శీర్షిక చూసి తప్పుగా భావించేరు. ఎందుకంటే.. మన తెలుగు సినిమా హీరోలు ఎంతోమంది ఆడవేషంలో అభిమానులకు నవ్వులు పండిచారని చెప్పటమే దీని ముఖ్యోద్దేశం. ఇంతకీ ఈ విషయం ఇప్పుడెందుకు అంటారా.. మొన్న లారెన్స్, శరత్‌కుమార్ ఇద్దరూ కాంచనతో ఎర్రచీరలో ఇరగ దీశాడు. ఇప్పుడు లక్ష్మీతో అక్షయ్‌కుమార్ కూడా చీరకట్టి ట్రాన్స్‌జెండర్ కేరక్టర్‌తో మెరబోతున్నాడు. అయితే.. చీరకట్టడం.. మగాడై ఉండి.. ఆడవేషంలో మెప్పించటం అంత తేలికైన విషయం కాదు. అలనాటి రంగస్థల నటుడు బళ్లారి రాఘవ కూడా తొలిసారి ఆడవేషంతోనే ఆకట్టుకున్నాడు. తాను వేషం కడితే.. ఇంట్లోవాళ్లే గుర్తించలేకపోయారట. ఆ తరువాత అక్కినేని నాగేశ్వరరావు కూడా చీరకట్టుతో మురిపించారు. నందమూరి తారకరామారావు అయితే.. బృహన్నలగా నర్తనశాలలో ఎన్ని వయ్యారాలు ఒలకబోశారో చూడాల్సిందే. మారువేషంలో ఉండేందుకు ఎక్కువ మంది హీరోలు ఎంచుకునేది ఆడ వేషమే సుమా.. మేడమ్ సినిమాలో రాజేంద్రప్రసాద్ ఎంతగా అలరించారు. నిజంగానే అందాల సుందరి దిగి వచ్చినట్టుగా అనిపించలేదు. చిత్రం భళారే చిత్రంలో నరేష్ సిగ్గులు.. సీమంతం బాబోయ్ పొట్ట చెక్కలయిందంటే నమ్మండి. మెగాస్టార్ చిరంజీవి కూడా రెండు మూడు సినిమాల్లో చీరకట్టుతో కనిపించారు. చంటబ్బాయ్‌లో తెల్లటి గౌనుతో ఇంగ్లిషు భామను మరిపించారు. కమల్‌హాసన్ ఒకటా రెండా.. భామనే సత్యభామనే, దశావతారంలో నటవిశ్వరూపం ప్రదర్శించారు అదీ కూడా లేడీ గెటప్‌లో సుమా. విక్రమ్ అయితే మల్లన్నలో దుమ్మరేపారు. రజనీకాంత్, ప్రకాశ్‌రాజ్, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్‌బాబు, మంచు మనోజ్ వరకూ సినిమాలో సన్నివేశానికి తగినట్టుగా ఆడవేషంలో ఔరా అనిపించారు. కొందరైతే.. వీళ్లు హీరోలకంటే.. హీరోయిన్లుగానే మస్త్‌గా ఉన్నారంటూ ఈలలు వేయించారు.