తిరుపతి ఉప ఎన్నికలు పార్టీలకు సవాల్‌గా మారాయి. ఇప్పటికే ఏపీ స్థానిక ఎన్నికలు వైసీపీను ఇరుకున పెడుతున్నాయి. ఎన్నికలు జరిగితే.. వైసీపీ వైపు జనం నిలబడతారా! విపక్షానికి అనుకూలంగా మారుతుందా! అనే అనుమానం కూడా జగన్ ప్రభుత్వానికి ఇరకాటంగా పరిణమించాయి. ఇటువంటి సమయంలోనే 2021లో జరగాల్సిన తిరుపతి ఉప ఎన్నిక వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకవంటిదనే భావిస్తూ వచ్చారు. కానీ.. తెలంగాణలోని దుబ్బాకలో అనూహ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలవటంతో ఏపీ సర్కార్‌కు అప్రమత్తమైంది. సెంటిమెంట్‌ను కాదని.. గురుమూర్తి అనే కొత్త అభ్యర్థి పేరును తెరమీదకు తెచ్చింది. టీడీపీ పనబాక లక్ష్మిని బరిలోకి నిలుపుతున్నట్టు ప్రకటించింది. బీజేపీ, జనసేన రెండు పార్టీలు కూడా తిరుపతి ఉప ఎన్నికలను తమకు రిఫరెండంగానే భావిస్తున్నాయి.
అక్కడ కుల సమీకరణలు కూడా తమకు అనుకూలిస్తాయనేది జనసేన, బీజేపీ నేతల నమ్మకం. ఇద్దరు నేతలు కాపు వర్గానికి చెందిన వారు కావటం.. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కాపుల ప్రాభల్యం ఉండటంతో తమకు కలసి వస్తుందనే అంచనా వేసుకుంటున్నారు. ఇక్కడ గెలుపు సాధించటం ద్వారా 2024 ఎన్నికల నాటికి తాము మరింతగా జనాల్లోకి సానుకూలంగా వెళ్లాలనేది ఎన్నికల్లో పోటీకి నిలబడేందుకు అసలు కారణం. కానీ.. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తామే ఈ దఫా పోటీ పడుతున్నట్టు ప్రకటించారు. జనసేనతో పొత్తు ఉన్న సమయంలో తమతో చర్చించకుండా తానే ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ జనసేన నాయకుడు కిరణ్ కొట్టిపారేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన బరిలో నిలబడి గెలిచి తీరుతామనే ధీమాతో ఉన్నారు. ఈ లెక్కన.. తిరుపతి ఉప ఎన్నికలో జనసేన దాదాపు పోటీ చేస్తుందనే అర్ధమవుతోంది. మొన్న జనసేనాని పవన్ ఢిల్లీ పర్యటనలోనూ బీజేపీ అధిష్ఠానం సేనానికి హామీ ఇచ్చినట్టుగానే తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే… 2021 వరకూ ఆగాల్సిందే.



