వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. లక్ష్యం సాధించేందుకు వేలాదికిలోమీటర్ల పాదయాత్ర నిజంగానే ఏపీ ప్రజలను కదలించింది. ఆయనపై సీబీఐ కేసులు, అక్రమాస్తుల ఆరోపణలు ఇవన్నీ పెద్దగా పట్టించుకోలేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసుడిగా జగన్‌ను తమ భవిష్యత్ నేతగా భావించారు.. అదేస్థాయిలో అభిమానించారు. జగన్ క్రైస్తవుడు అంటూ చేసిన ప్రచారాలు కూడా పెద్ద ప్రభావం చూపలేదు. వైఎస్ తనయుడు జగన్‌ను అందరివాడుగానే జనం భావించారు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు. కుల, మతాలకు అతీతంగా జగన్ మావాడు అనే భావనకు మెజార్టీ సీట్లు ఉదాహరణ. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా జగన్‌ను అభినందించారు. రాజకీయ ఎత్తులతో స్వ ప్రయోజనాలను మాత్రమే ఆశించే చంద్రబాబు నాయుడును ఘోరంగా దెబ్బతీసిన జగన్ పట్ల నరేంద్రమోదీ మరింత ఆసక్తిచూపారంటూ ఆనాడు నేషనల్ మీడియా కూడా చెప్పింది. జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు హిందుత్వం స్వీకరించినట్టుగా ప్రచారం జరిగింది. తాను కూడా అదేబాటలో ఉన్నారు. పాలనపగ్గాలు చేపట్టాక.. 2024లో కేవలం ప్రభుత్వ పనితీరుతోనే వైసీపీ అధికారం చేపట్టాలనే సంకల్పంతో సంక్షేమంపై దృష్టిపెట్టారు. రాజకీయాలను పక్కనబెట్టారంటూ స్వంతపార్టీ నేతలు పలుమార్లు సూచించినా ఇప్పుడెందుకన్నా.. రాజకీయాలంటూ సున్నితంగా తోసిపుచ్చారట.
రాజకీయాలను పక్కనబెట్టి సంక్షేమంపై దృష్టిసారించిన జగన్ మోహన్‌రెడ్డి సర్కార్‌ను హిందు దేవాలయాలపై దాడులు ఇబ్బంది పెడుతున్నాయి. గతానికి భిన్నంగా కొద్దినెలలుగా వరుస ఘటనలు యాదృచ్ఛికమా! రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు ప్రత్యర్థుల్లో ఎవరైనా నడిపిస్తున్న పన్నాగమా! అనే అనుమానాలు లేకపోలేదు. లేకపోతే పనిగట్టుకుని మారుమూల ఉన్న ప్రాంతాల్లోని ఆలయాలపై దాడులు చేయటం.. వాటిని క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్నారు. ఇదంతా కేవలం ఒకరిద్దరు వల్ల అయ్యే పనికాదనేది పోలీసువర్గాలు అంచనావేశాయి. ఎవరో కావాలనే రాజకీయ దరుద్దేశంతోనే తెరవెనుక నుంచి భారీగా నెట్‌వర్క్ చేస్తున్నారనేది కూడా అర్ధమవుతోంది. సున్నితమైన అంశం కావటంతో ప్రభుత్వం కూడా ఆచితూచి స్పందించాల్సి వస్తోంది. మెజార్టీ వర్గమైన హిందువుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సున్నితమైన నాలుగు జిల్లాల్లో ఇప్పటికే నిఘాను మరింత పెంచారు. సామాన్య ప్రజల్లోనూ ఇదంతా ప్రభుత్వ ప్రతిష్ఠను మసకబార్చేందుకు ఎవరో పన్నిన కుట్రగానే భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు పాపులారిటీ కోసమో.. అధికారపార్టీను దెబ్బతీసేందుకో చేశారంటే వైసీపీ పూర్తి మెజార్టీతో అధికారంలో ఉంది . ప్రజల్లోనూ జగన్ పట్ల సానుకూలత ఉందిసజావుగా సాగుతున్న పాలనను ఏ నాయకుడూ.. ఏ ప్రభుత్వమూ దెబ్బతీసుకోవాలని భావించదు. ఎటుచూసినా.. వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేసేందుకు దుష్టపన్నాగం వెనుక బలమైన రాజకీయశక్తులు ఉన్నాయంటున్నాయి వైసీపీ శ్రేణులు.
బిట్రగుంట, దుర్గగుడి, అంతర్వేది, మక్కపేట తదితర దేవాలయాల్లో చోటుచేసుకున్న ఘటనలపై పోలీసుశాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో అయినా దోషులను పట్టుకునేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఒకవేళ దాడుల వెనుక దాగిన శక్తుల గుట్టు బయటపడితే.. వైసీపీ ప్రభుత్వానికి క్లీన్ ఇమేజ్ వచ్చినట్టే. కేసులు ఎటూతేలక మద్యలో చేతులెత్తేస్తే.. అదే స్థాయిలో హిందూ సమాజం నుంచి ప్రతికూలతనూ ఎదుర్కొనే అవకాశాలున్నాయని విశ్లేషకులు లెక్కకడుతున్నారు. అధికార పార్టీకు.. విపక్షాలకు ఇది సంధికాలమే. దోషులుగా తేలినవారు భవిష్యత్ రాజకీయాల్లో భారీమూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుందనేది కూడా జగమెరిగిన సత్యం.