పాపం రాజోలు ఎమ్మెల్యే రాపాక పరిస్థితి అటు.. ఇటూ గాకుండా మారిందట. వైసీపీ వాళ్లు రావద్దుంటున్నారు.. జనసేన వాళ్లు చీ కొడుతున్నారు. ఇలా ఏ పార్టీకు చెందకుండా ఒంటరిగా మారారట. 2009లో మొదటిసారి కాంగ్రెస్ నుంచి రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 2014లో వైసీపీ తరపున సీటు కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. అక్కడ రాపాకకు సరైన వాతావరణం లేకపోవటం .. నియోజకవర్గంలో వ్యతిరేకత ఉండటంతో బొంతును నిలిపింది వైసీపీ. అలా పార్టీ టికెట్ రాకపోవటంతో.. జనసేనలోకి చేరారు. గతంలో రాజుల సామాజికవర్గ ఓటర్లు ఉండే రాజోలులో కాపులు బాగా పెరిగారు. నిర్ణయాత్మకశక్తిగా మారారు. కాపుల ఓట్లే గెలుపోటములను నిర్ణయించటంలో కీలకమయ్యాయి. అక్కడ పవన్‌కళ్యాణ్ పట్ల ఉన్న అభిమానం. జనసేన కేడర్ బలంగా పనిచేయటంతో రాపాక తేలికగా గెలిచారు. అప్పటి వరకూ పవన్ నాయకత్వాన్ని ఆమోదించిన రాపాక ప్లేటు పిరాయించారు. తాను వైసీపీ ఎమ్మెల్యేనంటూ ప్రకటించుకుని సీఎం జగన్‌ను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ తరువాత మళ్లీ వైసీపీతోనేనంటూ సీఎంను ప్రశంసలతో ముంచెత్తారు. పైగా జనసేన కనుమరుగయ్యే పార్టీ అంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. పవన్ నాయకత్వం పట్ల చులకనగా స్పందించారు. దీంతో జనసేన కార్యకర్తల నుంచి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇటీవల స్థానిక ఎన్నికల సమయంలోనూ సమావేశాలకు రావద్దంటూ జనసైనికులు బయట బ్యానర్లు ఏర్పాటు చేశారు.
అంతమాత్రాన.. ఆయనకు వైసీపీలో పెద్దపీట వేశారనుకోవటం పొరపాటే. ఎందుకంటే.. వైసీపీ సమావేశాలకు కార్యకర్తలు పిలవట్లేదు. అసలు ఆ పార్టీకు సంబంధించిన ఎవ్వరూ రాపాక వద్దకు రావట్లేదట. వైసీపీ సమన్వయకర్త అమ్మాజీతో తమ పనులు చేయించుకుంటున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో రాపాక ఎమ్మెల్యేగా అధికార కార్యక్రమాల్లో మాత్రమే కనిపిస్తున్నారట. జనసేనను వదలి వెళితే వైసీపీలో తనకు ఎర్రతివాచీ పరుస్తారని భావించిన రాపాక ఊహించని పరిణామాలతో షాక్ కు గురయ్యారట. ఇటు జనసేన.. అటు వైసీపీ రెండికీ చెడిన రాపాక రేపటి రాజకీయ జీవితం ఎలా ఉంటుందనేది… రాజోలు ఓటర్లే తేల్చాలి. అది తెలియాలంటే 2024 వరకూ వేచిచూడాలి.