పాపం.. వల్లభనేని కాలం కలసి రానట్టుంది. టీడీపీలో ఎదురైన చీత్కరింపులే.. వైసీపీలోను తప్పట్లేదు. చంద్రబాబు వరమిచ్చినా మంత్రి దేవినేని అప్పుడు చుక్కలు చూపించాడు. ఇప్పుడు జగన్ గూటిలోకి చేరి ఆశీస్సులు పొందినా.. సొంత వర్గ నాయకుడు యార్లగడ్డతో చికాకులు తప్పేలా లేవు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వంశీ తిరుగులేని నేత. కానీ టీడీపీలో ఉన్నంత కాలం ఎదురుగాలి తప్పలేదు. మొన్నటి ఎన్నికల్లో గెలిచి.. జగన్‌కు జై కొట్టినా మళ్లీ అదే వ్యతిరేకత . అది చివరకు.. సొంత నియోజకవర్గంలో తిరిగేందుకు అడ్డంకిగా మారిందన్నమాట. వైసీపీ సర్కారు గొప్పగా ఇస్తున్నామని చెబుతున్న పక్కా ఇళ్లు, స్థలాల పంపిణీ వైసీపీలో అంతర్గత పోరుకు కారణమవుతోంది. నందిగామ, గుంటూరు, గుడివాడ, గన్నవరం ప్రాంతాల్లో వైసీపీలో స్థలాల పంపిణీ చిచ్చు పెట్టింది. గన్నవరంలో తమకు స్థలాలు కేటాయించట్లేదంటూ వంశీను మల్లవల్లి గ్రామంలోకి అడుగుపెట్టనివ్వమంటూ అడ్డుకున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక వంశీ వెను తిరిగారట. గతంలోనూ గన్నవరంలో వైసీపీ నేతలు మూడు వర్గాలుగా మారి కోట్లాటకు దిగటం పార్టీను తరచూ ఇరుకున పెడుతోంది.
గత ఎన్నికల్లో వైసీపీ తరపున గన్నవరం నుంచి పోటీ చేయాలని భావించిన దుట్టా రామచంద్రరావుకు చివర్లో ఝలక్ ఇచ్చారు. వంశీను ఎదుర్కొనేందుకు యార్లగడ్డ వెంకట్రావుకు అవకాశం ఇచ్చారు. ఇద్దరూ కలిసే పనిచేయాలని చేతులు కలిపించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో నిలిచిన వంశీ గెలిచినా.. వైసీపీ అధికారంలోకి రావటంతో యార్లగడ్డదే రాజ్యమనేంతగా మారారు. దీంతో దుట్టా వర్సెస్ యార్లగడ్డ వర్గాల మధ్య తరచూ గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే వంశీ వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. దీంతో అక్కడ మూడుముక్కలాట మొదలైంది. వంశీ తానే వైసీపీ ఎమ్మెల్యేనంటూ ప్రకటించుకున్నారు. అలకబూనిని యార్లగడ్డకు ప్రభుత్వం నామినేటెడ్ పోస్టు నిచ్చి సంతృప్తి పరిచింది. అయినా.. మూడు వర్గాల మధ్య తరచూ ఏదోఒక రూపంలో గొడవలు జరుగుతున్నాయి. మంత్రులు కొడాలి, పేర్ని జోక్యం చేసుకుని సర్దిచెప్పి చేతులు కలిపించినా ఇప్పటికీ అదే పరిస్థితి. ఇదిలాగా కొనసాగితే.. వైసీపీ అంతర్గత పోరు కృష్ణాజిల్లా రాజకీయాలపై ప్రభావం చూపుతుందంటూ పార్టీ సీనియర్లు ఆందోళన వెలిబుచ్చుతున్నారట.