యుద్ధానికి రెఢీ కమ్మంటూ జిన్ పింగ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకు ఇచ్చిన పిలుపు. తైవాన్ సముద్రతీరంలో అమెరికా యుద్ధనౌకల విన్యాసం. భారత్ సరిహద్దుల్లో భారీగా మోహరించిన ఇండియన్ ఆర్మీ. అసలేం జరుగుతోందననే ఆందోళనతో ప్రపంచానికి కునుకు కరవైంది. ఐక్యరాజ్యసమితి కూడా శాంతియుత పరిష్కారం వైపు ఆలోచనలు చేస్తోంది. పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం చేయలేక ఎక్కడ పరవు పోగొట్టుకోవాల్సి వస్తుందనే భయంతో బిక్కుబిక్కుమంటోంది. అమెరికా ఈ మధ్యనే భారత్‌కు ఒక సూచన చేసింది. చైనా చాలా బలమైన శక్తి అనే సంగతి గుర్తుంచుకోవాలంటూ.. తన సాయం తప్పనిసరి అంటూ హింట్ ఇచ్చింది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కామన్ శత్రువు చైనాను దెబ్బతీసేందుకు మనకు మనం సాయం చేసుకోవాలంటూ తనదైన యుద్ధనీతిని.. ఆయుధాలను అమ్ముకునేందుకు ఉన్న అవకాశాలను వెతుక్కుంది. అమెరికా అంటే అదే.. అటు అఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులకు ఆయుధాలను విక్రయిస్తుంది.. అదే సమయంలో తన వద్ద పోగుపడిన ఆయుధాలను ఖర్చుచేసేందుకు వారిపైనే యుద్ధం సాగిస్తుంది. నిన్నటి వరకూ పాక్‌కు ఆయుధాలు అమ్ముతూనే.. అప్పుగా ఇస్తూనే అంటకాగిన అమెరికా ఇప్పుడు చైనా పాక్‌లు ఏకం కావటంతో భారత్ వైపు చూస్తుంది. ఇది యుద్ధం వరకూ దారితీసేందుకు అమెరికా మిలటరీ వ్యూహాల్లో భాగంగానే యుద్ధరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
చైనా యుద్ధం చేయాలని ఉబలాటం పెరుగుతోంది. భారత్‌కు సాయం చేస్తానంటున్న అమెరికాను లక్ష్యంగా చేసుకుంది. శత్రువును భయపెట్టేందుకు మరో శత్రువుపైకి కాలుదువ్వటం యుద్ధ వ్యూహాల్లో ఒక భాగం. చైనా ఇప్పుడు అదే చేస్తోంది. భారత్‌ను భయపెట్టేందుకు భూటాన్‌ను.. అమెరికాను రెచ్చగొట్టేందుకు తైవాన్‌తో తంపీలు పెట్టకుంది. ఈ ఏడాది వేసవికాలం భారత్ భూబాగాలను కబళించేందుకు చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీను పంపింది. జూన్‌లో ఫింగర్ 4 వద్ద మకాం వేసిన చైనా ఆర్మీను వెనక్కిపోమ్మంటూ భారత్ సైన్యం హెచ్చరించినా విన్లేదు. అర్ధరాత్రి వేళ భారత సైనికులపై చైనా ఆర్మీ పదునైన ఆయుధాలతో విరుచుకుపడింది. దొంగదెబ్బ తీసిన చైనీయులపై భారత్ సైనికులు విరుచుకుపడటంతో తోకముడిచారు. ఆ ఘటనలో కల్నల్ సంతోష్‌బాబుతో సహా 20 మంది సైనికులు వీరమరణం పొందారు. ఆ తరువాత భారత్ సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని తరలించింది. కొత్తగా సైన్యంలోకి ప్రవేశపెట్టిన యుద్ధట్యాంకులు, రఫెల్ యుద్ధవిమానాలు, ఆరు నెలల పాటు యుద్ధం చేసేందుకు అవసరమైన సాధనాసంపత్తిని తరలించే పనిలో పడింది. అరుణాచల్‌ప్రదేశ్ వద్ద భారీగా బలగాలను మోహరించింది.
ఇప్పుడు చైనా యుద్ధానికి సన్నద్ధమంటూ ఇచ్చిన పిలుపుతో భారత్ సర్వసన్నద్ధమైంది. మైత్రిదేశాల నుంచి అందే సాయం.. పాక్,చైనాలతో ఏకకాలంలో యుద్ధం చేసేందుకు వైమానికదళం సమర్థత అన్నీ పరీక్షించింది. కొత్తగా సైన్యానికి అండగా చేరిన రుద్ర, శౌర్య, కాళీ వంటి అత్యాథునిక క్షిపణులు, వ్యవస్థలు.. భారత్ ఆర్మీ తిరుగులేని శక్తి అనేందుకు అద్దంపడుతున్నాయి. అమెరికా, చైనా, రష్యా తరువాత అంతటి శక్తివంతమైన జలాంతర్గములు, క్షిపణులు, అణ్వాయుధాలున్న దేశంగా భారత్ అనేలా తలెత్తి నిలుస్తోంది. ఇప్పుడు ఇదే ఆత్మవిశ్వాసంతో ఇండియన్ ఆర్మీ ఒక్కఛాన్స్ అంటుంది. ఏళ్లతరబడి చైనా, పాకిస్తాన్ చేసే బెదిరింపులకు శాశ్వతసమాధానం చెప్పేందుకు యుద్ధమే శరణ్యమైతే.. మేం రెఢీ అంటూ రణనినాదాలు చేస్తున్నారు. శత్రుమూకలు మరోసారి భరతమాత వైపు కన్నెత్తి చూడాలంటే వణకుపుట్టేలా బుద్దిచెబుదామంటున్నారు.