గంటా శ్రీనివాసరావు ఎందుకిలా మౌనంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం నుంచి ఇంత ఒత్తిడి వస్తున్నా ఫ్యాన్ రెక్కల కిందకు వెళ్లేందుకు ఆలస్యం చేసేందుకు కారణాలేమిటీ. అవంతి శ్రీనివాస్ అడ్డంకే ప్రధానమైన ఇబ్బందా! ఇవన్నీ ఏపీ రాజకీయాల్లో చర్చనీ యాంశంగా మారిన అంశాలు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ ఎమ్మెల్యేలు చాలామంది వైసీపీ వైపు క్యూ కడతారని అంచనాలు నిజమయ్యాయి. వల్లభనేని వంశీ, కరణం బలరాం , మద్దాలి గిరి వంటి టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకోకపోయినా.. జగన్ పాలన పట్ల తాము సమ్మోహితులమయ్యామంటూ సైకిల్ దిగీ దిగనట్టుగానే ఉన్నారు. గంటా కూడా అదే దారిలో పసుపు కండువా తీసేస్తారనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే.. విశాఖలో అవంతి వర్సెస్ గంటా అన్నట్టుగా వైరం ఉంది . పైగా గంటా వస్తే పార్టీకు నష్టమంటూ కొందరు వైసీపీ కార్యకర్తలు ధర్నా కూడా చేపట్టారు. ఇలా గంట కొట్టడం వాయిదా పడతూ వస్తుంది. టీడీపీ హయాంలో భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సిట్ ద్వారా దర్యాప్తు చేసింది. ఈ కేసుల్లో గంట మోగుతుందనే అందరూ భావిస్తున్నారు. అందుకే.. గంట గ్యారంటీగా పార్టీ మారతారనే ఊహాగానాలకు మరింత బలమొచ్చింది.
బ్యాంకు రుణాల కట్టలేని దుస్థితిలో గంటా ఆస్తులను వేలానికి సిద్ధమయ్యాయి. ఇప్పుడు ఏదోఒక బలమైన పార్టీ పంచన చేరాల్సిన అవసరం వచ్చింది. వైసీపీలో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా కాషాయ కండువా కప్పుకోవటం ద్వారా కేంద్రం నుంచి రక్షణ దొరుకుతుంది. రాష్ట్రంలోనూ వైసీపీ, బీజేపీ మధ్య అందరూ అనుకునేంత వైరం కూడా లేదు. కాబట్టి వైసీపీ పెద్దలు కూడా తన జోలికి రారనే భరోసా గంటాలో ఉందట. అందుకే.. ఇటీవల సోము వీర్రాజుతో టచ్‌లోకి కూడా వెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కడ కూడా గంట పట్ల అంతటి సానుకూల వాతావరణం లేదు. పైగా జనసేనాని పవన్‌కు గంటా పట్ల వ్యతిరేక భావన ఉంది. కాబట్టి గంటా కమలం గూటికి చేరాలంటే అటు పవన్ ఆమోదం కూడా కావాలి. వీటన్నింటినీ కో-ఆర్డినేసన్ చేసుకుని గంటా బీజేపీ చెంతకు చేరటం నిజంగానే సవాల్ అనే చెప్పాలి.



