మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి పార్టీ మారబోతున్నారా! ఇన్నేళ్లు హస్తంతో ఉన్న బంధాన్ని తెంచుకోబోతున్నారా! అంటే రాజకీయవర్గాల్లో ఔననే సమాధానం వస్తుంది. కానీ జానారెడ్డి మత్రం నర్మగర్బంగా తన అంతరంగాన్ని వ్యక్తీకరించారు. పార్టీ మారతానని కానీ. మారనని కానీ చెప్పలేదు. బీజేపీ, తెరాస తనతో చర్చలు జరిపిన విషయం మీడియాకే తెలియా లన్నా రు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో అక్కడ ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన జానారెడ్డి మరోసారి పోటీకు నిలబడతారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి చాలా దారుణంగా మారింది. బలమైన కేడర్ ఉన్న చోట కూడా ఓటమి తప్పట్లేదు. ఉత్తమ్ రాజీనామాతో కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరనే అంశంపై మాణిక్ ఠాకూర్ స్వయంగా సంప్రదింపులు జరుపుతున్నారు.
బుధవారం అర్ధరాత్రి వరకూ సీనియర్ నేతలు అభిప్రాయం వెల్లడించారు. కానీ ఇప్పటికీ ఒక కొలక్కి రాన్నట్టుగా తెలుస్తోంది. పీసీసీ రేసులో సీనియర్లు, జూనియర్ల మధ్య అంతర్గత యుద్ధమే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటువంటి సమయంలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక హస్తం పార్టీకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. దుబ్బాక, జీహెచ్ ఎంసీలో ఎన్నికలతో మాంచి ఊపు మీదున్న బీజేపీ.. జానారెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించి గెలిచితీరాలని పంతం పట్టింది. ఈ మేరకు కాషాయ నేతలు కొందరు జానారెడ్డితో మంతనాలు జరిపారనే గుసగుసలూ వినిపించాయి. అయితే.. ఇన్నేళ్లపాటు కాంగ్రెస్ వెంట నడచిన జానారెడ్డి పార్టీ వీడాలా! లేదా! అనేదానిపై సందిగ్థంలో ఉన్నారట. ఆయన వీలుకాని పక్షంలో రఘురెడ్డి ని కాషాయ కండువా కప్పించి తాను పోటీ నుంచి తప్పుకునే యోచనల కూడా ఉన్నారట. వారసుడు రాజకీయ భవితవ్యం కోసం జానారెడ్డి త్యాగం చేయబోతున్నారన్నమాట ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది.