పిలుపు.. ఎంత ఆత్మీయంగా ఉంటే అంతగొప్ప బంధం పెనవేసుకుంటుంది. గుండీలు ఊడిన చొక్కాలు. ఎప్పుడూ జారుతూ ఉండే నిక్కర్లను పైకి లాక్కుంటూ సాగే అమాయకత్వం. ఆ సమయంలో పసితనానికి తెలిసింది ఒక్కటే పిలుపు పక్కన తన ఈడున్న వాడు ఎవరైనా.. సరే ఒరేయ్ అని పిలవటమే. కల్లా కపటం తెలియని ప్రాయంలో ఆ పిలుపు ఎంత మధురంగా ఉంటుందనేది దాదాపు అందరూ ఆస్వాదించే ఉంటారు. బడిలో ఉన్నంత వరకూ భుజాన చేతులు వేసుకుని.. ఒరేయ్.. అరేయ్ అనుకుంటూ ఎక్కడకెళ్లినా జంటగా నడిచే స్నేహం మరచిపోలేని జ్ఞాపకం. అమ్మనాన్నలు కూడా.. ఇప్పుడున్న ముద్దుపేర్లు గాకుండా.. అమ్మ..నాన్న అంటూ భౌతికంగా దూరమైన.. కన్నవారని బిడ్డల్లో చూసుకుంటూ ఆ పిలుపులో మాధుర్యం ఆస్వాదించేవారు. ఇది గతం.. పాతకాలం.. స్వార్థం తెలియని రోజుల్లో తాతలు, తండ్రులు నడచిన మార్గం.. మరి ఇప్పుడో.. ఒరేయ్ పిలుపు ఎక్కడుంది. 1000 వోల్టుల లైట్ పట్టుకుని వెతికినా మచ్చుకైనా కనిపించట్లేదు.
నిజానికి పిలుపులో ఏముంది.. మనసులో ఉండాలి కానీ అనేవారూ లేకపోలేదు. కానీ.. ఒరేయ్.. ఒసేయ్ అనే పిలుపులో మాధుర్యం.. మనసు పొరల నుంచి వస్తుంది. దానిలో అధికారం.. అవమానం.. అనురాగం.. అన్నీ ఉంటాయి. అయినవారు పిలుపులో ఎటువంటి స్వరం ఉన్నా అది చెవులకు ఇంపుగానే ఉంటుంది.. గుండెను తట్టిలేపుతుంది. మనసును మేలుకొలుపుతుంది. ఖండాలు.. సముద్రాలు.. దేశాలు దాటిన మనిషికి..తామున్నచోట కృత్రిమ వాతావరణంగా భావిస్తుంటారు. అవసరాలు.. అంతకు మించిన లాభనష్టాలు మాత్రమే కనిపిస్తుంటాయి. అవతలి వారి నోటి నుంచి వచ్చే ప్రతి పిలుపులోనూ అవే ధ్వనిస్తుంటాయి. అందుకే.. ఎక్కడో దూరంగా ఉన్నవారికి సొంతూరు నుంచి వచ్చే ఫోన్‌కాల్స్ ఊరటనిస్తుంటాయి. కానీ.. ఒకే ఒక్క ఫోన్‌కాల్ మాత్రం ఊపిరి పోస్తుంది. అదే.. ఒరేయ్ అని పిలిచే స్నేహితుడు ఫోన్ చేసినపుడు మాత్రమే. మరి.. మనవాళ్లు ఎక్కడో ఉన్నారు.. కంటికి కనిపించనంత దూరంగా ఉన్నా.. ఫోన్‌లో ఒరేయ్ అనే పిలుపునకు దగ్గరగానే ఉంటారు. ఒక్కసారి.. మీ ఫోన్ లోని ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఒరేయ్ అనే పిలిచే అపురూప బంధువును.. ఆ నాటి ఆస్నేహ జ్ఞాపికను వెతకండీ.. ఫోన్ చేసి.. ఒరేయ్ ఎలా ఉన్నావ్ రా అంటూ పలుకరించండి. కరోనాను మించిన సంక్షోభాలు ఎన్నొచ్చినా ఒరేయ్.. నేనున్నారా అనే పిలుపు.. ఎన్ని వైపరీత్యాలైనా గెలిచే ధైర్యాన్నిస్తుంది. మరి మీరు ఏమంటారు.. ఒక్కసారి మొబైల్ ఫోన్‌లో లిస్టు చూస్తామంటారా!!