డీఎస్.. ఉరఫ్ ధర్మపురి శ్రీనివాస్.. తెలుగు రాజకీయాల్లో కీలకమైన నాయకుడు. 2004, 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు కాంగ్రెస్ గెలపులో కీలక భూమిక పోషించిన నాయకుడు. పీసీసీ అధ్యక్షుడుగా సోనియాగాంధీ వద్ద మంచి గుర్తింపు. నమ్మిన పార్టీ పట్ల విధేయత, విశ్వాసంతో ఉంటారనే భావన. అంత మాంచి ట్రాక్ రికార్డు ఉన్న డీఎస్.. అకస్మాత్తుగా పార్టీ మారారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ కీలకంగా మారిన ఆయనను కేసీఆర్ తనదైన మాటలతో బోల్తాకొట్టించారో.. ఎమోషన్ చేసి మెస్మరైజ్ చేశారో తెలియదుకానీ.. డీఎస్ గులాబీ కండువా కప్పుకున్నారు. కానీ.. ఇన్నేళ్లపాటు పార్టీలో ఉన్న డీఎస్ స్థాయిలో గుర్తింపు రాలేదంటున్నారాయన. టీఆర్ ఎస్‌లోకి చేరటమే పెద్ద తప్పిదంమంటూ ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. నిజమే.. నిజామాబాద్‌లో డీఎస్ చాలా కీలకమైన నేత. జిల్లా, రాష్ట్ర రాజకీయాలలో వ్యూహాత్మకంగా మలుపుతిప్పగల రాజకీయ మేధావి కూడా. అంతటి నేత పార్టీ మారటమే అప్పట్లో సంచలనం. టీఆర్ ఎస్ కూడా సముచితంగానే గుర్తించినట్టుగానే వ్యవహరించి రాజ్యసభ సభ్యుడుగా గౌరవించింది. అంత వరకూ బాగానే ఉన్నా.. నిజామాబాద్ బరిలో కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఆధిపత్యం.. అంతా తానై నడిపించటాన్ని డీఎస్ వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. అక్కడ డీఎస్‌ను కూడా కార్యకర్తగానే జమకట్టడాన్ని భరించలేకపోయారు. మరో నేత ఎదుగుదల తనకే ప్రమాదమనే ధోరణిలో కవిత కూడా దూరాన్ని మరింత పెంచారు.
డీఎస్ కూడా దీన్ని అవమానంగానే భావించారు. తాను కోరింది కేసీఆర్ ఇవ్వలేదనే బాధను తన అనుచరుల వద్ద చెప్పారట కూడా. ఎంపీగా గాకుండా తెలంగాణ భవన్‌లో ఒక గది ఇచ్చి నిత్యం కార్యకర్తలతో మాట్లాడే అవకాశం కల్పించమని తాను కేసీఆర్‌ను కోరినా డీఎస్ అభిప్రాయం నెరవేరలేదు. తెలంగాణ భవన్‌లో సిబ్బంది తప్ప.. మరే ఇతర నాయకుడు కనిపించరంటూ
తన అనుభవాన్ని పంచుకున్నారు. కేకే వంటి బడా నాయకుడు కూడా.. సహనంతో భరిస్తున్నారనే అభిప్రాయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. సోనియాగాంధీ వద్ద ఉన్న కొందరు కోటరీలోని మనుషులు, తెలంగాణలో హస్తంలోని అంతర్గత శక్తుల ధాటికి తాను హస్తం వీడానంటూ గతాన్ని నెమరవేసుకున్నారు. నిజంగానే అప్పటికి అది సరైనదే అనిపించినా.. ఇప్పుడు అది తప్పిదంగానే అనుకుంటున్నారు. మళ్లీ కాంగ్రెస్ గూటికి రావటానికి తాను సిద్ధమా! కాదా అనేది కూడా కాలానికే వదిలేశారు.
డీఎస్ ఇంతటి మానసికక్షోభ అనుభవించటానికి ఆ నాడు హస్తం పెద్దలు ఎలాంటి ఎత్తులు వేశారో.. ఇప్పుడు టీఆర్ ఎస్ నుంచి డీఎస్‌ను బయటకు పంపేందుకు గులాబీలోని గురివిందగింజలు అలాగే చేశాయంటారాయన. గత ఎన్నికల సమయంలో డీఎస్ తనయుడు ధర్మపురి అర్వింద్ నిజామామాద్ బరిలో కాషాయపార్టీ తరపున పోటీపడి గెలిచారు. ఆయన పెద్ద కుమారుడుని కేసుల పేరిట జైలుకు కూడా పంపారనే ఆరోపణలున్నాయి. నర్సింగ్ కళాశాలలో ఆయన ప్రవర్తన సరిగాలేదంటూ విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదుతో డీఎస్‌ను మానసికంగా దెబ్బతీశారు. ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. టీఆర్ ఎస్ పార్టీ కార్యక్రమాలకు పిలుపులేకుండా పొమ్మనకుండానే పొగబెట్టినట్టుగా గులాబీ దండు.. డీఎస్‌పై దండయాత్ర చేసిందంటారాయన అభిమానులు.