ఇప్పుడే ఫేస్‌బుక్‌లో ఒక జర్నలిస్టు పోస్ట్‌చూశాను. 2009లో ప్రజారాజ్యంపార్టీ ఏర్పాటు చేసిన సమయంలో చిరంజీవి ఇంటర్వ్యూ కోసం వెళ్లినపుడు అనుభవాన్ని వివరించారు. చాలామంది హీరోలు కాస్త పేరు రాగానే అటిట్యూడ్ చూపించాలని ప్రయత్నిస్తారు. కానీ చిరంజీవి మాత్రం.. సార్ అంటూ సంబోధించటమే కాదు.. కళ్లతోనే తన సంతోషాన్ని పలికిస్తారు. లేచినిలబడి మరీ ఎదుటివారికి గౌరవం ఇస్తారు. నెంబర్‌వన్ ప్లేస్‌లో ఉన్నా ఇప్పటికీ అదే విధేయత ఆయన గొప్పతనానికి నిదర్శనమంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇదొక్కటే కాదు.. కొద్దిరోజుల క్రితం.. నలుగురు యువకులు ఎంతో కష్టపడి చిరంజీవి ఇంటికెళ్లారు. మొదటిసారి చూడటం. అప్పటి వరకూ వారందరిలో ఎన్నో అనుమానాలు. మెగాస్టార్ కు చాలా గర్వం.. కిందవాళ్లను చాలా చిన్నచూపు చూస్తారు.. మిమ్మల్ని కుర్చీలో కూడా కూర్చోమనకపోవచ్చంటూ ఎవరో చెప్పిన మాటలు వారికి గుర్తుకొచ్చాయి. ఆలోచనల్లో ఉండగానే ఆయన కిందకు వచ్చారు. ఏమ్మా.. మంచినీళ్లు తాగారా అంటూ ఆత్మీయంగా పలుకరించారు. మాట్లాడుతూనే చెక్‌బుక్ తీసి.. ఏమైనా సాయం కావాలా! అంటూ అడగటంతో వారిలో ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. చిరంజీవి గురించి ఎందుకింత విషప్రచారం చేస్తారనేది అర్ధంకాలేదంటూ ఆ నలుగురిలో ఒక మిత్రుడు తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. ఇవన్నీ జస్ట్..
రాజమండ్రిలో హోమియో ఆసుపత్రి కడుతున్నామంటూ నాటి ఎంపీ మురళీమోహన్ అడగ్గానే రూ.కోటి చెతికిచ్చారట. ఇలాంటి గుప్తధానాలు ఎన్నో.. మరెన్నో.. ఉంటాయి. కరోనా ఛారిటీ పేరుతో మూడోదఫా సినీ కార్మికులకు నిత్యావసరసరుకులు పంపిణీ చేస్తున్నారు. బ్లడ్‌బ్యాంక్‌కు జాతీయస్థాయిలో ఐదోర్యాంకు వచ్చింది కూడా ఈ మధ్యనే.. మొన్నీ మధ్య ప్లాస్మాదానంపై సైబరాబాద్ పోలీసులు ఆహ్వానిస్తే వెళ్లొచ్చారు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. తన వెంట.. కరోనా వచ్చి తగ్గిన నలుగురుని తీసుకెళ్లారు. వారితో ప్లాస్మాదానం చేయించారు. అంటే కేవలం మాటలు కాదు.. కరోనా వచ్చి తగ్గిన వారిపట్ల ఎంత ఆదరంగా ఉండాలని చెప్పటం కాదు.. చేసిచూపారంటూ చిరు అభిమానులు చెబుతుంటారు.
65 ఏళ్ల వయసులోనూ ఎందుకింత ఎనర్జటిక్‌గా ఉంటారంటే.. మనసులో ఏమి ఉంచుకోను. మానసిక ప్రశాంతతతో అన్నీ సాద్యమే అంటూ.. తరచూ చిరంజీవి చెప్పే మాట. సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన మెగాస్టార్ ఈ మధ్య.. తన తండ్రి, కుమారుడు ఫొటో ఉంచి.. ఈ ఇద్దరి నవ్వు తనకెంతో అపురూపమంటూ పంచుకున్నారు.
ఇవన్నీ ఒక నటుడుగానే కాదు.. సాటి మనిషిగా గొప్ప వ్యక్తిత్వం ఉందనేందుకు ఉదాహరణలు మాత్రమే. సాయం కోసం ఎవరొచ్చినా.. స్నేహితులు ఆపదలో ఉన్నట్టు తెలిసినా వెంటనే స్పందించే పెద్దమనసు ఆయన సొంతం. కేవలం చిరంజీవిలోని డ్యాన్స్‌లు.. డైలాగ్‌లు మాత్రమే ఆయన్ను మెగాస్టార్ చేయలేదు. కష్టం వచ్చిన ప్రతిసారి కసితో మరింత శ్రమించటం.. విజయం
వరించినపుడు అది తలకెక్కకుండా కొత్తదనం కోసం ప్రయత్నించటం ఆయన నైజం.. ఇన్ని కోట్ల మంది అభిమానులకు స్పూర్తిని.. జీవితంలో గెలుపోటములు ఎదుర్కొనేందుకు జీవితాన్ని పాఠంగా పంచిన చిరంజీవిని నవమాసాలు మోసి.. గొప్ప మనిషిగా తీర్చిదిద్దిన మాతృమూర్తి అంజనాదేవికి ప్రణామాలు.. మెగాస్టార్ చిరంజీవికి 65వ పుట్టినరోజు శుభాకాంక్షలు.