులకు వైసీపీ కండువాలు కప్పుతూ ముందుకెళతున్నారు.
వల్లభనేని వంశీ వైసీపీ పంచన చేరటం వెనుక కొడాలి నాని అన్నీ తానై నడిపించారు. దీన్ని యార్లగడ్డ వెంకట్రావు తట్టుకోలేకపోయారు. ఒకనొక దశలో పార్టీ ను వీడేందుకు సిద్ధపడ్డారు. 2019 ఎన్నికల్లో వంశీపై యార్లగడ్డ ఓడిపోయారు. అయినా పార్టీ అధికారంలోకి రావటంతో అనధికార ఎమ్మెల్యేగా యార్లగడ్డ చెలామణీ అవుతున్నారు. అకస్మాత్తుగా తెరమీదకు
వంశీను తీసుకురావటంతో యార్లగడ్డ అలకబూనారు. ఆ తరువాత జగన్ జోక్యం చేసుకుని.. వెంకట్రావుకు కేడీసీసీ ఛైర్మన్ పదవి తో శాంతపరిచారు. కానీ.. తానే వైసీపీ ఎమ్మెల్యేగా వంశీ జనాల్లోకి వెళ్లటం ఇటు దుట్టా, అటు యార్లగడ్డ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా వంశీ పూర్తిగా టీడీపీ కార్యకర్తలకే ప్రాముఖ్యత ఇస్తున్నారనే ఆందోళన కూడా చేశారు. ముఖ్యంగా ఇళ్లపట్టాల పంపిణీ విషయంలో వైసీపీ కార్యకర్తలను కాదని.. టీడీపీలో ఉన్నవారికే ఇచ్చారంటూ పంచాయతీ కూడా పెట్టారు.
ఇటీవల దుట్టా, వల్లభనేని మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకానొక దశలో దుట్టా.. కొద్దిరోజులు ఆగండీ గన్నవరం శుభవార్త వింటుందంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ సమయంలో సైలెంట్‌గా ఉన్న యార్లగడ్డ మరోసారి తెరమీదకు వచ్చారు. గ్రామాల్లోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏ సమయాన ఏం జరుగుతుందనే ఆందోళన కూడా మొదలైంది. మరి ముగ్గురు నేతల మధ్య ముసురుకున్న రచ్చను వైసీపీ అదిష్ఠానం ఎలా పంచాయతీ చేస్తుందనేది ఆసక్తిగా మారింది.