జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారా! కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడతారా! బల్దియా పోరు నుంచి జనసేన అభ్యర్థులను ఎందుకు తప్పించారు? ఇవన్నీ అంతుబట్టని అంశాలు. దీనికి సమాధానం ఒక్కటే జనసేనాని ఢిల్లీ యాత్రం. మంగళ, బుధవారాల్లో ఢిల్లీలోని పలువురు బీజేపీ నేతలను కలవనున్నారు. వీలైతే ప్రధానమంత్రి నరేంద్రమోదీతోను బేటీ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. బిజీగా ఉండే ప్రధాని అపాయింట్‌మెంట్ ఎంత వరకూ దొరుకుతుందనేది కూడా సస్పెన్స్‌గా మారింది. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని సేనాని వెల్లడించారు. అయితే.. విడిగా బరిలో ఉండటం వల్ల బీజేపీకు పోలయ్యే హిందు, సీమాంధ్రుల ఓట్లు చీలిపోతాయనే ఉద్దేశంతో బీజేపీ పెద్దలు రంగంలోకి దిగారు. స్వయంగా కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ వంటి కమలం పెద్దలు పవన్‌ను కలిసి పొత్తుపై చర్చించారు. దీంతో పవన్ స్వయంగా పోటీ నుంచి తప్పుకోమంటూ అభ్యర్థులను ఆదేశించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు. కలసి పోరాడితే బలపడతామనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
దుబ్బాకలోనూ పవన్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు మద్దతు ప్రకటించారు. ఫలితంగా మున్నూరు కాపు ఓట్లు దాదాపు కమలం గుర్తుకే పడినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో మున్నూరుకాపు, ఏపీలో కాపులు రెండు ఒకే వర్గానికి చెందిన వారు కావటంతో. రెండుచోట్ల కలిసే పనిచేయాలనే ఆలోచనలో ఆ పార్టీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. వరుసగా చోటుచేసుకుంటున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆహ్వానం మేరకు పవన్ డిల్లీ వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఏపీలో రాజకీయ పరిస్థితులు. జమలి ఎన్నికలకు ఏ విధంగా సిద్ధమవ్వాలనే అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. అదే సమయంలో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పవన్ ప్రచారం చేస్తారా! లేదా అనేది తేలనుంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఆయన చిత్రసీమకు పలు రాయితీలు ప్రకటించటంపై ట్వీట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఇప్పుడు చిరు సోదరుడు పవన్ ఒకవేళ గ్రేటర్ ప్రచారంలో పాల్గొంటే కేసీఆర్‌ను తప్పనిసరిగా విమర్శించాల్సి వుంటుంది. ఈ లెక్కన. అన్నయ్య పొగిడితే.. తమ్ముడు విమర్శించాడనే విషయాన్ని ప్రత్యర్థులు
అవకాశంగా మలచుకోవచ్చు.