ఏపీలో కాపులు.. తెలంగాణలో మున్నూరు కాపులు రాజకీయాల్లో కీలకం. ఎన్నికల్లో పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగలం సామాజికవర్గం. అందుకే… బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే వర్గానికి బాధ్యతలు అప్పగించింది. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడుగా బండి సంజయ్ దూసుకెళ్తున్నారు. వరుస ఎన్నికల్లో సత్తా చాటారు. దీనికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో టీఆర్ ఎస్ కూడా మున్నూరు కాపు వర్గానికి ప్రాధాన్యతనివ్వటం ప్రారంభించింది. గత మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ మున్నూరు వర్గానికి చెందిన నాయకుడు కాగా.. ప్రస్తుతం మేయర్గా ఎంపికైన ఎంపీ కేకే కుమార్తె.. గద్వాల విజయలక్ష్మి కూడా అదే సామాజికవర్గానికి చెందిన నాయకురాలు కావటం విశేషమనే చెప్పాలి. టీఆర్ ఎస్ కొద్దికాలంగా రెడ్డి వర్గాన్ని దూరంగా పెడుతూ వస్తోంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ మేయర్గా విజయారెడ్డి, కవితారెడ్డి తదితరుల పేర్లు తెరమీదకు వచ్చాయి. అయితే ఊహించని విధంగా విజయలక్ష్మి పేరు బయటకు రావటం.. ప్రమాణస్వీకారం వరకూ చేరటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ మేయర్గా మోతె శ్రీలతరెడ్డిని ఎంపిక చేశారు. కుల సమీకరణల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. విజయలక్ష్మికి మేయర్ పదవి ఇవ్వటాన్ని ఖైరతాబాద్ కార్పోరేటర్ విజయారెడ్డి అవమానంగా భావించినట్టు ఉన్నారు. ప్రమాణస్వీకారం కాగానే అక్కడ నుంచి వెళ్లిపోయారు . సెల్పోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏమైనా.. గద్వాల విజయలక్ష్మి మేయర్ కావటం వెనుక.. ఎంపీ కేకే తనదైన శైలిలో వ్యూహాత్మకంగా వ్వవహరించినట్టుగా తెలుస్తోంది.