ఏపీ కుల పంచాయితీలకు కేరాఫ్ చిరునామా. ఇది దశాబ్దాలుగా సాగుతున్న అంతర్గత పోరు. ఏ రెండు కులాలు జట్టుకట్టినా విజయం అటువైపే వరిస్తుందనేందుకు అనేక ఉదాహరణలున్నాయి. క్రైస్తవం, హిందుత్వ, ముస్లింలు.. మత ప్రభావం మాత్రం పెద్దగా కనిపించేది కాదు. జాతీయస్థాయిలో ఏదైనా మతపరమైన అంశం తెరమీదకు వచ్చినపుడు మాత్రం గుంటూరు, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో కాస్తో.. కూస్తో గొడవలు జరిగేవి. ముస్లిం మైనార్టీలు కూడా స్నేహంగానే మెలిగేవారు. సముద్రతీర జిల్లాల్లో ఆంగ్లేయుల ప్రభావంతో క్రైస్తవ మిషనరీలు సీఎస్ఐ, ఆర్ సీఎం వంటి సంస్థలు విద్య, వైద్య రంగాల్లోకి వచ్చాయి. విదేశీ నిధులతో క్రమంగా గుడారాలు విస్తరించాయి. అయినా ఎక్కడా మత సామరస్యానికి విఘాతం ఏర్పడలేదు. పండుగల సమయంలోనూ శాంతివాతావరణం ఉండేది. పదేళ్ల వ్యవధిలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి.
కేంద్రంలో బీజేపీ సర్కారుపై అక్కసుతో ప్రాంతీయపార్టీలు కాషాయపార్టీ వ్యతిరేక ఓట్లను సొమ్ము చేసుకోవాలనే రాజకీయ దుర్బుద్దితో మతాల వారిగా ఓటర్లను విడదీసి… సంక్షేమ పథకాలు, ఉచిత సేవలకు అర్హులుగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన పార్టీలు కూడా రాబోయే ఐదేళ్లలో మైనార్టీ ఓట్లకు గాలమేస్తూ… హిందువుల మనోభావాలకు ప్రాధాన్యత నివ్వటం విస్మరించాయి. ఫలితంగా మూడు మతాల మధ్య పోటీ క్రమంగా విధ్వేషం వరకూ దారితీశాయి. ప్రజలు ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకుంటున్న సమయంలో రాజకీయపార్టీలు తమ స్వార్థం కోసం ఒక మతానికి అనుకూలంగా మాట్లాడటం. విలువైన ఆస్తులు, ప్రభుత్వ యంత్రాంగంపై దాడులు చేసిన మూకపై కేసులు కొట్టివేయటం వంటి సానుకూల నిర్ణయాలు.. హిందువుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి.
హిందువులను కేవలం ఎన్నికల సమయంలో కులాల వారీగా విభజించి ఓట్లను రాబట్టుకోవటం చాలా తేలిక. హిందూ సమాజంలోని ఈ అనైఖ్యతను అవకాశంగా మలచుకుని మైనార్టీ ఓట్ల కోసం రాజకీయ పార్టీలు పొర్లు దండాలు పెట్టేంత వరకూ దిగజారాయి. చంద్రబాబు హయాంలో కలియుగప్రత్యక్ష దైవం తిరుమలలో విలువైన వజ్రాల హారాలు మాయమయ్యాయంటూ ఆ నాడు వైసీపీ దుమ్మెత్తిపోసింది. విజయవాడలో దేవాలయాలు కూల్చారంటూ మొసలి కన్నీరు కార్చింది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనబడే పెద్దాయన చంద్రబాబు చేసిన హిందు వ్యతిరేక చర్యలపై ట్వీట్ చేశారు. విజయవాడలో గుడులు కూల్చి, అమరేశ్వరుడి గుడులు మింగి, దుర్గగుడిలో క్షుద్రపూజలు చేసి, అంతర్వేదిలో నిప్పుపెట్టించాడంటూ బాబును ఏకిపారేశాడు. అప్పుడంటే టీడీపీదే హవా.. మరి ఇప్పుడో.. తిరుమల భూములను అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమయ్యారు. చివరకు కోర్టు మొట్టికాయలు వేయటంతో ఆగిపోయారంటూ టీడీపీ గట్టిగానే ఎదురుదాడి చేస్తోంది. మీరు మూడు గుడులు కూల్చితే మేం ఆరు గుడులు కూల్చుతామంటూ ఇరు పార్టీలు వాదులాడుకుంటున్నాయి. ఈ లెక్కన.. హిందువుల మనోభావాలకు రాజకీయపార్టీలు ఎంత వరకూ గౌరవం ఇస్తున్నాయనేది తెలిసిపోతుందంటున్నాయి హిందు సంఘాలు. అంతర్వేదిలో రథం తగులబెట్టడాన్ని మంత్రి హోదాలో ఉండి కూడా అదేదో పిచ్చోడు చేసి ఉంటాడంటూ తేలికగా తీసుకోవటం ప్రభుత్వ చిత్తశుద్ధిని నిలదీసేలా ఉంది.
గతానికి భిన్నంగా హిందువులు ఏకమవుతున్నారనే సంకేతం.. అంతర్వేదిలో నిరసన ద్వారా తెలిపాయి హిందూ సంఘాలు. ఇప్పటి వరకూ మౌనంగా ఉంటూ వచ్చిన తమకూ ఆత్మాభిమానం కాపాడుకోవటం తెలుసనే విషయాన్ని సర్కార్‌కు తెలియజేశాయి. దీనికి భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా మద్దతు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం అంతర్వేది విచారణ విషయంలో ఎటువంటి తప్పటడుగు వేసినా తాము కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. న్యాయపోరాటం ద్వారా అయినా అసలు దోషులకు శిక్షపడేలా చేస్తామంటూ తేల్చిచెప్పారు. ఇటువంటి చర్యలకు ప్రభుత్వం పుల్‌స్టాప్ పెట్టకకోతే భవిష్యత్‌లో ఇది శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన సామాన్యుల్లో లేకపోలేదు. ఏమైనా.. ఏపీ కూడా మరో యూపీ మాదిరిగా.. మరో పశ్చిమబెంగాల్ మాదిరిగా తయారు చేయటంలో రాజకీయ పక్షాలు కూడా పాపం పంచుకుంటున్నాయనేది లౌకికవాదాన్ని సమర్ధించే సామాన్యుడి ఆవేదన.