వయసులో ఉన్న ఆడపిల్లకు పందిపిల్ల కూడా అందంగా కనిపిస్తుందంటూ… ఓ సినిమా డైలాగ్. పందులతో ఇబ్బందులు ఉండవు. మహా అయితే వాటి బురదను అంటిస్తాయి. కానీ.. కళ్లెదుట అందంగా కనిపించే మృగాళ్లతోనే అసలు సమస్య. నవ్విస్తూ.. కవ్విస్తూ మాటలతో మభ్యపెడతారు. ఎమోషన్‌గా దగ్గరకు రాగానే అసలు రూపం బయటపెడతారు. అమ్మాయిలు.. అబ్బాయిలో స్నేహం చేసేటపుడు జాగ్రత్త.. ఇదేదో ఆడపిల్లల కోసం చెబుతున్న మాటలు కాదు.. రెండేళ్లపాటు.. ఒక మృగంతో తాను రిలేషన్‌షిప్‌లో ఉండటం వల్ల చవిచూసిన నరకాన్ని కన్నీటితో పంచుకున్న దివ్యతేజస్విని మాటలు. విజయవాడలో నాగేంద్రబాబు అనే మృగాడి చేతిలో దివ్య దారుణంగా హత్యకు గురైంది. నాగేంద్ర కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తామిద్దరం పెళ్లి చేసుకున్నామంటూ.. కలసి ఆత్మహత్య చేసుకున్నామంటూ కల్లబొల్లి మాటలతో పోలీసులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడంటూ దివ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో కూడా నాగేంద్ర ఎంతటి సైకో అనేది గుర్తించారు. ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా దివ్య తాను ఏళ్లతరబడి ఎంతటి నరకం చవిచూసిందో చెప్పింది. ఏడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నా.. అతడిలోని మృగాన్ని.. సైకోను చూసి బయటపడేందుకు పరితపించింది. అతడి చేతిలో తన కుటుంబం ఏమౌతుందనే భయంతో విలవిల్లాడింది.
అందరిలా బేలగా మారకుండా.. చదువుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది. కష్టపడి చదువుతుంది. మంచి ఉద్యోగం వస్తే దూరంగా వెళ్లిపోయి కొత్త జీవితాన్ని కన్నవారితో గడపాలనుకుంది. కానీ.. ఆ మృగం మాత్రం వెంటాడాడు. సెల్‌పోన్‌కు బెదిరింపులు.. హెచ్చరికలు చేస్తూ కునుకు పట్టకుండా చేశాడు. ఒక సగటు ఆడపిల్ల తాను చేసిన తప్పును కడుపులో దాచుకున్న తల్లిదండ్రుల మాటలకు కట్టుబడింది. అయినా ఆ మృగాడు వదల్లేదు. గంజాయి మత్తులో దాడికి తెగబడ్డాడు. దారుణంగా చంపేశాడు. అందుకే దు తాను పడ్డ నరకాన్ని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వీడియో ఉంచిన దివ్య తనలాంటి ఆడపిల్లలకు సూచనలు చేసింది. ప్రేమ పెళ్లంటూ మోసగించే మగాళ్లను నమ్మవద్దంటూ వారించింది. ముందు ప్రేమ ఆప్యాయతలు కురిపించి ఆ తరువాత నరకం చవిచూస్తారంటూ హెచ్చరించింది.
విజయవాడలో ప్రేమ ముసుగులో ఇటువంటి దారుణం జరిగితే.. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ యువతిని ముగ్గురు యువకులు నమ్మించి లైంగికదాడికి తెగబడటం సంచలనంగా మారింది. మూడు నెలల క్రితమే.. ఆ యువతిని లక్ష్యంగా చేసుకున్న ఆ ముగ్గురూ పుట్టినరోజును సాకుగా చూపి.. నగరమంతా తిప్పారు. స్నేహితులుగా నమ్మి వెళ్లిన యువతిని హోటల్‌కు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి లైంగికదాడి జరిపారు. వాటిని వీడియో, ఫొటోలు తీసి ఉండవచ్చనే అనుమానాలు వస్తున్నాయి. పోలీసు కస్టడీలో నిందితుల నుంచి నిజాలు రాబట్టాల్సి ఉందంటున్నారు పోలీసులు. ఇవి కేవలం ఉదాహరణ మాత్రమే.. కొద్దికాలం క్రితం.. ఒక యువతిని తన రూమ్‌కు రమ్మని పిలిచి.. గొంతుపిసికి చంపేశాడో యువకుడు. శవాన్ని మూటగట్టి మూసీనదిలో వదిలేశాడు. మరో ఘటనలో ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తుందని గండిపేట చెరువు వద్దకు తీసుకెళ్లి చున్నీతో చంపేసి.. పెట్రోల్ పోసి తగులబెట్టాడు. కళ్లెదుట జరుగుతున్న దారుణాలను గమనించి ఇప్పటికైనా సగటు ఆడపిల్లలు ఆప్రమత్తంగా ఉండాలనేది ఆ అభాగినుల మరణం చెబుతున్న నిజం.