జేసీ దివాకర్ రెడ్డి తిట్లతో డిక్షనరీ. ఎన్‌సైక్లోపిడియా అని కూడా అనాలేమో. 76 ఏళ్ల వయసులో ఎవరితో ఎలా మాట్లాడాలనే ఇంగితం మరిచారనే విధంగా మాట్లాడుతున్నారు. ఏపీ మంత్రి కొడాలి నాని కూడా బూతు పురాణంలో నాకంటే చిన్నోడే అనేంతగా దూషణ పర్వంలో చెలరేగుతున్నారు. నిజమే.. ఇన్నాళ్ల రాజకీయాల్లో ఎన్నడూ ఇలాంటి పరాభవం చవిచూడలేదు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి.. తన మన బేధం లేకుండా ఎవర్ని ఎక్కడ ఉంచాలో.. ఎలా వంచాలనే దానిపై క్లియర్‌గా ఉన్నారు. అందుకే.. పాత తప్పులను బయటకు తీసి.. ఉరికిచ్చి ఉరికిచ్చి మరీ ఊచలు లెక్కపెట్టిస్తున్నారు. ఆయనకూ తెలుసు.. భవిష్యత్‌లో తాము ప్రతిపక్షంలో చేరినపుడు అధికార పార్టీ నుంచి ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఆయినా ఏ మాత్రం వెనుకాడట్లేదు. నిన్నటి వరకూ టీడీపీ హయాంలో కాంగ్రెస్ ఏలుబడిలో తొడకొట్టి. మీసం మెలేసి.. మమ్మల్ని మించిన దమ్మున్నవాడు లేడని విర్రవీగిన వీరపోతురాజులకు జగన్ చుక్కలు చూపుతున్నారు. సామాన్యుల్లో ఇది పాజిటివ్‌గా వెళ్తోంది. ప్రతికూల మీడియా.. ప్రతిపక్షాలు ఎంత విమర్శలు గుప్పించినా పబ్లిక్‌లో అచ్చెన్న , కొల్లు రవీంద్ర అరెస్టులు, జేసీ బ్రదర్స్ పాపాల జాబితాను బయటకు తీయటం.. యరపతినేని వంటి మైనింగ్ మాఫియా చక్రవర్తిపై సీబీఐ కేసుకు ఓకే చెప్పటం ఇవన్నీ జగన్‌ను నాయకుడుగా జనం ముందు బలమైన వ్యక్తిగా నిలబెడుతున్నాయి. జేసీ బ్రదర్స్ కూడా రెడ్డి వర్గీయుడుగా జగన్ తమను చూసీచూడనట్టుగా వదిలేస్తాడని చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నారు. కానీ.. జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి దశాబ్దాల అవినీతిని బహిర్గతం చేస్తున్నారు. అయితే.. అధికారంలో ఉన్నా లేకపోయినా తమ పబ్బం గడుపుకునేందుకు అవసరమైన పైరవీలు చేయగల వారికి ఇప్పుడు జగన్ తీరు రుచించట్లేదు. అంతే.. విచక్షణ కోల్పోయారు. పోలీసులను లక్ష్యంగా చేసుకుని అన్నదమ్ములు చేసిన విమర్శలు..బూతుల దండకం.. సగటు పౌరుల్లోనూ ఆవేశం రగిలించేలా చేసింది. కళ్లెదుట కనిపిస్తున్నా.. జేసీ బ్రదర్స్ ఇప్పటికీ తమ ధోరణిని మార్చుకోపోవటం.. పార్టీకు ఇబ్బందులు తెచ్చిపెడతాయని టీడీపీ సీనియర్ల ఆవేదన.. ఆందోళన కూడా.