ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక మాట అన్నారు. రోగం ఏదో తెలియకుండా రోగి లక్షణాలు గుర్తించకుండా వైద్యం అందించటం చాలా కష్టం. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే విధంగా మారింది. పార్టీకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రజల్లోకి ఎలా వెళ్లాలనేది సమస్యా! పార్టీను నడిపించే నాయకుడు లేకపోవటం సమస్యా! అనేది తేల్చుకోలేకపోతుంది. ముందుగా హస్తం తాము ఎదుర్కొంటున్న ఇబ్బందిపై స్పష్టత వస్తే పార్టీను నడపవచ్చంటూ విశ్లేషించారు. కాంగ్రెస్‌పార్టీను ఎవరు నడిపించాలి. ఎవరి సారథ్యంలో మళ్లీ ప్రజల్లో పాత వైభవం తెచ్చుకోవచ్చనే దానిపై కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయి. గాంధీ కుటుంబానికే పరిమితమైన కాంగ్రెస్‌ను అక్కడ నుంచి బయటపడేయాలనేది పార్టీ సీనియర్ల అంతరంగం.
కానీ.. సోనియాగాంధీ చుట్టూ ఉన్న కోటరీ మాత్రం దీన్ని పడనీయట్లేదు. అమ్మా మీరే మా అధ్యక్షురాలంటూ మౌనమోహనుడు, పటేల్ వంటి అతి వీర విధేయులు స్త్రోత్ర పఠనం చేస్తూనే ఉంటారు. రాహుల్‌కు పట్టాభిషేకం చేస్తే కాంగ్రెస్‌లో తమదే పెత్తనం అంటూ మురిసిపోయే బ్యాండ్‌మేళం బ్యాచ్ ఉండనే ఉంటుంది. మూడో వర్గం.. మరో వక్రచూపులు. ఇవన్నీ కాదహే.. అసలు ముమ్మూర్తులా.. నాయనమ్మను పోలిన.. ప్రియాంకగాంధీను రంగంలోకి దింపితే.. ఇందిరమ్మే మళ్లీ వచ్చిందంటూ భారతీయ ఓటర్లు.. సాష్టాంగ పడి పొర్లు దండాలు పెడతారంటూ ఉబ్బేస్తున్నారు. నిజానికి 135 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్‌కు భారతీయులతో ఉన్న బంధం వేరు. ఒక డాక్టర్ చెప్పినట్టు.. ఎన్ని బామ్‌లు వచ్చినా.. అమృతాంజన్ గొప్పతనం వేరు. ఇప్పుడు దేశంలో ఎన్ని జాతీయ, ప్రాంతీయపార్టీలు వచ్చినా కాంగ్రెస్ అనగానే ఓటర్లకు ప్రత్యామ్నాయం అనే భావన ఉండనే ఉంది. కానీ.. జనంలో ఈ నమ్మకాన్ని మరింత పెంచేందుకు సరైన నాయకత్వం లేకపోవటమే పార్టీను వెంటాడుతుంది. రాహుల్ గాంధీ నాయకత్వంపై ఇప్పటికీ పార్టీలోనే విబేధాలున్నాయి.
అసలు రాహుల్ దేశాన్ని నడిపించేంత పరిణితి, రాజనీతి సంపాదించాడా! అనేది కూడా సందేహమే. 2009లో యూపీఏ కూటమి 258 ఎంపీ సీట్లు సాధిస్తే.. 2014 నాటికి కాంగ్రెస్ ఎంపీ సీట్లు కేవలం 44కు చేరాయి. 2019లో మరీ ఘోరంగా మారింది. అంటే.. బీజేపీలో లోపాలు లేవా! నరేంద్ర మోదీ పాలన ఏమైనా రామరాజ్యాన్ని మరిపిస్తుందా! అంటే అదీ లేదు. కానీ.. ప్రజల తరపున మేమున్నామంటూ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా నిలబడలేకపోతుంది. పార్టీకు అధ్బుతమైన ఆదరణ ఉన్నా.. నడిపించే నాయకత్వం వెంటాడుతోంది. మున్ముందు పార్టీను మరింతగా కుంగదీసేందుకు ప్రత్యర్థులు అవసరం లేదు. సరైన నాయకత్వం ఎంపిక జరగకపోతే చాలంటున్నారు. బీజేపీ గెలవాలంటే.. కాంగ్రెస్‌కు రాహుల్ అధ్యక్షుడైతే చాలంటూ.. కమలం పార్టీ శ్రేణుల వ్యంగాస్త్రాలను హస్తం గుర్తించగలిగితే… 2024 నాటికి బీజేపీకు ప్రత్యామ్నాయంగా జనాల్లో కాస్తయినా సానుభూతి పొందగలరనేది విశ్లేషకులు సూచన.