ఔనా.. నిజమేనా! అని అనుమానం వద్దంటున్నారు మాజీ ఎంపీ వివేక్. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సంచలన కామెంట్స్ చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే లక్ష్యంతో ఎన్డీఏకు దగ్గరవుతున్నారంటున్నారు. కేటీఆర్‌ను సీఎం చేసి తాను ఎంచక్కా కేంద్రంలో పాగావేయాలనే ప్రయత్నంలో ఉన్నారంటూ బాంబు పేల్చారు. దీనిలో వాస్తవం సంగతి ఎలా ఉన్నా ఎంపీ సాబ్.. కేసీఆర్ అలా ఆలోచిస్తారంటారా! అనేది డౌటానుమానం. అసలు ఈ ఆరోపణలకు అసలు కారణం ఏమిటంటే.. నదీజలాల పంపకం విషయంలో ఏపీ , తెలంగాణ మధ్య గొడవ జరుగుతుంది. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ప్రాజెక్టులను ఆపటంలో కేసీఆర్ కావాలనే కాలయాపన చేస్తున్నారనేది వివేక్ ఉద్దేశమట. ఏపీ సీఎం జగన్‌తో స్నేహంగా ఉండటం ద్వారా తెలంగాణలో టీడీపీను దెబ్బతీయటం.. అదే సమయంలో రెండు పార్టీల ఎంపీల బలాన్ని చూపుతూ ప్రధాని నరేంద్రమోదీకు దగ్గర కావటం చేస్తున్నారట. పైగా.. జగన్‌పై ఈగ వాలినా కేసీఆర్ ఊరుకోవట్లేదనే ప్రచారం లేకపోలేదు. ఎంతైనా.. టీడీపీ ఇద్దరికీ శత్రువు ఇకపోతే బీజేపీతో అంటారా. ఎవరి అవసరాలు వారికి ఉంటాయి కాబట్టి.. సందర్భానికి తగినట్టుగా మోదీను ఆకాశానికి ఎత్తేస్తారు. మరీ అవసరమైతే తిట్లపురాణంతో దండెత్తనూ గలరు. బాలకృష్ణ లా హిందీలో తిట్టకపోయినా.. తెలుగులో మాత్రం మోదీపై విమర్శలు గుప్పించను గలరు. అయినా కేసీఆర్ ఎవరి సాయంతోనే కేంద్రంలో పాగా వేయాలని అనుకోవటం లేదు.. అవసరమైతే తానే నాలుగో ఫ్రంటో.. ఐదో ఫ్రంటో ఏర్పాటు చేసి.. రాజకీయ ఉద్దండులను ఏకం చేయాలనే పథకరచన చేస్తున్నారు.
కారుతో ఢిల్లీ వెళ్లాలనుకుంటున్నారు కానీ.. కాషాయ కండువాతో కాదని.. టీఆర్ ఎస్ శ్రేణులు ధీమాగా చెబుతున్నాయి.
కేసీఆర్ . తాను చెప్పిందే వేదం.. పలికిందే వాస్తవం. ఎవరో వేసిన దారిలో నడవకుండా తనకంటూ ప్రత్యేక మార్గం వేయగల సమర్థుడు కూడా. ముందస్తు ఎన్నికల్లోనూ అదే చాణక్యత ప్రదర్శించి అవలీలగా విజయం సాధించారు. జాతీయరాజకీయాల్లో చక్రం తిప్పాలనే బలమైన కోరికతో 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీకు వ్యతిరేకంగా కూటమి కట్టారు.. చంద్రబాబు ఓ వైపు కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తే.. కేసీఆర్ మాత్రం.. ఢిల్లీ గద్దె నుంచి మోదీ ను దించేందుకు బలంగానే ప్రయత్నించారనేది జగమెరిగిన సత్యం. అటువంటి కేసీఆర్.. ఇప్పుడు ఎన్డీఏ ఇచ్చే ఉప ప్రధాని పదవి కోసం తెలంగాణ నదీజలాలను వదలకుంటున్నారనేది కాస్త విడ్డూరంగానే ఉందంటున్నారు టీఆర్ ఎస్ అభిమానులు.